ghmc mayor vijayalakshmi hyderabad telangana centre విజయలక్ష్మి మేయర్ జీహెచ్ఎంసీ హైదరాబాద్ తెలంగాణ కేంద్రం
హైదరాబాద్ ప్రతిష్ఠ దెబ్బతీసేందుకే: కేంద్రం ర్యాంకింగ్స్ జాబితాపై మేయర్ విజయలక్ష్మి ఫైర్
హైదరాబాద్: ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్‌లో హైదరాబాద్ నగర ప్రతిష్ఠను దెబ్బతీసే విధంగా కేంద్ర ప్రభుత్వం ర్యాంకింగ్ ఇచ్చిందని జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి ఆరోపించారు. భారతదేశంలో అత్యంత నివాసయోగ్యమైన నగరాల జాబితాను ఇటీవల కేంద్రం విడుదల చేసిన విషయం తెలిసిందే. దీనిపై మేయర్ తీవ్రంగా స్పందించారు.
రాజకీయ దురుద్దేశంతోనే ఈ జాబితాలో హైదరాబాద్ ర్యాంకింగ్‌ను తగ్గించారని విజయలక్ష్మి ఆరోపించారు. కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ నగరానికి 24వ స్థానం ప్రకటించడం సరికాదన్నారు.

ముత్యాల నగరంగా పేరొందిన హైదరాబాద్.. దేశంలోని అన్ని మెట్రో నగరాల కన్నా అభివృద్ధిలో ముందుకు దూసుకుపోతోందన్నారు. ఉత్తమ నగరానికి ఉండాల్సిన అన్ని ప్రామాణికాలూ హైదరాబాద్ నగరానికి ఉన్నాయన్నారు. 24వ ర్యాంకు ప్రకటించడాన్ని హైదరాబాదీలు అంగీకరించరని చెప్పారు.
కాగా, ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్-2020 జాబితాను కేంద్ర ప్రభుత్వం గురువారం విడుదల చేసిన విషయం తెలిసిందే. ఆయా నగరాల్లో జీవనం సాగించేందుకు అనుకూల పరిస్థితులకు అనుగుణంగా ఈ ర్యాంకులను కేటాయించింది. బెంగళూరు ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉండగా, ఆ తర్వాతి స్థానాల్లో పుణె, అహ్మదాబాద్ ఉన్నాయి. 13వ స్థానంలో ఢిల్లీ, 15వ స్థానంలో విశాఖపట్నం ఉన్నాయి.
జనరేటర్ ఏర్పాటు చేయాలంటూ లేఖ
బంజారాహిల్స్‌లోని తన క్యాంపు కార్యాలయంలో తరచుగా విద్యుత్ కు అంతరాయం ఏర్పడుతోందని, వెంటనే తగిన చర్యలు చేపట్టాలని కోరతూ మేయర్ విజయక్ష్మి.. జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్‌కు లేఖ రాశారు. విద్యుత్ సరఫరాకు తరచూ అంతరాయం కలగడంతో రోజువారీ కార్యకలాపాలకు ఇబ్బందు అవుతోందని, వీలైనంత తొందరగా 25కేవీ జనరేటర్ ఏర్పాటు చేయాలని కోరారు.