వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మేం చేసినవి ఇవే, బాబు రావడం వృథా, ఎన్టీఆర్ ఏం చేశారు!: కెసిఆర్

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో సీఎం కెసిఆర్ గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన విపక్షాలకు సున్నితంగా చురకలు అంటించారు. నందమూరి బాలకృష్ణ ఇటీవల బసవతారకం ఆసుపత్రి వద్ద షెల్టర్లు ఏర్పాటు చేయాలని కోరిన అంశాన్ని.. బాలకృష్ణ పేరు చెప్పకుండా ప్రస్తావించారు.

ఓటు వేసే ముందు ప్రజలు ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. ఎవరికి ఓటు వేస్తే లాభమో చూసుకొని జంట నగరాల్లోని విజ్ఞులు, మేధావులు ఓటు వేయాలన్నారు. 40 ఏళ్ల పాటు కాంగ్రెస్, 17 ఏళ్ల పాటు టిడిపి, మధ్యలో కొన్నేళ్లు మజ్లిస్ పార్టీ అధికారంలో ఉందన్నారు. వారు ఏం చేశారో ఓటర్లు గుర్తించాలన్నారు.

ఓ పార్టీకి ఓటు వేస్తే మంచిదో ఆలోచించుకోవాలని విజ్ఞప్తి చేశారు. గతంలో విద్యుత్ ఇబ్బందులతో ఇన్వెర్టర్లు, జనరేటర్లు కొనే పరిస్థితి అని, ఇప్పుడు ఆ పరిస్థితి నుంచి తాము తప్పించామన్నారు. తెలంగాణ వస్తే విద్యుత్ లేక చీకట్లో ఉండిపోతుందని కొందరు వ్యాఖ్యానించారని, కానీ ఇప్పుడు ఆ మాట అబద్దమైందన్నారు.

GHCM elections: KCR press meet

పారిశ్రామిక అవసరాలకు కూడా తాము 24 గంటల పాటు విద్యుత్ ఇస్తున్నామని చెప్పారు. విద్యుత్ కోసం 30 ఏళ్లు అవస్థలు పడ్డామన్నారు. మూసీ నదిని మురికి కూపంగా మార్చింది ఎవరని ప్రశ్నించారు. అలాగే హుస్సేన్ సాగర్‌ను ఎవరు మురికి కూపంగా మార్చారన్నారు. దానికి బాధ్యులు ఎవరో ఆలోచించాలన్నారు.

ఇప్పుడు పోటీ చేస్తున్న పార్టీలన్నీ కొత్తగా వచ్చినవి కావని, వారి పాలన గురించి ఇది వరకే తెలుసుకున్నామన్నారు. భూకబ్జాలు, ఆక్రమణలు తదితరాలు కాంగ్రెస్, టిడిపి హయాంలో రుచి చూశామన్నారు. కాబట్టి ఓటర్లు ఓసారి ఆలోచించి ఓటేయాలన్నారు.

2001లో తెరాస పుట్టినప్పుడు నేను ఒకే మాట చెప్పానని.. తెలంగాణ రాష్ట్ర సాధనే తన జీవిత లక్ష్యమని చెప్పానని, ఉద్యమబాట వీడనని చెప్పానని, తాను ఆ బాటను వీడితే రాళ్లతో కొట్టాలని అప్పుడే చెప్పానన్నారు. తాను చెప్పినట్లుగా రాష్ట్రం సాధించామన్నారు.

GHCM elections: KCR press meet

కృష్ణా, గోదావరి నీటిని తెచ్చి మంచినీటిని అందిస్తామని చెప్పారు. మేం మంచి నీరు అందించకుంటే వచ్చే ఎన్నికల్లో ఓటు అడగమని చెబుతున్నామన్నారు. 67 ఏళ్ల స్వతంత్ర భారత చరిత్రలో ఇలాంటి హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి లేరన్నారు. నేను ఇంత పెద్ద ఛాలెంచ్ చేస్తున్నానంటే మా చిత్తశుద్ధి అర్థం చేసుకోవాలన్నారు.

స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమం కోసం తాము నగరాన్ని 400 భాగాలుగా విభజించి, వారం రోజుల పాటు పని చేశామన్నారు. పనులు కొనసాగుతున్నాయన్నారు. చెత్త బుట్టలు కొని ప్రజలకు ఇచ్చామని, రెండు వేలకు పైగా చెత్త ట్రక్కులను కొనుగోలు చేసి, హైదరాబాదును పరిశుభ్ర నగరంగా చేస్తున్నామన్నారు.

