ఎస్ఐ సిద్దయ్య వీరమరణానికి ఐదేళ్లు... నెరవేరని ఆ 2 హామీలు..సీఎం అపాయింట్మెంట్ కోసం భార్య ఎదురుచూపులు
నల్గొండ జిల్లా జానకీపురం వద్ద ఏప్రిల్,2015లో సిమీ ఉగ్రవాదుల కాల్పుల్లో వీరమరణం పొందిన ఎస్ఐ సిద్దయ్య కుటుంబానికి ఇప్పటికీ ప్రభుత్వ పరిహారం అందలేదు. సిద్దయ్య కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని అప్పట్లో ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ప్రకటించినప్పటికీ.. ఇప్పటికీ ఆ మాట నిలబెట్టుకోలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

నెరవేరని ఆ రెండు హామీలు...
సిద్దయ్య వీరమరణంతో ప్రభుత్వం అప్పట్లో రూ.40లక్షలు,ఇంటి స్థలం,ఆయన భార్య ధరణీషకు ప్రభుత్వ ఉద్యోగాన్ని ప్రకటించింది. ఇందులో రూ.40లక్షలు హామీని ఇప్పటికే నెరవేర్చింది. అయితే ఇంటి స్థలం, ప్రభుత్వ ఉద్యోగం మాత్రం ఇంతవరకూ ఇవ్వలేదు. ఇంటి స్థలం విషయంలో సిద్దయ్య భార్య విజ్ఞప్తిని ప్రభుత్వం తిరస్కరిస్తున్నట్లు తెలుస్తోంది. స్వగ్రామం లేదా ఉద్యోగం చేసిన ప్రాంతంలో ఇంటి స్థలం ఇస్తామని ప్రభుత్వం చెబుతుండగా... తమకు హైదరాబాద్లో ఇంటి స్థలం కేటాయించాలని సిద్ద భార్య కోరుతున్నట్లు సమాచారం. దీంతో ఈ వ్యవహారం ఎటూ తేలకుండా ఉండిపోయింది.

అపాయింట్మెంట్ కోసం ఎదురుచూపులు...
ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చినప్పటికీ... ఇప్పటివరకూ ఆ హామీ కూడా నెరవేర్చలేదు. దీంతో ముఖ్యమంత్రి కేసీఆర్ను కలిసి తన సమస్యలు చెప్పకోవాలని సిద్దయ్య భార్య ధరణీష భావిస్తున్నారు. అయితే ఎంత ప్రయత్నించినా ఆయన అపాయింట్మెంట్ మాత్రం దొరకలేదు. దీంతో సీఎం దృష్టికి తన సమస్యలను ఎలా తీసుకెళ్లాలో తెలియక సతమతమవుతున్నారు.ఇప్పటికైనా తనకు అపాయింట్మెంట్ ఇప్పించాలని అధికారులను కోరుతున్నారు. భారత్-చైనా సరిహద్దులో గాల్వన్ లోయలో చైనీస్ బలగాల దాడిలో వీరమరణం పొందిన కల్నల్ బిక్కుమళ్ల సంతోష్ బాబు కుటుంబాన్ని ఎలాగైతే ఆదుకున్నారో తమనూ అలాగే ఆదుకోవాలని ధరణీష కోరుతున్నారు.

జానకీపురం ఎన్కౌంటర్లో సిద్దయ్య వీరమరణం
ఏప్రిల్ 4,2015న సిమీ ఉగ్రవాదులు జానకీపురంలో చొరబడ్డారన్న సమాచారంతో సీఐ బాల గంగిరెడ్డి, ఎస్ఐ సిద్దయ్య,కానిస్టేబుల్ నాగరాజు అక్కడికి చేరుకున్నారు. ఉగ్రవాదులను మట్టుబెట్టినప్పటికీ ఎదురు కాల్పుల్లో కానిస్టేబల్ నాగరాజు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. తీవ్ర గాయాలపాలైన ఎస్ఐ సిద్దయ్య కామినేని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. సిద్దయ్య అంత్యక్రియలను ఆయన స్వస్థలం జడ్చర్లలో అధికారిక లాంఛనాలతో నిర్వహించారు. సిద్దయ్య ఎన్కౌంటర్ చేసిన సిమీ ఉగ్రవాదులు,అంతకుముందు సూర్యాపేట బస్టాండ్లో ఓ కానిస్టేబుల్,హాంగార్డును పాయింట్ బ్లాక్లో కాల్చి చంపారు.