
ప్రభుత్వ వైద్యులు ప్రైవేటు ప్రాక్టీసు చేస్తే అంతే - సీఎం ఆమోదముద్ర..!!
ప్రభుత్వ వైద్యులు ఇక నుంచి ప్రైవేటు ప్రాక్టీసు కూ దూరం కావాల్సిందే. ఈ మేరకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వైద్య ఆరోగ్య శాఖ ప్రతిపాదించిన ఈ దస్త్రంపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమోదముద్ర వేసినట్లు సమాచారం. అయితే, ఈ నిర్ణయం విషయంలో మరో కీలక అంశం ఉంది. కొత్తగా చేపట్టబోయే నియామకాల్లో ఈ మేరకు నిబంధన అమలుచేయనున్నారు. ఇప్పటికే పనిచేస్తున్న వైద్యులకు ఈ నిబంధన వర్తించదని చెబుతున్నారు.
కొత్తగా నియమితులయ్యే వైద్యులు ప్రైవేటు ప్రాక్టీసును కోల్పోనుండడంతో.. వారికిచ్చే వేతనాలను భారీగా పెంచాలని కూడా ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అదే విధంగా.. వేతనాలు - పనివేళలనూ నిమ్స్ తరహాలో అమలు దిశగా నిర్ణయించనున్నట్లు చెబుతున్నారు. రాష్ట్రంలో మొత్తం 12,755 వైద్య సిబ్బంది పోస్టులను భర్తీ చేస్తారు. వాటిలో 10 వేలకుపైగా వైద్యులు, స్టాఫ్ నర్సులు, ఏఎన్ఎం పోస్టులను వైద్య నియామక బోర్డు ద్వారా భర్తీ చేయనున్నారు. ల్యాబ్ టెక్నీషియన్ నియామకాలు మాత్రం టీఎస్పీఎస్సీ సహకారంతో చేపడతారు. ఈ మొత్తం పోస్టుల్లో సుమారు 3 వేలు వైద్యుల పోస్టులు మినహా మిగిలిన అన్ని కేటగిరీల పోస్టులకూ రాత పరీక్ష ఉంటుంది.

వైద్యులకు మాత్రం వారి అర్హత ప్రాతిపదికన అనుభవం వెయిటేజీని పరిగణనలోకి తీసుకొని నియామకాలు పూర్తి చేయనున్నారు. నర్సులు, ఏఎన్ఎంలు, ల్యాబ్టెక్నీషియన్లు, ఫార్మాసిస్టులు వంటి పోస్టులకు రాత పరీక్షను నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన సిలబస్ కూర్పు ఇప్పుడు కీలకంగా మారుతోంది.
ఒప్పంద, పొరుగు సేవల ఉద్యోగులకు కూడా ఈ దఫా వెయిటేజీ ఇవ్వనున్నారు. వెయిటేజీ నిబంధనలను రూపొందించడంపైనా అధికారులు కసరత్తు కొనసాగుతోంది. సిలబస్ కూర్పు ఓ కొలిక్కి వచ్చిందనీ, ప్రభుత్వ అనుమతి కోసం పంపించామనీ.. రాగానే వారం, పది రోజుల్లో నియామక ప్రకటన ఉందని తెలుస్తోంది. న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా పక్కాగా సిలబస్ రూపొందించాలని భావిస్తున్నారు. దీంతో..ఇప్పుడు నియామక ప్రక్రియకు సంబంధించిన ప్రకటన..అందులో పేర్కొనే అంశాల పైన అభ్యర్ధులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.