యువతి గ్యాంగ్‌రేప్ కేసులో కొత్తకోణం: బాధితురాలి స్నేహితురాలే టార్గెట్
కరీంనగర్: జిల్లాలోని వీణవంక మండలంలో దళిత యువతిపై సామూహిక అత్యాచారం కేసులో మరో కోణం వెలుగుచూసింది. దళిత యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డ నిందితుల టార్గెట్ ఆమె కాదని తెలిసింది. నిందితులు బాధితురాలి స్నేహితురాలే లక్ష్యంగా కామాంధులు పథకం వేసుకున్నారని వెల్లడైంది.
చివరి క్షణంలో ఆమె తప్పించుకోవడంతో వారు బాధితురాలిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. కాగా, సోమవారం నిందితుల బారినుంచి తప్పించుకున్న యువతి, బాధితురాలు ఘటనకు సంబంధించిన వివరాలను మీడియాకు తెలిపారు.
ఇటీవల బాధితురాలి స్నేహితురాలికి పెళ్లి నిశ్చయమైనందున వారి కుటుంబసభ్యులు ఈ విషయాన్ని వెల్లడించేందుకు తొలుత భయపడ్డారు. అయితే దళిత, ప్రజా సంఘాలు నచ్చజెప్పడంతో బాధితురాలి స్నేహితురాలు ముందుకొచ్చి వివరాలు వెల్లడించింది.

బాధితురాలు చెప్పిన వివరాల ప్రకారం.. ఫిబ్రవరి 10న బుక్స్ ఇప్పిస్తానంటూ శ్రీనివాస్ అనే తోటి విద్యార్థి తనను, తన స్నేహితురాలు(బాధితురాలు)ని తన బైక్‌పై తీసుకెళ్లాడని తెలిపింది. కాగా, తమ వెనకే అంజి, రాకేష్ అనే మరో ఇద్దరు యువకులు బైక్ పై వచ్చారని తెలిపింది. వీణవంక నుంచి కల్వల వెళ్లే దారిలో గుట్ట దగ్గరకు తీసుకుపోయారని చెప్పింది. దీంతో తమకు అనుమానం వచ్చి బైక్ దిగి పరుగెత్తామని తెలిపింది.
‘నా వెనకే శ్రీనివాస్ వచ్చి బైక్ అడ్డం పెట్టిండు. మా స్నేహితురాలు మాత్రం తప్పించుకుని అటువైపు వెళ్తున్న ఓ అంకుల్ బండిపై వెళ్లిపోయింది. ఆ తర్వాత నాపై ఈ ముగ్గురు అఘాయిత్యానికి పాల్పడ్డారు. రాకేష్ వీడియో తీసిండు. ఘోరం జరిగాక నేను చచ్చిపోదామనుకున్నా. మా అమ్మమ్మ ఇంటికి పోయిన. వాళ్లు నన్ను చూసి ఏమైందని అడిగితే జరిగిన విషయం చెప్పాను' అని బాధితురాలు తెలిపింది.
కాగా, ఆ తర్వాత అంజి ఫోన్ చేసి మళ్లీ కోరిక తీర్చాలని లేదంటే ఆ వీడియోను నెట్‌లో పెడతామని బెదిరించాడని తెలిపింది. దీంతో తన మామయ్య, బాబాయ్ తనతో అంజికి ఫోన్ చేసి రప్పించారని తెలిపింది. ఆ తర్వాత తాను అంజి బైక్‌పై కూర్చున్నానని తెలిపింది.
అప్పుడు అతడు మాట్లాడుతూ.. ‘నువ్వు ఇంత ధైర్యం చేసి వస్తవనుకోలేదు. అయినా మేం ఆ రోజు స్కెచ్ వేసింది నీ కోసం కాదు. నీ ఫ్రెండ్ కోసం. ఆమెను రప్పించి కోరిక తీర్చుకుందామని శ్రీనివాస్ స్కెచ్ వేసిండు. కానీ, ఆ అమ్మాయి తప్పించుకుంది. లేకుంటే ఆమెతో కోరిక తీర్చుకునేవాళ్లమని అంజి చెప్పిండు' అని బాధితురాలు తెలిపింది.
ఈటెల పరామర్శ: చర్యలకు ఆదేశం
రాష్ట్ర అర్థిక మంత్రి ఈటెల రాజేందర్ బాధితురాలిని పరామర్శించారు. బాధితురాలికి న్యాయం చేస్తామని, దోషులను శిక్షిస్తామని భరోసా ఇచ్చారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన వీణవంక ఎస్‌ఐను సస్పెండ్ చేయాల్సిందిగా జిల్లా ఎస్పీని మంత్రి ఈటెల ఆదేశించారు.
పోలీసుల తీరుపై విమర్శలు: నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామన్న ఎస్పీ
దళిత యువతిపై అత్యాచారానికి పాల్పడిన నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ జోయల్ డేవిస్ స్పష్టం చేశారు. నిందితులకు కఠిన శిక్ష పడేలా పబ్లిక్ ప్రాసిక్యూటర్, డీఎస్పీ, నైపుణ్యం గల సిబ్బందితో ఒక బృందం ఏర్పాటు చేశామన్నారు. బాధితురాలితో సోమవారం తన కార్యాలయంలో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. నిందితులపై ఫిబ్రవరి 25న నిర్భయ, ఎస్సీ, ఎస్టీ చట్టం, ఐటీ చట్టం కింద కేసులు నమోదు చేశామన్నారు. ఘటన జరిగిన రోజే పోలీసులకు సమాచారం ఇచ్చినా స్పందించలేదని, నిందితుల్లో ఇద్దరు మైనర్లు కారని బాధితురాలు, కుటుంబ సభ్యులు, గ్రామస్థులు ఆరోపిస్తున్నారని చెప్పారు.

పోలీసులపై వస్తున్న ఆరోపణలు నిజమని తేలితే చర్యలు తప్పవన్నారు. నిందితుల పదోతరగతి ధ్రువ పత్రాల ప్రకారం ఒకరికి 17 ఏళ్ల 9 నెలలు, మరొకరు 17 ఏళ్ల 7 నెలల వయసున్నట్లు తెలుస్తోందని, వైద్యపరంగా వయసు నిర్ధారించే యత్నాలూ చేస్తున్నట్లు చెప్పారు. మారిన బాలల చట్టం ప్రకారం వీరిద్దరినీ జువైనల్ బోర్డుకు అప్పగిస్తామన్నారు.
బాధిత యువతికి మనోస్థైర్యం కల్పించేలా కౌన్సెలింగ్ ఇస్తామన్నారు. బాధితురాలు మాట్లాడుతూ.. నిందితులను కఠినంగా శిక్షిస్తామని ఎస్పీ హామీ ఇచ్చినట్లు చెప్పింది. స్థానిక పోలీసులు సకాలంలో స్పందిస్తే తనకు ఈ గతి పట్టేది కాదని చెప్పగా, వారు నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు తేలితే చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారని పేర్కొంది. నిందితులకు ఉరిశిక్ష విధించాలని ఆమె డిమాండ్ చేసింది.