GHCM elections: KCR press meet

హైదరాబాదులో ఇప్పుడు కేవలం 118 కొలనులు మాత్రమే ఉన్నాయని, మిగిలినవి అదృశ్యం కావడానికి కారణమెవరో ప్రజలు గుర్తించాలన్నారు. చెరువులు, నాళాలను టిడిపి, కాంగ్రెస్ నేతలు కబ్జా చేశారన్నారు. నగరంలో అవసరమైన మేర మార్కెట్లు కూడా లేవన్నారు.

కాబట్టి మేం అవసరమైన మేర 200 మార్కెట్లు నిర్మించేందుకు సిద్ధమయ్యామన్నారు. ఇంత పెద్ద నగరంలో పబ్లిక్ టాయిలెట్లు కూడా సరైనన్ని లేవన్నారు. తాము వీటిపై దృష్టి సారించామని, 250 నిర్మిస్తున్నామన్నారు. ఎవరికి కూడా దహన వాటికలు, స్నాన వాటికలు లేవన్నారు. వాటిని ఏర్పాటు చేస్తున్నామన్నారు.

ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా ఉండేందుకే తాను ఎక్కువగా ప్రచారం చేయడం లేదన్నారు. బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి వస్తే అక్కడ ఉండేందుకు షెల్టర్లు కూడా లేవన్నారు. ఆసుపత్రుల యాజమాన్యాలతో తాము మాట్లాడామని, షెల్టర్లు తాము ఏర్పాటు చేస్తున్నామన్నారు.

పేదల కోసం మల్టీపర్పస్ కమ్యూనిటీ హాళ్లు నిర్మిస్తున్నామన్నారు. దాదాపు 40 లక్షల మంది నగరంలో బస్సుల్లో ప్రయాణిస్తుంటారని, వారికి సరైన బస్ షెల్టర్లు లేవని, వాటిని కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు. మిషన్ కాకతీయ కింద జంట నగరాల్లోని 159 చెరువులను అభివృద్ధి చేస్తున్నామన్నారు.

హైదరాబాదులో మహాత్మా గాంధీ బస్ స్టేషన్, జూబ్లీ బస్ స్టేషన్.. ఈ రెండే సరిపోవని, కాబట్టి మరిన్ని బస్ స్టేషన్లు కావాలన్నారు. అలాగే రైల్వే స్టేషన్లు మరిన్ని కావాలన్నారు. తూర్పు, పడమర భాగాల్లో రెండు రైల్వే టెర్మినళ్లు ఏర్పాటు కావాలన్నారు. అప్పుడు రద్దీ తగ్గుతుందన్నారు.

నిపుణుల సహకారంతో హైదరాబాద్ అభివృద్ధిపై ముందుకు పోతున్నామన్నారు. భారత దేశంలో ఏ నగరానికి లేని హంగులు హైదరాబాదుకు ఉన్నాయని చెప్పారు. భారత దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం తీసుకోని విధంగా సుమారు 40వేల కోట్లతో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు.

పేదవారు ఆత్మగౌరవంతో బతకాలనేదే తమ పార్టీ నినాదం అని చెప్పారు. పేదల కోసం తాము ప్రవేశ పెట్టిన డబుల్ బెడ్ రూం ఇళ్ల పథకం, వెయ్యి రూపాయల పింఛన్ పైన విపక్షాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వాటిని తాము ఓట్ల కోసం ఇవ్వలేదన్నారు.

ప్రతి వ్యక్తికి ఆరు కిలోల బియ్యం రేషన్ కార్డు పైన ఇస్తున్నామని, షాదీ ముబారక్, కల్యాణ్ లక్ష్మీలు అమలు చేస్తున్నామన్నారు. హాస్టల్లో విద్యార్థులకు సన్న బియ్యం ఇస్తున్నామన్నారు. హైదరాబాదులో లక్ష మంది పేదలకు పట్టాలు ఇచ్చామన్నారు. తెరాస పేదల పక్షాన నిలిచే పార్టీ అన్నారు.

అంగన్వాడీల జీతాలు పెంచామన్నారు. ఆటో రిక్షా సోదరులకు ట్యాక్స్ రద్దు చేశామన్నారు. పది లక్షల మంది డ్రైవర్లకు బీమాను వర్తింప చేశామన్నారు. భవన నిర్మాణ రంగంలోని కార్మికులకు కూడా బీమాను వర్తింప చేశామన్నారు. కొన్ని పార్టీలు తమను తిట్టడం విడ్డూరమన్నారు.

