ఆగని గంజాయి దందా: విశాఖ నుండి మహారాష్ట్రకు తరలిస్తున్న 3కోట్ల విలువైన భారీ గంజాయి పట్టివేత!!
ఏపీ నుండి దేశంలోని ఇతర రాష్ట్రాలకు గంజాయి అక్రమ రవాణా జోరుగా జరుగుతుందన్న వార్తల నేపధ్యంలో ఎంత పటిష్టమైన నిఘా పెట్టినా సరే గంజాయి దందా ఆగటం లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీసులు,స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు, ఎక్సైజ్ అధికారులు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నా, తెలంగాణా రాష్ట్రం భారీ నిఘా పెట్టినా సరే గంజాయి అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడటం లేదు. అంతరాష్ట్ర గంజాయి స్మగ్లర్లు రెచ్చిపోతూనే ఉన్నారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లోని సీలేరు నుంచి మహారాష్ట్రకు హైదరాబాద్ మీదుగా గంజాయి తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో రాచకొండ పోలీసులు రంగంలోకి దిగి 1240 కిలోల 2.08 కోట్లు విలువైన భారీ గంజాయిని సీజ్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా మరోమారు భారీ గంజాయి పట్టుబడింది.

1,820 కిలోల భారీ గంజాయిని పట్టుకున్న పోలీసులు
దేశంలో ఎక్కడ గంజాయి దొరికినా దానికి కేరాఫ్ అడ్రస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖ ఏజెన్సీ అన్న చర్చ జరుగుతుంది. ఈ మధ్య కాలంలో నిత్యం పట్టుబడుతున్న గంజాయి కేసులన్నీ విశాఖ ఏజెన్సీ నుండి గంజాయి తరలిస్తున్న కేసులే కావటం గమనార్హం. ఏకంగా విశాఖ ఏజెన్సీ నుండు అమెజాన్ ద్వారా కూడా గంజాయి దందా జరిగింది అంటే ఎంతగా గంజాయి మాఫియా విస్తరించిందో అర్ధం అవుతుంది. ఇక గంజాయి అక్రమ రవాణాకు చెక్ పెట్టడం కోసం దృష్టిసారించిన తెలంగాణ పోలీసులు, మరో మారు భారీగా గంజాయిని పట్టుకున్నారు.హైదరాబాద్ శివార్లలోని అబ్దుల్లాపూర్‌మెట్ వద్ద ట్రక్కులో 1,820 కిలోల గంజాయి (గంజాయి) స్వాధీనం చేసుకోవడంతో తెలంగాణ పోలీసులు మరో అంతర్ రాష్ట్ర డ్రగ్స్ రవాణా రాకెట్‌ను ఛేదించారు.

మూడు కోట్ల విలువైన గంజాయిని సీజ్ చేసిన పోలీసులు
రాచకొండ పోలీస్ కమిషనరేట్‌లోని స్పెషల్ ఆపరేషన్స్ టీమ్ (SOT) ఐదుగురు గంజాయి స్మగ్లర్లను అరెస్టు చేసి, ఆంధ్రప్రదేశ్‌లోని సీలేరు నుండి మహారాష్ట్రకు తరలిస్తున్న గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.సీలేరు నుంచి నర్సీపట్నం, రాజమండ్రి, కోదాడ, సూర్యాపేట, చౌటుప్పల్, హైదరాబాద్ మీదుగా మహారాష్ట్రకు గంజాయి తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. వారి వద్ద నుంచి రూ.3 కోట్ల విలువైన 182 గంజాయి ప్యాకెట్లు, ఒక లారీ, ఒక కారు, రూ.41 వేల నగదు, ఏడు మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఏపీ సీలేరు నుండి మహారాష్ట్రకు గంజాయి అక్రమ రవాణా
నిర్ధిష్ట సమాచారం మేరకు ఎస్ఓటీ, ఎల్బీ నగర్ మండలం అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులతో కలిసి గంజాయి వ్యాపారులను పట్టుకున్నారు. వీరిలో నలుగురు మహారాష్ట్రకు చెందిన వారు కాగా, ట్రక్కు డ్రైవర్ పశ్చిమ బెంగాల్‌కు చెందినవాడు .ప్రధాన నిందితుడు మహారాష్ట్రలోని ఉస్మానాబాద్‌కు చెందిన సంజయ్ లక్ష్మణ్ షిండే పరారీలో ఉన్నాడు. అతను తన బంధువులు సంజయ్ బాలాజీ కాలే, అభిమాన్ కళ్యాణ్ పవార్ మరియు వారి స్నేహితులు సంజయ్ చౌగులే మరియు భరత్ కాళప్పతో కలిసి రాకెట్ నడుపుతున్నాడు. ఆంధ్రప్రదేశ్‌లోని సీలేరు ఏజెన్సీ ప్రాంతం నుంచి మహారాష్ట్రకు అక్రమంగా గంజాయి రవాణా చేసేందుకు పశ్చిమ బెంగాల్‌కు చెందిన షేక్ రహీదుల్ అనే వ్యక్తి లారీ డ్రైవర్ గా పెట్టుకున్నారు.

ఆర్గానిక్ కంపోస్ట్ బ్యాగుల క్రింద గంజాయి, ఈ ఏడాది ఇదే భారీ గంజాయి
గంజాయి ప్యాకెట్లను ఆర్గానిక్ కంపోస్ట్ బ్యాగుల కింద దాచి ఉంచినట్లు రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ తెలిపారు. నిందితులు మాదక ద్రవ్యాలను తరలిస్తున్న ట్రక్కుకు పైలట్ వాహనంగా కారును ఉపయోగిస్తున్నారని తెలిపారు. కిలో గంజాయిని రూ.8వేలకు కొనుగోలు చేసి మహారాష్ట్రలోని వినియోగదారులకు కిలో రూ.15వేలకు విక్రయిస్తున్నట్లు నిందితులు పోలీసులకు తెలిపారు. రాచకొండలో ఈ ఏడాది ఇప్పటివరకు పట్టుకున్న గంజాయిలో ఇదే అత్యధికమని రాచకొండ పోలీస్ కమీషనర్ తెలిపారు. 5,000 కిలోలకు పైగా గంజాయిని ఇప్పటివరకు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్లలో నగరంతోపాటు శివారు ప్రాంతాలు, ఎక్సైజ్ శాఖలు డ్రగ్స్‌పై కఠినంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు గత నెల నుంచి ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు.