అసని ఎఫెక్ట్: మరో నాలుగు రోజులపాటు తెలంగాణలో భారీ వర్షాలు, ఉరుములుమెరుపులు, ఈదారుగాలులు
హైదరాబాద్: అసని తుపాను ప్రభావంతో తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో రానున్న కొద్ది రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఆగ్నేయ, నైరుతి బంగాళాఖాతం ఆనుకొని ఉన్న అల్పపీడన ప్రాంతం సముద్ర మట్టం నుంచి 5.8 కి.మీ వరకు విస్తరించి ఉన్న తుఫాను ప్రసరణతో కొనసాగుతోంది.
ఇది గురువారం నాడు దాదాపు పశ్చిమ దిశగా కదిలి పశ్చిమ మధ్య, దక్షిణ ఆంధ్రప్రదేశ్ ఉత్తర తమిళనాడు తీరాలకు ఆనుకుని నైరుతి బంగాళాఖాతంకి చేరుకుందని వాతావరణ శాఖ తెలిపింది.

భారత వాతావరణ శాఖ - హైదరాబాద్ ప్రకారం.. తెలంగాణలోని ఏకాంత ప్రదేశాలలో, రానున్న నాలుగు రోజుల్లో ఉరుములుమెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని, ఈదురు గాలులు 30-40 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని తెలిపింది.
'తుఫానుతో సంబంధం ఉన్న తుఫాను ప్రసరణ నుంచి ఒక ద్రోణి నడుస్తుంది, ఇది తెలంగాణ మీదుగా ఉత్తర అంతర్గత కర్ణాటక వరకు సముద్ర మట్టానికి 3.1 కి.మీ ఎత్తు వరకు వెళుతుంది' అని వాతావరణ శాఖ పేర్కొంది.
ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, మంచిర్యాల జిల్లాల్లో పలు ప్రాంతాల్లో బుధవారం భారీ వర్షాలు కురిశాయి. మరో నాలుగు రోజులపాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది.
కాగా, అసని తుఫాను రెండరోజుల క్రితమే ఏపీలో తీరాన్ని తాకి అల్ప పీడనంగా మారిన విషయం తెలిసిందే. అయితే, అల్ప పీడనం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కొనసాగుతున్నాయి. ఏపీలోనూ పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ఇప్పటికే వెల్లడించింది.