తమను విమర్శించే పార్టీలకు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నానని.. మేం చేసిన పనులు, చేయబోయే పనులు చెబుతున్నామన్నారు. కానీ కొన్ని పార్టీలు నిత్యం తమ పైన విమర్శలు చేస్తున్నాయన్నారు. తమ పైన విమర్శలు వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని చెప్పారు. 18నెలల్లోనే తాము అన్నీ చేయలేమన్నారు.

GHCM elections: KCR press meet

గతంలో పారిశ్రామికవేత్తలు ఇందిరా పార్కుకు వచ్చి ధర్నాలు చేసేవారన్నారు. కానీ ఇప్పుడు పరిశ్రమలకు 24 గంటల విద్యుత్ ఇస్తున్నామని చెప్పారు. చేయాలనే సంకల్పం ఉంటే ఏమైనా చేయవచ్చునని చెప్పారు. ఆకతాయిల ఆగడాలతో మహిళలు ఇబ్బంది పడేవారని, షీ టీమ్స్‌తో వారికి రక్షణ కల్పిస్తున్నామన్నారు.

జంట నగరాల్లోని మహిళలు తమ పార్టీ వెంటే ఉన్నారని చెప్పారు. మహిళలు ఇప్పుడు ఆత్మగౌరవంతో ఉన్నారన్నారు. హైదరాబాద్ ప్రజలకు మరో శుభవార్త అన్నారు. రాష్ట్రంలోని ప్రతి ఉత్పత్తికి హైదరాబాదును అనుసంధానం చేస్తామని చెప్పారు.

హైదరాబాదులో జంట సరస్సులను నిర్మిస్తున్నామన్నారు. టిడిపి, కాంగ్రెస్ పార్టీలు ఈ ఆలోచన ఎందుకు చేయలేదన్నారు. జంట నగరాల్లో సరైన జలాశయం లేదన్నారు. దేశంలోని అన్ని నగరాలకు అది ఉందన్నారు. హైదరాబాదుకు రెండు వైపుల రెండు రిజర్వాయర్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు.

ట్రాఫిక్ సమస్యలు తీర్చుతామన్నారు. ట్రాఫిక్ సమస్యను తీర్చేందుకు రూ.30వేల కోట్లతో స్ట్రాటెజికల్ రోడ్డు నిర్మాణాలు చేపడుతున్నామన్నారు. ఓ పత్రిక వారు రోడ్డు నిర్మాణం పైన చర్చకు లేవనెత్తారని, దానిని తాను స్వాగతిస్తున్నానని చెప్పారు. ట్రాఫిక్ సమస్య తీర్చేందుకు మల్టీ లెవల్ ఫ్లై ఓవర్లు, జంక్షన్లు నిర్మిస్తామన్నారు.

మాటలకు మాత్రం ట్యాక్స్ లేదు

మన దేశంలో అన్నింటికి ట్యాక్స్‌లు ఉన్నాయని, కానీ మాటలకు మాత్రం మన దేశంలో ట్యాక్స్ లేదన్నారు. అందుకే ఇష్టారీతిన మాట్లాడుతున్నారన్నారు. నీటికి, జిహెచ్ఎంసికి సంబంధం లేదని, అలాంటప్పుడు కాంగ్రెస్ పార్టీ చెబుతున్నట్లుగా ఉచితంగా నీరు ఎలా ఇస్తున్నారన్నారు.

తాను జూన్ 2న సీఎంగా ప్రమాణ స్వీకారం చేశానని, అప్పుడు హైదరాబాదులో బురద మంచి నీరు వస్తుందని తన దృష్టికి వచ్చిందని, అప్పుడే సమస్య పైన దృష్టి సారించానన్నారు. సీఎం క్యాంప్ కార్యాలయం, అసెంబ్లీ ముందు, రాజ్ భవన్ ఎదుట వరద నీరు మడుగు ఉంటుందన్నారు.

కాంగ్రెస్, టిడిపి ప్రభుత్వాల పుణ్యమా అని వర్షం పడితే లోతట్టు ప్రాంతాలు నీట మునిగిపోతున్నాయన్నారు. హైదరాబాదును ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దుతామని, అందుకు ప్రజలు తెరాస అభ్యర్థులను జిహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలిపించాలన్నారు.

జంట నగరాల ఓటర్లు, ప్రజల పైన ఓ బాధ్యత ఉందన్నారు. అది సరైన అభ్యర్థులను గెలిపించడమే అన్నారు. అలాగే, జంట నగరాల ప్రజల పైన ఓటింగులో పాల్గొనరనే అపవాదు ఉందని, కాబట్టి ప్రజాస్వామ్య స్ఫూర్తిని వారు ప్రదర్శించాలని కోరారు.

