
అస్సాం సీఎంపై మహిళా కమీషన్ కు ఫిర్యాదుచేసిన మాజీమంత్రులు గీతా రెడ్డి, రేణుకా చౌదరి
అస్సాం సీఎం హిమంత బిస్వ శర్మ రాహుల్ గాంధీ పుట్టుక పై చేసిన అనుచిత వ్యాఖ్యలపై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఫిర్యాదుల పరంపరను కొనసాగిస్తున్నారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో అస్సాం సీఎం హిమంత బిస్వ శర్మపై ఫిర్యాదు చేసి ఆయన పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో న్యాయనిపుణుల సలహా తీసుకొని జూబ్లీహిల్స్ పోలీసులు అస్సాం సీఎం హిమంత బిస్వ శర్మపై కేసు నమోదు చేశారు.

అస్సాం సీఎంపై మహిళా కమీషన్ కు ఫిర్యాదు
తాజాగా అస్సాం సీఎం హిమంత బిస్వ శర్మ వ్యాఖ్యలపై మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేశారు తెలంగాణ కాంగ్రెస్ మహిళా నేతలు. మహిళా కమిషన్ ను కలిసిన మాజీ మంత్రి గీతారెడ్డి, రేణుకాచౌదరి రాహుల్ గాంధీపై అస్సాం ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలపై ఫిర్యాదు చేశారు. ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్న మూర్ఖుడు అస్సాం సీఎం హిమంత బిస్వ శర్మ అని మాజీ మంత్రి గీతారెడ్డి నిప్పులు చెరిగారు. రాహుల్ గాంధీపై చేసిన వ్యాఖ్యలకు ఆయనను సీఎం పీఠం నుంచి పీకి పడేయాలని విమర్శించారు.

మహిళలంటే బీజేపీకి ఏ మాత్రం గౌరవం లేదు: మాజీ మంత్రి గీతా రెడ్డి
సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునే వ్యాఖ్యలు చేశారని మాజీ మంత్రి గీతారెడ్డి అస్సాం సీఎం పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సర్జికల్ స్ట్రైక్ గురించి అడిగితే తండ్రి ఎవరని అడుగుతారా అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మహిళలంటే బీజేపీకి ఏ మాత్రం గౌరవం లేదని, బీజేపీకి మహిళలపై గౌరవమే ఉంటే అస్సాం సీఎం వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ మహిళా నేతలు డిమాండ్ చేశారు. తన పుట్టుకపై నీచమైన కామెంట్స్ చేసినా రాహుల్ గాంధీ పల్లెత్తు మాట అనలేదని, అది ఆయన సంస్కారానికి నిదర్శనం అని కాంగ్రెస్ మహిళా నేతలు పేర్కొన్నారు.

మహిళల తరపున ఫిర్యాదు చేశాం : గీతా రెడ్డి
దివంగత రాజీవ్ గాంధీని అవమానించారని మండిపడ్డారు మాజీ మంత్రి గీతా రెడ్డి. సోనియా గాంధీని అవమానించినట్టుగా చేసిన వ్యాఖ్యలపై మహిళల తరపున మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేశామని మాజీ మంత్రి గీతారెడ్డి తెలిపారు. తెలంగాణా మహిళా కమిషన్ చైర్ పర్సన్ సునీత లక్ష్మారెడ్డి ఈ వ్యవహారం తన పరిధిలోకి రాదని కేంద్ర కమీషన్ కు పంపిస్తామని చెప్పారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గీతా రెడ్డి వెల్లడించారు.

ఖబడ్దార్ హిమంత బిస్వ శర్మ: రేణుకా చౌదరి వార్నింగ్
కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి సర్జికల్ స్ట్రైక్ పై తమ సంధించిన ప్రశ్నకు జవాబు చెప్పలేక అస్సాం సీఎం హిమంత బిస్వ శర్మ పిచ్చిపిచ్చిగా మాట్లాడారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఖబడ్దార్ హిమంత బిస్వ శర్మ అంటూ హెచ్చరికలు జారీ చేశారు. ఇది ఆరంభం మాత్రమే ముందు ముందు చాలా ఉంటుందని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రంలో ఆందోళనలు చెయ్యకుండా కాంగ్రెస్ మహిళా నేతలను కూడా హౌస్ అరెస్టు చేయడం సిగ్గుచేటని ఆమె మండిపడ్డారు. ఇక పోలీస్ స్టేషన్ లో పెట్టిన కేసుల సెక్షన్లలో కూడా మార్పులు చేయాలని మాజీ ఎంపీ, మాజీ కేంద్రమంత్రి రేణుకా చౌదరి డిమాండ్ చేశారు.