కరీంనగర్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బీడీ పరిశ్రమకు జీఎస్టీ పోటు: తెలంగాణలో 4.5 లక్షల మందిపై దెబ్బ

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: 'ఒకే దేశం - ఒకే పన్ను' నినాదంతో దేశమంతా వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) అమలులోకి వచ్చింది. దీనిప్రభావం కొన్ని వస్తువులు, సేవలపై అనుకూలంగా ఉంటే మరికొన్నింటిపై ప్రతికూలంగా మారుతోంది. ఈ క్రమంలో పెరిగిన పన్నుతో బీడీ పరిశ్రమకు ఆటంకాలు ఎదురుకానున్నాయి.

గతంలో సుమారు రెండేళ్ల పాటు బీడీకట్టలపై 'పుర్రెగుర్తు' ముద్రించే అంశం బీడీ పరిశ్రమను కుదిపేసింది. తాజాగా జీఎస్టీ వల్ల పడే ప్రభావం బీడీ పరిశ్రమ వర్గాలను ఆందోళనకు గురిచేస్తోంది. తెలంగాణలోని ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వేల మంది కార్మికులు బీడీ పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నారు.

జీఎస్టీ అమలుతో మున్ముందు వీరి ఆర్థిక జీవనంపై ప్రభావం చూపనున్నది. తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి ఈటెల రాజేందర్, ఐటీ - పరిశ్రమలు - మున్సిపల్ శాఖల మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఈ జిల్లా నుంచే అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

జీవనభృతి అందిస్తున్న సర్కార్

జీవనభృతి అందిస్తున్న సర్కార్

ఉమ్మడి కరీంనగర్‌తోపాటు నిజామాబాద్, ఆదిలాబాద్, వరంగల్ జిల్లాల ప్రజల్లో రాష్ట్ర ప్రభుత్వ అధికారిక గణాంకాల ప్రకారమే రమారమి 4.5 లక్షల మంది బీడీ తయారీపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. 2011 జన గణన ప్రకారం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 9,85,417 మంది జనాభా ఉన్నారు. వారిలో 1.20 లక్షల మంది బీడీ పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నారు. 79,694 మందికి తొలిదశలో జీవనభృతి పింఛన్లను అందిస్తున్నారు. మలిదశలో పీఎఫ్‌ కలిగినవారిలో మరో 15 వేలమంది వరకు జీవనభృతి అందనున్నది.

మహిళలపై కుటుంబ పోషణ భారం ఇలా

మహిళలపై కుటుంబ పోషణ భారం ఇలా

బీడీలు చుట్టేవారు, ప్యాకర్లు, చాకర్లు, టేకేదార్లు, ఇతరత్రా 1.20 లక్షల మందివరకు ఉండగా 20 లిమిటెడ్‌ కంపెనీలు, 40 స్థానిక బీడీ కంపెనీలు ఉన్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని అన్ని గ్రామాలతోపాటు జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి పట్టణాల్లోనూ పెద్దఎత్తున ప్రజలు బీడీపరిశ్రమను ఉపాధిగా మలుచుకున్నారు. చాలా కుటుంబాల్లో మహిళలు బీడీలు చుడుతున్నారు.

కొందరు పురుషులు కూడా బీడీలు చుట్టి, ప్యాకింగ్‌లోనూ సాయమందిస్తారు. భర్త విదేశాలకు వెళ్లడం, కుటుంబ పెద్దను కోల్పోయినవారు, నిరక్షరాస్యులు, పెద్దగా చదువుకోనివారు కుటుంబ ఆర్థిక పరిస్థితిని బట్టి జీవనం సాగించేందుకు బీడీలు చుట్టే పని చేపడతారు. ప్రస్తుతం వెయ్యి బీడీలకు రూ.173.45 చెల్లిస్తుండగా చాలామంది రోజుకు 400 నుంచి వెయ్యి బీడీలను దాటి చుడతారు. దీంతో కుటుంబ పోషణంతా బీడీలపైనే వెళ్లదీస్తారు.

ఇలా బీడీ పరిశ్రమ భవిష్యత్

ఇలా బీడీ పరిశ్రమ భవిష్యత్

వస్తుసేవల పన్ను అమలు అనంతరం బీడీలను చుట్టే తునికాకుపై పన్ను 2-18 శాతానికి పెరగనున్నది. తంబాకుపై 2 నుంచి 5 వరకు తయారైన బీడీలపై 28 శాతం పన్నును విధిస్తున్నారు. ప్రస్తుతం వెయ్యి బీడీలపై రూ. 16 వరకు పన్ను ఉండగా జీఎస్టీ అమలుతో రూ.70 నుంచి రూ.80కి చేరనున్నది. దీంతో బీడీ కట్టల ధర అమాంతం పెరిగి కూర్చునే అవకాశం ఉన్నది. వినియోగదారులు కూడా బీడీలు కొనడం తగ్గించే అవకాశం ఉన్నది. ఇప్పటికే తక్కువధర సిగరెట్లతోనూ బీడీలను తాగేవారి సంఖ్య తగ్గుతుండటం కూడా పరిశ్రమపై పెను ప్రభావం పడుతున్నది.

పొగాకు ఉత్పత్తుల వినియోగం తగ్గించడానికే

పొగాకు ఉత్పత్తుల వినియోగం తగ్గించడానికే

బీడీలు చేతితో తయారు చేసేవి కనుక ఇన్నాళ్లూ తెలంగాణలో బీడీలపై విలువ ఆధారిత పన్నును వసూలు చేయలేదు. రాజస్థాన్‌, గుజరాత్‌ తదితర రాష్ట్రాల్లోనే బీడీలపై పన్ను ఉండేది. దేశవ్యాప్తంగా ఒకే పన్నువిధానం అమల్లోకి తేవటం, పొగాకు ఉత్పత్తుల వాడకం తగ్గించాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం బీడీలపై పన్నుభారం అధికంగా వేయనున్నది.

బీడీ ధరలు తడిసి మోపెడు

బీడీ ధరలు తడిసి మోపెడు

ఇప్పటికే బీడీ కట్టల ధరలు రూ.14-18 వరకు ఉండగా.. జీఎస్టీ అమలుతో కంపెనీలను బట్టి రెట్టింపయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో కొనేవారి సంఖ్య తగ్గితే తదుపరి తయారీ నిలిచిపోయి కార్మికుల జీవనోపాధిపై తీవ్ర ప్రభావం పడనున్నది. గతంలో బీడీకట్టలపై పుర్రెగుర్తు ముద్రణను నిలిపివేయాలని 40 రోజులకు పైగా పరిశ్రమ స్తంభించగా ప్రస్తుతం జీఎస్టీ ప్రభావం ప్రత్యక్షంగా పడనున్నది.

కార్మికులను ఆదుకునే చర్యలు కావాలి

కార్మికులను ఆదుకునే చర్యలు కావాలి

తునికాకు, తంబాకు ప్రభావం, గంటల తరబడి కూర్చుండి పనిచేయడంతో కార్మికులు, పరిశ్రమల్లో పనిచేసేవారు తీవ్ర అనారోగ్యం పాలవుతారు. కానీ ఇప్పటి వరకు జీవనం సాగించే వరకే బీడీలను చుట్టడం సరిపోతున్నదని బీడీ కార్మికులు అంటున్నారు. ఇంతకన్నా తయారీ తగ్గించవద్దని, బీడీలపై ఆధారపడినవారికి ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలను కల్పించాలి. గతంలో మాదిరిగానే బీడీలపై పన్నులు ఉండవద్దని బీడీ కార్మికులు కోరుతున్నారు. ఇటీవల కొన్నేళ్లుగా బీడీల పరిశ్రమపై పలురకాల ప్రభావం పడి వాటిని తయారు చేసేవారి సంఖ్య తగ్గుతోంది. ఒకవేళ పన్నులతో బీడీకట్టల ధరలు పెరిగితే కొనేవారి సంఖ్య తగ్గిపోతుందని ఆందోళన చెందుతున్నారు. బీడీల తయారీపై ఆధారపడి వేల మంది జీవిస్తున్నందున పరిశ్రమను ఆదుకునేలా చర్యలను తీసుకోవాలని కోరుతున్నారు.

పన్ను తగ్గించకుంటే పోరు తప్పదని కార్మిక సంఘాల హెచ్చరిక

పన్ను తగ్గించకుంటే పోరు తప్పదని కార్మిక సంఘాల హెచ్చరిక

ఇదివరకు తెలంగాణ సహా 17 రాష్ట్రాల్లో బీడీలపై పన్నులేదని బీడీకార్మికసంఘ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుధీర్ తెలిపారు. చేతివృత్తుల పరిశ్రమగా లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్న బీడీపరిశ్రమను వస్తు సేవల పన్ను నుంచి మినహాయించాలని కేంద్రమంత్రి అర్జున్‌ మేఘవాల్‌ను రెండుసార్లు కలిసి విన్నవించామన్నారు. ఇప్పటికే బీడీ పరిశ్రమను చౌకధరల సిగరెట్లు తదితర సంక్షోభాలు వెన్నాడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. జీఎస్టీ నుంచి బీడీలను మినహాయిస్తేనే పరిశ్రమ మనగలుగుతుందని, దీనికి ఇతర జాతీయ కార్మిక సంఘాలతో కలిసి ప్రభుత్వంపై పోరాటం చేస్తామని చెప్పారు.

మంత్రులు కేటీఆర్, ఈటెలపైనే కార్మికుల భారం

మంత్రులు కేటీఆర్, ఈటెలపైనే కార్మికుల భారం

ఉమ్మడి కరీంనగర్ జిల్లా చెందిన మంత్రులు ఈటెల రాజేందర్, కల్వకుంట్ల తారక రామారావు జీఎస్టీ అమలుపై జరిగిన సమావేశాల్లో కీలక సమావేశాలకు హాజరయ్యారు. జీఎస్టీ అమలుతో రాష్ట్రానికి రావాల్సిన వాటాలో నష్టం వాటిల్లుతుందని పదేపదే ప్రకటించారు. దేశవ్యాప్తంగా అమలులోకి వచ్చినందున తామేమీ చేయలేమని.. అయితే రాష్ట్ర వాటా ఆదాయం సంపాదించేందుకు కేంద్రంతో పోరాడతామని వాదించారు. అదే సమయంలో ఉత్తర తెలంగాణ ప్రాంతంలో బీడీ తయారీ ప్రధాన ఆదాయ వనరుగా జీవిస్తున్న 4.5 లక్షల మంది కార్మికుల భవితవ్యం గురించి కూడా ద్రుష్టి సారించాలని కోరుతున్నారు.

English summary
Beedi Industry was crisis in Telangana because with implementation of GST. Totally 4.5 lakhs workers families in Telangana depended on Beedi production. Union Government had decided to reduce beedi usage.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X