జీహెచ్ఎంసీ కాబోయే మేయర్ ఆమేనా...? ప్రగతి భవన్ నుంచి టీఆర్ఎస్ అధిష్టానం పిలుపు..
హైదరాబాద్ గ్రేటర్ ఎన్నికల ఫలితాలు టీఆర్ఎస్కు అనూహ్య షాకిచ్చాయి. గ్రేటర్ పీఠం మాదేనంటూ తొలినుంచి దూకుడైన ధీమాను ప్రదర్శించిన బీజేపీ... పీఠాన్ని అందుకోలేకపోయినా అధికార పార్టీ గుండెల్లో రైళ్లు పరిగెత్తించింది. బీజేపీ దెబ్బతో దారుణంగా చతికిలపడ్డ టీఆర్ఎస్ పార్టీ కేవలం 60 స్థానాల లోపే పరిమితమయ్యే పరిస్థితి. దీంతో ఎక్స్అఫిషియో ఓట్లతోనే మేయర్ పీఠాన్ని దక్కించుకోవాల్సిన అనివార్యత ఏర్పడింది. గెలుపోటముల లెక్కలను పక్కనపెట్టి మేయర్ అభ్యర్థి ఎంపికపై పార్టీ ఇప్పుడు దృష్టి పెట్టింది.

ప్రగతి భవన్కు సింధు ఆదర్శ్...
గ్రేటర్లోని 111వ డివిజన్ భారతీనగర్ నుంచి టీఆర్ఎస్ తరుపున గెలిచిన సింధు ఆదర్శ్ రెడ్డిని ప్రగతి భవన్కు రావాలని అధిష్టానం కబురు పెట్టింది. మేయర్ అభ్యర్థిగా సింధు ఆదర్శ్ రెడ్డిని ప్రకటించేందుకే అధిష్టానం ఆమెను ప్రగతి భవన్కు పిలిచినట్లు సమాచారం. భారతి రెడ్డి మెదక్ ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి కోడలు కావడం గమనార్హం. ఈసారి మేయర్ పీఠం మహిళకే కేటాయించడంతో సింధు ఆదర్శ్ రెడ్డికే దాదాపుగా ఆ అవకాశం దక్కే సూచనలు కనిపిస్తున్నాయి.నిజానికి ప్రస్తుత హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ సతీమణి శ్రీదేవి,ఖైరతాబాద్ కార్పోరేటర్ విజయా రెడ్డిలు కూడా హైదరాబాద్ మేయర్ పీఠంపై ఆశలు పెట్టుకున్నారు. అయితే ఈ ఇద్దరినీ పక్కనపెట్టి టీఆర్ఎస్ అధిష్టానం సింధు వైపే మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది.

హాఫ్ సెంచరీకి దగ్గరలో బీజేపీ...
గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభివృద్ది మంత్రం కంటే.. తమది బరాబర్ హిందువుల పార్టీనే అని చాటి చెప్పుకున్న బీజేపీ వైపే జనం ఎక్కువగా ఆకర్షితులైనట్లు గ్రేటర్ ఫలితాలను చూస్తే అర్థమవుతోంది. సెంచరీ దాటాలన్న లక్ష్యంతో బరిలో దిగిన కారును బీజేపీ 60 లోపే పరిమితం చేయడంలో విజయం సాధించింది. నిజానికి బీజేపీ 15-30 స్థానాలు గెలవొచ్చునని భావించినప్పటికీ... హాఫ్ సెంచరీకి దగ్గరగా ఆ పార్టీ దూసుకెళ్లడం అనూహ్య విజయమనే చెప్పాలి.

మరో బలమైన దెబ్బ
ఇప్పటిదాకా తమకు ఎదరులేదనుకున్న టీఆర్ఎస్కు బీజేపీ రూపంలో ఇక గట్టి ప్రతిపక్షం ఉన్నట్లే అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దుబ్బాక ఉపఎన్నిక గెలుపుతో టీఆర్ఎస్ పతనం మొదలైందని ప్రకటించిన బీజేపీ... గ్రేటర్ ఎన్నికల్లో ఆ దిశగా మరో బలమైన అడుగు వేసింది. దీంతో నిన్న మొన్నటిదాకా బీజేపీకి అంత సీన్ లేదనుకున్న టీఆర్ఎస్ ఇక ఆచీ తూచీ అడుగులు వేయాల్సిన పరిస్థితి నెలకొంది. మొత్తం మీద ఆరున్నరేళ్ల పాలనలో సహజంగానే అధికార పార్టీపై వ్యక్తమయ్యే వ్యతిరేకత కూడా బీజేపీకి కలిసొస్తుందనే చెప్పాలి.