వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గాంధీ భవన్ కు భద్రత పెంపు.. తేడా వస్తే 1999 సీన్ రిపీట్ అవుతుందా?

|
Google Oneindia TeluguNews

పార్టీ కార్యాలయాలకు భద్రత సిబ్బంది ఉండటం సహజం. మహా అయితే పది మంది ఉంటారు. కానీ భద్రత కోసం పోలీసుల సహకారం తీసుకోవాల్సి వచ్చింది.ఇది ఎక్కడో కాదు, హైదరాబాద్ లోని తెలంగాణ కాంగ్రెస్ కార్యాలయం గాంధీ భవన్ పరిస్థితి. ఇప్పటికే మహాకూటమిలో భాగంగా సీట్ల సర్దుబాటుతో సతమతమవుతున్న పార్టీ పెద్దలకు.. సొంతగూటి నుంచి గుప్పుమంటున్న నిరసన సెగలు తలనొప్పిగా మారాయి. కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్న నేతల ఆందోళనలకు గాంధీభవన్ వేదికగా మారింది. దీంతో 1999 నాటి పరిస్థితి రిపీట్ కానుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అప్పుడు టికెట్ల విషయంలో ఆందోళనకు గురైన కొందరు నేతల అనుచరులు కార్యాలయంలోని ఫర్నీచర్ తగులబెట్టారు. నానా బీభత్సం సృష్టించారు.

దీంతో ఇప్పుడు జరుగుతున్న ఆందోళనలు కూడా అలాంటి పరిస్థితులకు దారితీస్తాయా అన్న టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. తమ నాయకులకు టికెట్ల విషయంలో అన్యాయం జరుగుతోందంటూ వివిధ నియోజకవర్గాల నుంచి వచ్చిన కార్యకర్తలు నిరసనలకు దిగుతున్నారు. ఈక్రమంలో రెండు మూడు రోజుల నుంచి గాంధీ భవన్ దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈనేపథ్యంలో టీపీసీసీ ముందస్తు చర్యలు తీసుకుంది. పోలీసుల సహకారంతో గాంధీభవన్ గేట్లకు తాళాలు వేయించింది.

ఎవరినీ లోనికి అనుమతించొద్దని ఆదేశాలు జారీచేసింది. 1999 నాటి నిరసన సెగల పర్వం మరోసారి గాంధీభవన్ కు తాకొద్దనేది హైకమాండ్ ఆలోచన. టీఆర్ఎస్ పార్టీని ఓడించడమే లక్ష్యంగా మహాకూటమిగా మారిన కాంగ్రెస్.. సొంతగూటి నేతల ఆందోళనలు నిలువరించకుంటే ప్రెస్టీజ్ పోతుందని ఫీలవుతోంది. అందుకే అసంతృప్తుల సెగలకు అడ్డుకట్ట వేసేందుకే గాంధీభవన్ చుట్టూ పోలీసులను మోహరించింది.

సర్దుబాట్లు ఒకవైపు.. సొంతగూటి నిరసనలు మరోవైపు

సర్దుబాట్లు ఒకవైపు.. సొంతగూటి నిరసనలు మరోవైపు

ముందస్తు ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీని ఓడించడమే లక్ష్యంగా టీడీపీ, టీజేఎస్, సీపీఐ పార్టీలతో మహాకూటమిగా ఏర్పడ్డ కాంగ్రెస్ పార్టీకి ఆదినుంచి తలనొప్పులే. పొత్తుల్లో భాగంగా భాగస్వామ పక్షాలకు సీట్ల సర్దుబాటు గగనంగా మారింది. మరోవైపు సొంతగూటి నేతలను బుజ్జగించడం కష్టంగా మారింది. కొన్నిచోట్ల తమను కాదని కూటమిలోని ఇతర పార్టీలకు సీట్లు కేటాయిస్తే కార్యకర్యలు చూస్తూ ఊరుకోరంటూ అధిష్టానానికి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మరోవైపు పార్టీ అభ్యర్థులను ప్రకటించుకుని ప్రచారంలో టీఆర్ఎస్ దూసుకుపోతుంటే.. రేపు మాపు అంటూ ఇంతవరకు కూటమి అభ్యర్థులను ప్రకటించకపోవడం గమనార్హం. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన కూడా మహాకూటమి లెక్కలు తేల్చకపోవడాన్ని కూడా పార్టీశ్రేణులు తప్పుబడుతున్నాయి.