చంద్రబాబు ప్రచారం వృథా

నేను హైదరాబాదును అభివృద్ధి చేశానని చంద్రబాబు అంటున్నారని, అలాగే మీకు గ్రేటర్లో పోటీ ఎవరని ఓ విలేకరి ప్రశ్నించారు. దానికి కెసిఆర్ స్పందించారు. హిందూపురం నుంచి ఇచ్ఛాపురం వరకు చంద్రబాబు అభివృద్ధి చేసుకోవచ్చని, ఆయన ఏపీ సీఎం అక్కడ ఆయనకు బోలెడంత పని ఉందని కెసిఆర్ అన్నారు.

కాబట్టి ఆయన మాట ఎవరు నమ్మరన్నారు. చంద్రబాబు 9 ఏళ్లు సీఎంగా ఉండి ఏం చేశారన్నారు. ఇప్పుడు నేను చెప్పిన సమస్యలను ఎందుకు పరిష్కరించలేదన్నారు. చంద్రబాబు, ఆయన మామ (ఎన్టీఆర్) పదిహేడేళ్లు అధికారంలో ఉండి ఏం చేశారన్నారు.

చంద్రబాబుకు విద్యుత్ కొరత ఇతర సమస్యలు తీర్చేందుకు 9 ఏళ్లు సరిపోలేదా అన్నారు. ఆయన రాష్ట్రంలో (ఏపీ) ఆయనకు చాలా పని ఉందని, అక్కడ ఏమైనా చేసుకోవచ్చన్నారు. ఆయన ప్రచారానికి రావడం అనవసర కార్యక్రమం, వృథా అన్నారు. తమకు పోటీ పలనావాళ్లు అని చెప్పే పరిస్థితి లేదన్నారు.

టిఆర్ఎస్ నేతల అహంకార వ్యాఖ్యలు: ఉత్తమ్‌

జిహెచ్‌ఎంసి ఎన్నికల ప్రచారంలో భాగంగా తెరాస నేతలు అహంకారిత పూరిత వ్యాఖ్యలు చేస్తున్నారని తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గురువారం అన్నారు. అలాంటి వారికి ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. ఉప్పల్‌ డివిజన్‌లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా మాట్లాడారు. హైదరాబాద్‌ అభివృద్ధి అంతా కాంగ్రెస్‌ హయాంలోనే జరిగిందన్నారు. దానిని టిఆర్ఎస్ తన ఖాతాలో వేసుకునేందుకు ప్రయత్నిస్తోందన్నారు. ఈసారి పాతబస్తీలోనూ ఎక్కువ సంఖ్యలో డివిజన్లు కైవసం చేసుకుని, మేయర్‌ పీఠాన్ని చేజిక్కించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.

తెలంగాణ రాష్ట్రంలో ప్రాణహిత - చేవెళ్లతో పాటు పలు సాగునీటి ప్రాజెక్టులను రీడిజైన్ చేయడంపై ప్రభుత్వం మరోసారి ఆలోచించాలని కాంగ్రెస్ పార్టీ శాసన సభా పక్ష నేత జానారెడ్డి సూచించారు. ప్రాజెక్టుల రీడిజైన్ వల్ల అదనపు ఖర్చవుతుందన్నారు.

హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయం గాంధీభవన్లో ఆయన మాట్లాడారు. గోదావరి జిల్లాల వినియోగంపై సూచనలతో ప్రభుత్వానికి నివేదిక ఇచ్చామని, జాతీయ, అంతర్జాతీయ నిపుణులు, అఖిలపక్షం సూచనలు తీసుకోవాలన్నారు.
ఇతర రాష్ట్రాలతో పేచీలేని తక్కువ ఖర్చయ్యే ప్రాజెక్టులు చేపట్టాలన్నారు.

మిగులు జలాలపై ఆధారపడి ప్రాజెక్టు నిర్మాణం మంచిది కాదని హితవు పలికారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును స్వాగతిస్తున్నామని, అలాగే పెండింగ్ ప్రాజెక్టులను సత్వరమే పూర్తి చేయాలన్నారు. నారాయణఖేడ్ ఉప ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి మాట్లాడుతూ... హరీష్ రావుకు దమ్ముంటే సెక్యూరిటీ లేకుంటే బయటకు రావాలని సవాల్ చేశారు.

English summary
Telangana Chief Minister K Chandrasekhar Rao press meet.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X