• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

విషాదం: షిర్డీలో అదృశ్యమై గాంధీ ఆస్పత్రిలో విఠల్ రావు మృతి

By Pratap
|

హైదరాబాద్: గజల్స్ రారాజుగా ప్రఖ్యాతి వహించిన విఠల్‌రావు అభిమానులను విషాదంలో ముంచుతూ కన్నుమూశారు. తెలంగాణ రాష్ట్ర వేడుకల్లో సాహితీరంగంలో రాష్ట్ర అవార్డు అందుకోవాల్సి ఉండింది. అయితే అంతకుముందే విఠల్‌రావు అదృశ్యమయ్యారు.

ఆయన జాడ కోసం కుటుంబసభ్యులు ఎంతగా గాలించినా ఫలితం లేకపోయింది. చివరికి సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. గోషామహల్ హిందీనగర్‌లో నివాసముండే విఠల్‌రావు గత నెల 29వ తేదీన కుటుంబసభ్యులతో కలిసి షిర్డీ దర్శనానికి వెళ్లారు. దర్శనం తర్వాత తప్పిపోయిన విఠల్‌రావు ఆచూకీకి వెతికినా ఫలితం లేకపోవడంతో స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Vittal Rao

ఈ నెల 24న సికింద్రాబాద్ కంట్రీ క్లబ్‌ వద్ద ఓవర్ బ్రిడ్జి కింద విఠల్‌రావు అపస్మారక స్థితిలో పడి ఉండటంతో 108 సిబ్బంది వెంటనే ఆయన్ను గాంధీ దవాఖానకు తరలించారు. అదే రోజు రాత్రి ఆయన మృతి చెందారు. మొదట పోలీసులు గుర్తు తెలియని మృతదేహం అనుకున్నారు. చివరకు గజల్ సింగర్ విఠల్‌రావుదిగా గుర్తించి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. ఆయన కుమారుడు సంతోశ్ శుక్రవారం గాంధీ ఆస్పత్రికి వెళ్లి చనిపోయిన వ్యక్తి తన తండ్రేనని గుర్తించారు.

1930 మే 19వ తేదీన హైదరాబాద్‌లో జన్మించిన విఠల్ రావు తన ప్రాయం నుంచే ఆలిండియా రేడియో పిల్లల కార్యక్రమంలో తన గజల్స్ వినిపించి శ్రోతల మన్ననలు అందుకున్నారు. నిజాం నవాబుల మన్ననలు సైతం అందుకున్నారు. గజల్ విఠల్‌రావుకు భార్య తారాబాయి, కుమార్తెలు సంధ్య, బింధ్య, సీమతోపాటు కుమారులు సంజయ్‌రావు, సంతోశ్ ఉన్నారు.

గోషామహల్ హిందీనగర్‌లోని తన నివాసంలో సంగీత్ సాధన్ పేరుతో 1983 నుంచి సంగీత పాఠశాలను కొనసాగిస్తున్నారు. ఇక్కడి నుంచి ఎంతోమంది జాతీయ, అంతర్జాతీయ కళాకారులుగా ఎదిగారు. విఠల్‌రావు కచేరీతో సంతృప్తి చెందిన నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ గోషామహల్‌లో ప్రస్తుతం నివాసముంటున్న ఇంటి స్థలాన్ని కానుకగా ఇచ్చారు.

ఆయన పలు రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ అవార్డులను అందుకున్నారు. 1995లో అప్పటి ప్రధాని పీవీ నర్సింహారావు ద్వారా అవార్డు, 2001లో కెనడాలో గ్యాలిక్ అకాడమీ అవార్డు, 2004లో అప్పటి గవర్నర్ సుర్జీత్‌సింగ్ బర్నాల నుంచి రాష్ట్ర స్థాయి అవార్డు, 2007లో అమీర్ కుస్రో సొసైటీ ఆఫ్ కెనడా అవార్డు, 2008లో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్ అవార్డ్ ఆఫ్ న్యూజిలాండ్, న్యూఢిల్లీలోని బేగం అక్తర్ అకాడమీ అవార్డు, ఇటీవల పద్మభూషణ్ డాక్టర్ సీ నారాయణరెడ్డి చేతుల మీదుగా జీవిత సాఫల్య పురస్కారం అందుకున్నారు.

గజల్ గాయకుడు విఠల్‌రావు మరణంపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఏడో నిజాం ఆస్థానంలో విద్వాంసుడిగా పనిచేసిన విఠల్‌రావు దేశవ్యాప్తంగా మంచి పేరున్న కళాకారుడని సీఎం కొనియాడారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా విఠల్‌రావును ప్రత్యేకంగా గుర్తించి, పారితోషికాన్ని ప్రకటించిన విషయాన్ని సీఎం గుర్తు చేశారు. విఠల్‌రావు కుటుంబసభ్యులు, శిష్యులకు సానుభూతి తెలిపారు.

English summary
Telangana Gazal singer Vittal Rao passed away in Gandhi hospital. He missed at Shirdi last month. Telangana CM K chandrasekhar Rao condoled the death of Vittal Rao.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X