హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

భారీ వర్షానికి వణికిన భాగ్యనగరం, ముగ్గురి మృతి, నరకం చవిచూసిన జనం, మరికొన్ని గంటలు ఇంతే...

భారీ వర్షానికి భాగ్యనగరం వణికింది. సోమవారం సాయంత్రం నుంచి కురుస్తోన్న వర్షానికి నగరవాసులు నరకం చవిచూశారు. ట్రాఫిక్ ఎక్కడికక్కడే నిలిచిపోయింది. వాహనదారులు నానా అవస్థలు పడ్డారు.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

Recommended Video

Heavy Rains Crippled Normal Life In Hyderabad భారీ వర్షానికి వణికిన భాగ్యనగరం | Oneindia Telugu

హైదరాబాద్: భారీ వర్షానికి భాగ్యనగరం వణికింది. సోమవారం సాయంత్రం నుంచి కురుస్తోన్న వర్షానికి నగరవాసులు నరకం చవిచూశారు. రహదారులపై ఎక్కడికక్కడ నీరు చేరిపోవడంతో ట్రాఫిక్ ఎక్కడికక్కడే నిలిచిపోయింది. వాహనదారులు నానా అవస్థలు పడ్డారు.

రంగంలోకి దిగిన జీహెచ్‌ఎంసీ.. సహాయ కార్యక్రమాలు మొదలుపెట్టిన కొద్దిసేపటికే వాతావరణ శాఖ నుంచి మరో హెచ్చరిక జారీ అయింది. రానున్న మరికొద్ది గంటలూ ప్రజలు, యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని, భారీ నుంచి అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని సూచించింది.

వాహనాల దారి మళ్లింపు...

వాహనాల దారి మళ్లింపు...

మియాపూర్, కూకట్ పల్లి, దిల్ సుఖ్ నగర్, హయత్ నగర్, నాగోల్, మలక్ పేట్ లతో పాటు నగరంలోని ప్రధాన రహదారులన్నీ ట్రాఫిక్ జామ్ తో నిండిపోయాయి. రహదారులపై చేరిన నీటిని తొలగించడానికి కనీసంగా మరో మూడు గంటల సమయం పట్టే అవకాశాలున్నందున అత్యవసరమైతే తప్ప రోడ్లపైకి రాకపోవడమే మంచిదని సూచిస్తున్నారు. భారీ నీటి వరద వస్తున్న కారణంగా మొజాంజాహీ నుంచి బేగంబజార్ వైపునకు వచ్చే వాహనాలను పూర్తిగా మళ్లించాలని అధికారులను ఆదేశించారు.

రంగంలోకి డిజాస్టర్ మేనేజ్ మెంట్ బృందాలు..

రంగంలోకి డిజాస్టర్ మేనేజ్ మెంట్ బృందాలు..

ఆస్మాన్ గఢ్, చార్మినార్, బేగంబజార్, అత్తాపూర్, రాజేంద్రనగర్, ఇబ్రహీంపట్నం ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా విద్యుత్ స్తంభాలపై చెట్లు కూలాయి. దీంతో ముందుజాగ్రత్త చర్యగా ఆయా ప్రాంతాల్లో విద్యుత్తు సరఫరాను నిలిపివేశారు. పాతబస్తీలోని చందూలాల్బరదారిలోని హెచ్ఎండబ్ల్యూఎస్ కార్యాలయం గోడ కూలి పక్కన ఉన్న రెండు కార్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. రహదారులపై పడిన విద్యుత్ వైర్లను తాకరాదని సీఎండీ రఘుమారెడ్డి హెచ్చరించారు. విద్యుత్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ బృందాలు రంగంలోకి దిగాయని, తెగిపడిన విద్యుత్ వైర్లను తొలగించే పనిలో నిమగ్నమయ్యారని ఆయన తెలిపారు. విద్యుత్ ఫిర్యాదుల కోసం ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని, సమస్యలపై సమాచారం అందించేందుకు టోల్ ఫ్రీ నంబర్ 1912 ఏర్పాటు చేశామని చెప్పారు.

వర్షం తగ్గుముఖం పట్టాక కదిలిన రైళ్లు...

