ఎక్కడైనా చర్చకు రా, మీ దోస్త్ చంద్రబాబే చెప్పారు: జైపాల్‌కు హరీష్ సవాల్, రేవంత్ పేరును లాగి..
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి పైన హరీష్ రావు మంగళవారం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అవినీతి, ప్రాజెక్టులపై చర్చకు రావాలని హరీష్ రావు సవాల్ చేశారు. ప్రాజెక్టుల పైన బహిరంగ చర్చకు సిద్ధమని చెప్పారు. జైపాల్ రెడ్డి ఎక్కడకు రమ్మంటే అక్కడకు వస్తామన్నారు.
జైపాల్ రెడ్డి ఏనాడు తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలేదని హరీష్ రావు చెప్పారు. తెలంగాణ ఉద్యమం ఊసెత్తలేదన్నారు. ఉద్యమం సమయంలో ఆయన ఏం మాట్లాడారో అందరికీ గుర్తుందని చెప్పారు. తాను ప్రాంతీయవాదిని కాదని, జాతీయవాదినని చెప్పుకున్నారని ధ్వజమెత్తారు. జైపాల్ రెడ్డి విమర్శలు సెల్ఫ్ గోల్ అన్నారు.
కేసీఆర్! నీ కమీషన్ల బాగోతం బయటపెడతా: పట్టపగలే దోపిడంటూ జైపాల్ నిప్పులు

కొండను తవ్వి ఎలుకను పట్టినట్లుగా
తెలంగాణ రాష్ట్రానికి అవినీతి మరక అంటించే ప్రయత్నాలు చేస్తున్నారని హరీష్ రావు ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేసులో ఉన్నానని చెప్పేందుకే జైపాల్ రెడ్డి ఆరోపణలు అన్నారు. పదేళ్ల కాంగ్రెస్ పాలనలో ఏం జరిగిందో ప్రజలకు బాగా తెలుసునని చెప్పారు. కొండను తవ్వి ఎలుకను పట్టినట్లుగా ఆయన వ్యవహారం ఉందని చెప్పారు.

ఎందుకు ఇవ్వలేదు
జలయజ్ఞం పేరిట పదేళ్లు కాంగ్రెస్ పార్టీ చేసింది ఏమీ లేదని హరీష్ రావు అన్నారు. జలయజ్ఞాన్ని ధనయజ్ఞంగా మార్చారన్నారు. పదేళ్ల కాలంలో కాంగ్రెస్ 5 లక్షల ఎకరాలకు నీరు ఇస్తే, ఈ నాలుగేళ్లలో తాము అంతకంటే ఎన్నో రెట్లు ఎక్కువగా ఇచ్చామని చెప్పారు. ప్రాజెక్టుల టెండర్ల డాక్యుమెంట్లు ఆన్లైన్లో ఉన్నాయని చెప్పారు. 15 వేల గ్రామాలకు మంచినీరు ఇచ్చామని చెప్పారు. కేంద్రమంత్రిగా తెలంగాణకు జైపాల్ రెడ్డి తెలంగాణ వారికి ప్రాజెక్టులు ఎందుకు ఇవ్వలేదో చెప్పాలన్నారు.

మీ దోస్త్ చంద్రబాబే చెప్పారు
అభివృద్ధిలో దూసుకెళ్తున్న తెలంగాణకు అవినీతి మరక అంటించే ప్రయత్నాలు జైపాల్ రెడ్డి చేశారని హరీష్ రావు అన్నారు. జలయజ్ఞం ధనయజ్ఞంగా మారిందని విమర్శలు చేసిన తెలుగుదేశం పార్టీతోనే కాంగ్రెస్ పార్టీ ఎలా పొత్తు పెట్టుకుందో చెప్పాలని నిలదీశారు. మీ దోస్త్ చంద్రబాబే ఆ విషయం చెప్పారన్నారు. ఒక్క ఎకరానికి సాగునీరు, ఒక్క ఇంటికి తాగు నీరు రాలేదని మీరు చెప్పడం విడ్డూరమన్నారు. మేం ఇచ్చిన నీటితో పంట పండించిన రైతన్నలు, మేం ఇచ్చిన నీరు తాగిన అక్కాచెల్లెళ్లే అది చెబుతారన్నారు.

కొందరు జూనియర్లలా నోరు పారేసుకున్నారు
జైపాల్ రెడ్డి దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని హరీష్ రావు అన్నారు. కాంగ్రెస్ పార్టీలో చాలామంది సీఎం రేసులో ఉండి కొట్లాడుకుంటున్నారని, ఆ లిస్టులో జైపాల్ రెడ్డి పేరు కనిపించడం లేదని, ఆయన పేరు కూడా ప్రముఖంగా మీడియాలో రావడం లేదని, దీంతో ఆయన రేసులో ఉన్నానని చెప్పుకునేందుకు తెర మీదకు వచ్చారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీలో కొందరు జూనియర్ నాయకులు నోరు పారేసుకుంటున్నారని రేవంత్ రెడ్డిని ఉద్దేశించి అన్నారు. అదే దారిలో జైపాల్ వెళ్తున్నట్లుగా ఉందన్నారు. తాము ఒక్క పాలమూరులోనే 8 లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చామన్నారు. ఈపీసీ విధానం, మొబిలైజేషన్ విధానంపై పాలసీ తెచ్చిందే కాంగ్రెస్ అన్నారు. ప్రాజెక్టులపై ఎక్కడైనా, ఎప్పుడైన చర్చకు తాను సిద్ధమని చెప్పారు. ఆంధ్రా వారిని పెంచి పోషించింది మీరే అన్నారు.
