కేంద్రం ద్వంద్వ వైఖరి: వరి కొనుగోలుపై హరీశ్ రావు, చివరకు తామే కొంటామంటూ..
సిద్దిపేట: వరి పంట కొనుగోలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం ద్వంద్వవైఖరి అవలంభిస్తోందని తెలంగాణ ఆర్థిక మంత్రి హరీశ్ రావు విమర్శించారు. సిద్దిపేట జిల్లాలోని చిన్నకోడూర్, పెద్ద కోడూర్, రాముని పట్ల గ్రామాలలో వడ్ల కొనుగోలు కేంద్రాలను మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్రంపై మండిపడ్డారు.
పంజాబ్ నుంచి వరి ధాన్యం కొంటున్నట్టుగా తెలంగాణ నుంచి ఎందుకు కొనుగోలు చేయడంలేదని మంత్రి హరీష్ రావు కేంద్రాన్ని ప్రశ్నించారు. పంజాబ్‌కు ఒక న్యాయం, తెలంగాణకు ఇంకో న్యాయమా? అని నిలదీశారు. బాయిల్డ్ రైస్ కొనుగోలు చేయం అనే మాట తమను తీవ్రంగా బాధించిందని మంత్రి హరీష్ రావు అన్నారు. యాసంగి పంటను కొనుగోలు చేస్తారో, లేదో కేంద్రం స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

కేంద్రం తన విధానాలను మార్చుకోవాలన్నారు మంత్రి హరీశ్ రావు. దేశంలో వరి అధికంగా పండితే ఆ ధాన్యాన్ని ఆఫ్రికా దేశాలకు, ఇతర ప్రపంచ దేశాలకు ఎగుమతి చేయొచ్చని సూచించారు. వానాకాలం పంటపై రైతులకు మాటిచ్చామని, కేంద్రం కొనకపోయినా రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని స్పష్టం చేశారు. అందుకే రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు నెలకొల్పామని హరీష్ రావు చెప్పారు.
రైతులకు గుదిబండగా మారిన నల్ల చట్టాలు రద్దు రైతుల విజయమని
సంవత్సరం కాలం పాటు రైతుల పోరాటంతో కేంద్రం దిగొచ్చిందని మంత్రి హరీశ్ రావు వ్యాఖ్యానించారు. రైతుల పోరాట ఫలితమే నల్ల చట్టాలు రద్దు అని స్పష్టం చేశారు. నల్ల చట్టాలు అమలైతే వ్యవసాయం కార్పొరేట్ పాలయ్యేదని ఆరోపించారు. రైతుల పక్షాన స్వయంగా సీఎం కేసీఆర్ ధర్నా చేపట్టారు. అన్నదాతలు ఆందోళనల పడొద్దు... ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసానిచ్చారు.
వానకాలం పంట మొత్తం తెలంగాణ ప్రభుత్వం కొంటుంది. వడ్లు కొనేందుకే ఊరూరా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసామన్నారు. సాధ్యమైనంత త్వరగా వానకాలం ధాన్యం కొంటామని పేర్కొన్నారు. రైతులకు ఇచ్చిన మాట ప్రకారం కేంద్ర ప్రభుత్వం కొనకపోయినా వానకాలం పంటను రాష్ట్ర ప్రభుత్వం కొంటుందన్నారు. వర్షాల వల్ల వడ్లు ఎండక పోవడం వల్ల ధాన్యం కొనడంలో కొంత ఆలస్యం జరిగింది.
కొనుగోలు ప్రక్రియ సజావుగా జరిగేలా చూసేందుకు సర్పంచ్‌లు, స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు రోజుకు రెండు గంటల పాటు కొనుగోలు కేంద్రాల వద్దే ఉండాలని ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు పక్ష పాత నిర్ణయాలు, ప్రోత్సాహంతో రైతులు పంటలు బాగా పండిస్తున్నారు. యాసంగి నుంచి వడ్లు కొనం అనే కేంద్ర నిర్ణయం సరికాదన్నారు.