ఎస్సార్‌నగర్‌లో ఇళ్లు నేలమట్టం: స్థానికుల తీవ్ర ప్రతిఘటన, ఉద్రిక్తత
వరంగల్: పేదల ఇళ్లు పేకమేడల్లా కూలాయి.. రెక్కలు ముక్కలు చేసుకుని కష్టార్జితంతో కట్టుకున్న ఇళ్లు ధ్వంసమయ్యాయి. ప్లేటులోని అన్నం కిందపడిపోయింది. వంటకు దాచుకున్న బియ్యం మట్టిపాలయ్యాయి. మంచాలు విరిగిపోయాయి. కంచాలు ఎగిరిపోయాయి. ఇళ్ల నుంచి కట్టుబట్టలతో బయటికొచ్చిన నిర్భాగ్యుల కళ్లలో నీళ్లు ఉబికాయి. పసిపిల్లల కళ్లలోంచి ఏరులయ్యాయి. ఎస్సార్‌నగర్‌లో పోలీసులు, రెవెన్యూ అధికారుల సంయుక్త దౌర్జన్యకాండ బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు కొనసాగింది.
ఇళ్ల కూల్చివేతలతో క్షణక్షణం.. పరిస్థితి ఉద్రిక్తతంగా మారింది. రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణానికి ప్రస్తుతం ఉంటున్న ఇళ్లను కూల్చుకోవడానికి స్థానికులు పలుమార్లు నిరాకరించి ఆందోళనలు చేపట్టారు. దీంతో వారి ఇళ్లను తొలగించడం వీలు కాలేదు. ఇళ్ళ నిర్మాణం అనుకున్నస్థాయిలో జరగడం లేదని ముఖ్యమంత్రి జిల్లా యంత్రాగంపై అసంతృప్తి వ్యక్తంచేయడంతో మంగళవారం కలెక్టర్ అధికారులకు దిశానిర్దేశం చేశారు.

బుధవారం ఉదయం నాలుగు గంటలకే ఆర్డీవో వెంకారెడ్డి, డీసీపీ వేణుగోపాల్ సారథ్యంలో వందలాదిగా పోలీసులు, రెవెన్యూ అధికారులు, సిబ్బంది ఎస్సార్‌నగర్‌కు చేరుకున్నారు. ఎక్కడికక్కడ స్థానికులను కట్టడిచేసి ఇళ్లలోంచి బియ్యం, వంటసామగ్రి, మంచాలు, కంచాలు బయటపెట్టుకోవాలని ఆదేశించారు. పొక్లయిన్ సాయంతో 38 ఇళ్లను కూల్చాలని నిర్ణయించినా ఒక ఇంటిని వదిలేసి మిగిలిన వాటిని కూల్చేశారు.
ఏడుపులు, పెడబొబ్బలు..
ఇళ్ల కూల్చివేతతో స్థానికుల ఏడుపులు, పెడబొబ్బలతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. అధికారుల చర్యలను ప్రతిఘటిస్తూ సీపీఐ నాయకులతో కలిసి ఆందోళనకు దిగారు. పొక్లయిన్లకు అడ్డుగా వెళ్లారు. మరికొందరు రాళ్లు రువ్వేందుకు సిద్ధమయ్యారు. ఇలా ఎందరు వారించినా అధికారులు వెనక్కి తగ్గలేదు. దీంతో యాసిన్ అనే వ్యక్తి ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు సిద్ధమవగా పోలీసులు, స్థానికులు అడ్డుకున్నారు. అనంతరం ఇంటిపైకి ఎక్కి కిందకు దూకే ప్రయత్నంతో పాటు విద్యుత్తు తీగలు పట్టుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా ఆయా చర్యలను పోలీసులు అడ్డుకుని అతన్ని కాపాడారు. మరో మహిళ కూడ ఇలాగే ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.
మాజీ ఎమ్మెల్యే కొండేటి ఆందోళన..
ఎస్సార్‌నగర్‌లో ఇళ్లు కూల్చివేస్తున్నారని తెలిసి వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఎనుమాముల మాజీ సర్పంచ్ అడిగొప్పుల సాంబేశ్వర్, వరంగల్ నగరానికి చెందిన కాంగ్రెస్ నాయకులు అడుప మహేశ్, ఆయూబ్, దాసరి రాజేశ్ తదితరులు స్థానికులకు మద్దతుగా నిలిచారు. ఆర్డీవో వెంకారెడ్డితో వాగ్వాదానికి దిగారు. పోలీసులతోనూ మాట్లాడారు.
పేదల ఇళ్లు కూల్చొద్దని కోరారు. ఎవరూ పట్టించుకోకపోవడంతో స్థానికులతో తెలంగాణ తల్లి విగ్రహం వద్ద ధర్నా చేపట్టారు. ఎస్సార్‌నగర్ సీపీఐ నాయకులు రహేలా, దామెర కృష్ణ, బుస్సా రవి, ఎనుమాముల ఉప సర్పంచ్ అమర్రాజు కుమార్, ఈసంపెల్లి శ్రీకాంత్, కొత్తపల్లి రాజు తదితరులు ధర్నాలో పాల్గొనగా పోలీసులు వారిని అరెస్టు చేసి మిల్స్‌కాలనీ పోలీసుస్టేషన్‌కు తరలించారు. తెదేపా అర్బన్ జిల్లా అధ్యక్షుడు ఈగ మల్లేశం బృందం, ఎమ్మార్పీఎస్ సీనియర్ నేత ఈర్ల కుమార్ నేతృత్వంలో పలువురు నాయకులు, కార్యకర్తలు స్థానికులకు మద్దతుగా నిలిచారు.