వర్షం తగ్గుముఖం పట్టాక కదిలిన రైళ్లు...

భాగ్యనగరంలో భారీ వర్షాల కారణంగా సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు ఎంఎంటీఎస్ రైళ్ల సర్వీసులను నిలిపివేశారు. సికింద్రాబాద్, నాగులపల్లి, మౌలాలి, ఘటకేసర్ మార్గంలో నాలుగు సర్వీసులను నిలిపివేసినట్టు అధికారులు వెల్లడించారు. అలాగే ఇతర ప్రాంతాలకు వెళ్లే పలు రైళ్ల వేళల్లో మార్పులు చేశారు. హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్లాల్సిన చార్మినార్ ఎక్స్ ప్రెస్ సాయంత్రం 6.30 గంటలకు బయలుదేరాల్సి ఉండగా, సాయంత్రం 7.30 గంటలకు బయలుదేరి వెళ్లింది. భారీ వర్షాల కారణంగా ఈస్ట్ కోస్ట్ ఎక్స్ ప్రెస్ ను మౌలాలి వద్ద, తెలంగాణ ఎక్స్ ప్రెస్ ను చెర్లపల్లి వద్ద, తాండూరు-హైదరాబాద్ ప్యాసింజర్ ఎక్స్ ప్రెస్ ను శంకర్ పల్లి వద్ద, వరంగల్-హైదరాబాద్ ప్యాసింజర్ ఎక్స్ ప్రెస్ ను హుస్సేన్ సాగర్ వద్ద కొద్దిసేపు నిలిపివేశారు. రాత్రి వర్షం తగ్గుముఖం పట్టిన తర్వాత ఒక్కో రైలు కదిలింది.

రాత్రి కాస్త తగ్గుముఖం పట్టినా...

రాత్రి కాస్త తగ్గుముఖం పట్టినా...

సోమవారం సాయంత్రం నాలుగు గంటల నుంచి మొదలై రాత్రి వరకు హైదరాబాద్ నగరంలో భారీ వర్షం కురిసింది. రాత్రి 8 గంటల ప్రాంతంలో కాస్త తగ్గుముఖం పట్టినప్పటికీ వర్షం పడడం మాత్రం ఆగలేదు. బహదూర్ పుర ప్రాంతంలో అత్యధికంగా 12.6 సెం.మీ., వర్షం కురిసింది. రాజేంద్రనగర్ లో 11.2 సెం.మీ., అంబర్ పేటలో 11.5 సెం.మీ., గోల్కొండ ప్రాంతంలో 9.5 సెం.మీ., సికింద్రాబాద్ మోండా మార్కెట్ ప్రాంతంలో 9.5 సెం.మీ., నారాయణగూడ ప్రాంతంలో 8.8 సె.మీ., ముషీరాబాద్ లో 8.7 సెం. మీ., మల్కాజిగిరి కాప్రాలో 8.7 సె.మీ., సరూర్ నగర్ ప్రాంతంలోని డీఎంఆర్ఎల్ సమీపంలో 8.6 సె.మీ., సైదాబాద్ లోని ఆస్మాన్ గఢ్ ప్రాంతంలో 8.6 సెం.మీ. మేరకు వర్షపాతం నమోదైంది. మిగిలిన అన్ని ప్రాంతాల్లో మూడు నుంచి అయిదు సెంటీమీటర్ల మేరకు వర్షపాతం నమోదైంది.

వర్షం దెబ్బకు ముగ్గురు మృతి...

వర్షం దెబ్బకు ముగ్గురు మృతి...

ఎడతెగకుండా కురుస్తున్న వర్షం కారణంగా బంజారాహిల్స్ లోని సింగాడి కుంట బస్తీలో ఓ ఇంటి మట్టిగోడ కూలింది. మట్టిపెళ్లలు మీదపడిన ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు కూరుకుపోయినట్టు సమాచారం. మరో ఇద్దరిని స్థానికులు కాపాడారు. మృతులు.. తండ్రీకొడుకులుగా భావిస్తున్నారు. ఘటనాస్థలి వద్ద జీహెచ్ఎంసీ సిబ్బంది సహాయక చర్యలు ప్రారంభించారు. రాత్రి తొమ్మిది గంటల సమయానికి కూడా ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పాతబస్తీలోని ముర్గీ చౌక్ ప్రాంతంలో తెగిన విద్యుత్తు వైరు ఆటోట్రాలీ మీద పడిన ఘటనలో అఫ్సర్ అనే వ్యక్తి మరణించాడు.

ఆహార పొట్టాల పంపిణీ...

ఆహార పొట్టాల పంపిణీ...

నాగారం గ్రామంలో, సమీపంలోని ఎగువ ప్రాంతంలో భారీ వరద నీరు అన్నరాయుని చెరువుకు చేరుతోంది. ఆ కారణంగా సమీపంలోని లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ అధికారులు సూచించారు. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను అప్రమత్తం చేస్తూ మున్సిపల్ అధికారులు రంగంలోకి దిగారని జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్ధన్ రెడ్డి తెలిపారు. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలకు సోమవారం రాత్రి అందించడానికి తక్షణం వెయ్యి ప్యాకెట్ల మేరకు ఆహార పొట్లాల పంపిణీ ప్రారంభించినట్టు చెప్పారు. మంగళవారం ఉదయం మరో 5 వేల ఆహార పొట్లాలు సిద్ధం చేసి పంపిణీ చేపట్టనున్నట్టు తెలిపారు.

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి...

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి...

హైదరాబాద్ లో భారీ వర్షాలపై సీఎం కేసీఆర్‌ సోమవారం రాత్రి సమీక్ష నిర్వహించారు. పరిస్థితిపై జీహెచ్‌ఎంసీ కమిషనర్‌, పోలీసు కమిషనర్ తో మాట్లాడారు. అధికార యంత్రాంగమంతా అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు. ఎక్కడ ఇబ్బంది ఉన్నా అధికారులు వెంటనే స్పందించాలని చెప్పారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే తప్ప బయటకు రావొద్దని సీఎం కేసీఆర్‌ సూచించారు.

ఇళ్లల్లోకి, దుకాణాల్లోకి వరద నీరు...

ఇళ్లల్లోకి, దుకాణాల్లోకి వరద నీరు...

హైదరాబాద్ లో కురుస్తున్న భారీ వర్షానికి నగరంలోని పలు ప్రాంతాలు అతలాకుతలం అవుతున్నాయి. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోకి కూడా వర్షపు నీరు చేరింది. చాదర్ ఘాట్, మూసానగర్, రసూల్ పురా, కమలానగర్ లలో ఇళ్లలోకి, మలక్ పేట్ లోని బజాజ్ ఎలక్ట్రానిక్స్ షోరూమ్ లోకి వర్షపు నీరు చేరింది. నల్లకుంట నాగమయ్య కుంటలోని ఇళ్లలోకి నీరు రావడంతో కాలనీవాసులు బయటకు వచ్చేశారు. కార్వాన్ సర్కిల్ లోని మందులగూడ, హీరానగర్, కనకదుర్గ కాలనీ, సాయినగర్ బస్తీ వాసులూ అవస్థలు పడుతున్నారు. పక్కనే ఉన్న కాల్వ వర్షపు నీటితో నిండటంతో ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు బయటకు రాలేక ఇబ్బందిపడుతున్నారు.

ఆ భవనాలను తక్షణం ఖాళీ చేయాలి...

ఆ భవనాలను తక్షణం ఖాళీ చేయాలి...

