దళితబంధుపై కేసీఆర్ బెదిరింపులు, ఆ 38వేల కోట్లేవి?: ఎలా నమ్ముతారంటూ గీతారెడ్డి విమర్శలు
హైదరాబాద్: దళిత బంధు పేరుతో ముఖ్యమంత్రి కేసీఆర్ దళితులను మోసం చేస్తున్నారని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి గీతారెడ్డి విమర్శించారు. శనివారం ఆమె గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడారు. దళితులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా కేసీఆర్ నెరవేర్చలేదన్నారు.

ఆ 38వేల కోట్లు ఎక్కడపోయాయ్ కేసీఆర్: గీతారెడ్డి
తెలంగాణ దళిత సీఎం అని చెప్పి కేసీఆర్ మాట తప్పారని గీతారెడ్డి విమర్శించారు. రాజయ్యను డిప్యూటీ సీఎం చేసి బర్తరఫ్ ఎందుకు చేశారో చెప్పలేదన్నారు. ఎస్సీ-ఎస్టీ సబ్ ప్లాన్ మారుస్తానని చెప్పి మార్చలేదని అన్నారు. ఏడేళ్లుగా రూ. 85వేల కోట్లు కేటాయించి.. రూ. 47వేల కోట్లు మాత్రమే ఖర్చు చేశారన్నారు. రూ. 38వేల కోట్ల సబ్ ప్లాన్ నిధులు ఎక్కడికి పోయాయో ఎవ్వరికీ తెలియదని గీతారెడ్డి అన్నారు.

125 ఫీట్ల అంబేద్కర్ విగ్రహం చైనాలో తయారవుతోందా?
దళితులకు బడ్జెట్లో కేటాయించిన నిధులే పూర్తిగా ఖర్చు చేయని కేసీఆర్.. లక్షల కోట్లు పెడతానంటే ఎలా నమ్మాలని గీతారెడ్డి నిలదీశారు. ఎస్సీలకు కాంట్రాక్టులు ఇవ్వడం కోసం తెచ్చిన జీవోలు కాగితాలకే పరిమితమవుతున్నాయన్నారు. దళితులకు భూపంపిణీ ప్రతిష్టాత్మక పథకం అన్నారని.. మూడెకరాల లబ్ధి కోసం 3 లక్షల కుటుంబాలు ఉంటే.. 6662 కుటుంబాలకు 16వేల ఎకరాలు మాత్రమే ఇచ్చారన్నారు గీతారెడ్డి. 125 ఫీట్ల అంబేద్కర్ విగ్రహం చైనాలో తయారవుతుందో లేదో చెప్పాలని డిమాండ్ చేశారు.

ఉపఎన్నిక కోసమే దళితబంధు.. కేసీఆర్ బెదిరింపులు
అంబేద్కర్ స్టడీ సర్కిల్లో కనీస స్టాఫ్ లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు 333+పడుతున్నారన్నారు. ఈ ఏడేళ్లలో సీఎం కేసీఆర్ ఎప్పుడైనా అంబేడ్కర్‌కు పూలమాల వేశారా? అని ప్రశ్నించారు. దళితబంధు పథకం అమలుకు తమకు అభ్యంతరం ఏమీ లేదని.. అయితే, రాష్ట్రం అంతటా అమలు చేయాలని గీతారెడ్డి డిమాండ్ చేశారు. ఉపఎన్నిక కోసమే హుజూరాబాద్‌లో దళిత బంధు పైలట్ ప్రాజెక్టు అమలు అని కేసీఆర్ స్వయంగా ఒప్పుకున్నారని తెలిపారు. హుజూరాబాద్‌లో దళితులు టీఆర్ఎస్కు ఓట్లు వెయ్యకపోతే.. రాష్ట్రమంతటా అమలు చేయమని దళితుల్ని కేసీఆర్ బెదిరిస్తున్నారని గీతారెడ్డి ఆరోపించారు. హుజూరాబాద్ నియోజకవర్గంలోని ఒక్కో దళిత కుటుంబానికి రూ. 10 లక్షలు దళితబంధు పథకం కింద ఇస్తామంటూ సీఎం కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే.