విషాదం: కారు ఢీకొట్టడంతో మాజీ ఎమ్మెల్యే కుమారుడు మృతి
యాదాద్రిభువనగిరి: తెలంగాణలోని యాదాద్రిభువనగిరి జిల్లాలోని చౌటుప్పల్ మండలం ధర్మోజిగూడెం వద్ద మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో గుంటూరు మాజీ ఎమ్మెల్యే కుమారుడు మృతి చెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు మాజీ ఎమ్మెల్యే హసన్ అలీ కుమారుడు షేక్ షారుక్(22) తన స్నేహితుడు ఫయాజ్‌తో కలిసి గుంటూరు నుంచి హైదరాబాద్‌కు ద్విచక్ర వాహనంపై వెళ్తున్నాడు. ధర్మోజిగూడెం క్రాస్ రోడ్డు వద్దకు రాగానే చలి వేస్తోందని ద్విచక్ర వాహనాన్ని హైవే పక్కన నిలిపి స్వెట్టర్ ధరిస్తున్నారు.

ఈ సమయంలోనే చౌటుప్పల్ నుంచి హైదరాబాద్ వైపు వెళుతున్న కారు అతివేగంగా వచ్చి వీరిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనంపై కూర్చున్న షారుక్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఫయాజ్‌కు ఎలాంటి గాయాలు కాలేదు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చౌటుప్పల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
బస్సు బోల్తా: ముగ్గురు మృతి, 20 మందికి గాయాలు
చిత్తూరు జిల్లా మదనపల్లెలో ఓ ప్రైవేటు బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, మరో 20 మందికి గాయాలయ్యాయి. మదనపల్లె రూరల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మదనపల్లె నుంచి అడవిపల్లె గ్రామానికి 20 మందికిపైగా ప్రయాణికులు ఓ ప్రైవేటు బస్సులో బయల్దేరారు. ఈ క్రమంలో అడవిపల్లె గ్రామ పరిధిలో ఉన్న జ్యూస్ పరిశ్రమ వద్దకు రాగానే రాళ్లను ఢీకొని బస్సు బోల్తా పడింది.
ఈ ప్రమాదంలో ఎర్రబల్లికి చెందిన గంగులప్ప(65), బండకడపల్లికి చెందిన సోమనాయుడు(19), అడవిలోపల్లి గ్రామానికి చెందిన మల్లిఖార్జున(29) సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. మరో 20 మందికిపైగా గాయపడ్డారు. వీరిని మదనపల్లె ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.