భారీ వర్షం కారణంగా శంషాబాద్ హైవేపై ట్రాఫిక్ స్తంభించడంతో వాహనదారులు ఇక్కట్లు పడుతున్నారు. ఖైరతాబాద్ నుంచి పంజాగుట్ట, పంజాగుట్ట నుంచి గ్రీన్ ల్యాండ్స్, ప్యాట్నీ నుంచి బాటా, ప్యారడైజ్ నుంచి రాణీగంజ్, సీబీఎస్, పుతిలిబౌలి వైపు వెళ్లే వాహనాలను ట్రాఫిక్ పోలీసులు నిలిపివేశారు. అఫ్జల్ గంజ్ నుంచి మొజాం జాహీ మార్కెట్ మార్గంలో ట్రాఫిక్ స్తంభించిపోగా, చాంద్రాయణగుట్ట ఫైఓవర్ దగ్గర 2 కిలోమీటర్ల మేరకు వాహనాలు నిలిచిపోయాయి. మాదాపూర్ పోలీస్ స్టేషన్ దగ్గర భారీగా ట్రాఫిక్ జామ్ అవడంతో, అయ్యప్ప సొసైటీ వైపుగా వాహనాలను మళ్లించారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఎమర్జెన్సీ కంట్రోల్ సెంటర్ ను ఏర్పాటు చేశారు. శిథిలావస్థకు చేరిన భవానాల్లో నివసించే వారు తక్షణం వాటిని ఖాళీ చేయాలని, సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని జీహెచ్ఎంసీ కమిషనర్ సూచించారు.

మంత్రి హెలికాప్టర్ కు వర్షం దెబ్బ...

మంత్రి హెలికాప్టర్ కు వర్షం దెబ్బ...

భారీ వర్షాల కారణంగా తెలంగాణ మంత్రి హ‌రీశ్ రావు హెలికాఫ్టర్‌లో కాసేపు ఇబ్బంది ప‌డ్డారు. ఖమ్మంలో పర్యటించేందుకు హరీశ్‌రావు సోమవారం ఉదయం హెలికాప్టర్‌లో వెళ్లారు. తిరిగి రాత్రికి అదే హెలికాఫ్ట‌ర్‌లో హైద‌రాబాద్ కు వ‌చ్చారు. అప్పటికే న‌గ‌రంలో భారీ వ‌ర్షం కురుస్తోంది. దీంతో బేగంపేట విమానాశ్రయ అధికారులు ఆయ‌న హెలికాఫ్ట‌ర్‌ ల్యాండింగ్‌కు అనుమతి ఇవ్వలేదు. ప్ర‌తికూల‌ వాతావరణం కూడా ఉండ‌డంతో ఆయన హెలికాఫ్ట‌ర్‌ చాలాసేపు గాల్లోనే చక్కర్లు కొట్టింది. చివరికి పైలట్ న‌గ‌రంలోని హకీంపేటలో హెలికాప్టర్ ను దించాడు.

ముమ్మరంగా సహాయక చర్యలు: మంత్రి కేటీఆర్

ముమ్మరంగా సహాయక చర్యలు: మంత్రి కేటీఆర్

ఎడతెగని భారీ వర్షాల కారణంగా హైదరాబాద్ అతలాకుతలం అయింది. నగరంలో ఎక్కడికక్కడ ట్రాఫిక్, జనజీవనం స్తంభించిపోయాయి. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో నాలాలు పొంగి పొర్లుతున్న నేపథ్యంలో సహాయక చర్యలు ముమ్మరం చేయాలని మంత్రి కేటీఆర్ ఆదేశాలు జారీ చేశారు. భారీ వర్షాలపై సోమవారం రాత్రి ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. విద్యుత్ సరఫరాపై దృష్టి పెట్టాలని ఆదేశించారు. సహాయక చర్యల నిమిత్తం ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపామని, వర్షపు నీటిని మోటార్లతో తోడిస్తున్నామని జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి తెలిపారు.వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని, నాలాల వైపు వెళ్లొద్దని, లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న జనార్దన్ రెడ్డి తెలిపారు.

English summary
Heavy rains crippled normal life in the twin cities of Hyderabad and Secunderabad on Monday evening. Starting with a drizzle at around 3 pm, heavy rains lashed the twin cities till late evening bringing life to a halt. Almost all roads got inundated to the extent that it become impossible for the motorists to pass on them. Traffic came to a standstill on all major roads for several hours. Several crossroads turned into pools. Rain water entered into many low-lying areas, especially in the Old City. Power supply was badly hit in many areas. Heavy rains also claimed one life in the Old City. One person, Afsar (35), was electrocuted to death when an electric wire fell on his auto-trolley carrying chicken in Murgi Chowk area.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X