కలకలం: గోనెసంచిలో తల లేని యువతి మొండెం
సిద్దిపేట: తలలేని ఓ యువతి మృతదేహం సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం అక్కారం గ్రామ శివార్లలో కలకలం రేపింది. గజ్వేల్ ఏసీపీ గిరిధర్‌రావు తెలిపిన వివరాల ప్రకారం.. అక్కారం గ్రామంలోని తోట లక్ష్మారెడ్డి వ్యవసాయ పొలం పక్కన గల కాలువలో ఒక తెల్లని గోనె సంచిలో గుర్తుతెలియని యువతి మృతదేహం ఉందని గ్రామ సర్పంచ్ రాజుకు సమాచారం అందింది.
వెంటనే ఆయన పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటన స్థలానికి వచ్చి మృతదేహాన్ని పరిశీలించారు. 22 నుంచి 25 సంవత్సరాల మధ్య వయస్సున్న యువతి మృతదేహంగా గుర్తించారు.

తల నుంచి పూర్తిగా వేరు చేసి మొండాన్ని మాత్రమే సంచిలో వేసి ఉంది. యువతి ఒంటిపై ఎర్రని ప్యాంట్ (పైజామా), ఎరుపు, నలుపు కలగలిపిన టాప్ (చుడిదార్) ఉంది.
గుర్తు తెలియని వ్యక్తులు పదునైన ఆయుధంతో మెడ వరకు తలను వేరు చేసి మొండాన్ని సంచిలో వేసి పడేసినట్లు పోలీసులు భావిస్తున్నారు.
క్లూస్ టీమ్‌తో ఆధారాలను సేకరించామని, జాగిలా(డాగ్‌స్క్వాడ్)లతో తనిఖీ చేసినట్లు ఏసీపీ తెలిపారు. ఈ కేసును గజ్వేల్ ఎస్ఐ కమలాకర్ కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ తెలిపారు. మృతదేహాన్ని గజ్వేల్ ఏరియా ఆస్పత్రి మార్చురికి తరలించారు. వివిధ పోలీస్స్టేషన్లలో నమోదైన యువతుల మిస్సింగ్ కేసుల సమాచారాన్ని పో లీసులు సేకరిస్తున్నారు.