పొత్తులు గిత్తులు జాన్తా నై.. పార్టీ నేతలకే టికెట్లివ్వాలి

పొత్తులు గిత్తులు జాన్తా నై.. పార్టీ నేతలకే టికెట్లివ్వాలి

పార్టీని వెన్నంటి వుంటూ పార్టీకోసం కష్టపడుతున్నవారికే టికెట్లు కేటాయించాలంటూ కొందరు నేతల మద్దతుదారులు గళమెత్తుతున్నారు. బహిరంగంగానే పార్టీ తీరును ఖండిస్తూ ఆరోపణలు గుప్పిస్తున్నారు. పొత్తుల పేరిట పార్టీని నమ్ముకున్న వారికి సున్నం పెడతారా అంటూ ఆందోళనలకు దిగుతున్నారు. ఈ క్రమంలో పార్టీ కార్యాలయం గాంధీభవన్ సాక్షిగా నిరసనలు మిన్నంటుతున్నాయి. రెండు మూడు రోజులుగా గాంధీభవన్ దగ్గర జరుగుతున్న పరిణామాలు హైకమాండ్ కు తలనొప్పిగా మారాయి. తమ నేతలకు టికెట్లివ్వాల్సిందేనంటూ వారి మద్దతుదారులు నినాదాలు చేస్తూ నిరసన గళం వినిపిస్తున్నారు. నిన్న మొన్న ఖానాపూర్, మల్కాజ్ గిరి నియోజకవర్గాలకు చెందిన కార్యకర్తలు గాంధీభవన్ దగ్గర దీక్ష చేపడితే తాజాగా వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆందోళనకు దిగడం చర్చానీయాంశమైంది.

సముద్రం లాంటి పార్టీ.. హైకమాండ్ కు సవాల్

సముద్రం లాంటి పార్టీ.. హైకమాండ్ కు సవాల్

సముద్రంగా అభివర్ణించే కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు కొత్తేమీ కాదు. జెండాలు మోసిన కార్యకర్తలు, పార్టీకోసం అహర్నిశలు శ్రమించిన కార్యకర్తలు, నేతలు సహజంగానే ఎన్నికల వేళ టికెట్లపై ఆశలు పెట్టుకుంటారు. దీనికితోడు సీనియర్ల నుంచి పోటీ ఎలాగూ ఉంటుంది. ఇవన్నీ కాకుండా పొత్తుల్లో భాగంగా కొన్ని స్థానాలు భాగస్వామ పక్షాలకు కేటాయించాల్సి రావడం ఇప్పుడు హైకమాండ్ కు సవాల్ గా మారింది. అలయెన్స్ పార్టీలకు ఇచ్చే స్థానాల్లో కూడా తమ పార్టీ నేతలు సీట్లు ఇవ్వాలంటూ ఆందోళనలకు దిగుతుండటం కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని కలవరపెడుతోంది.

ఇటు గాంధీ భవన్.. అటు ఛలో ఢిల్లీ

ఇటు గాంధీ భవన్.. అటు ఛలో ఢిల్లీ

కాంగ్రెస్ టికెట్ల కోట్లాటతో గాంధీభవన్ దగ్గర ఉద్రిక పరిస్థితులు నెలకొంటే మరికొందరు ఢిల్లీ బాట పడుతున్నారు. స్క్రీనింగ్ కమిటీ దగ్గర నిరసన వ్యక్తం చేస్తున్నారు. దేవరకొండ టికెట్ కోసం ముమ్మరంగా ప్రయత్నిస్తున్న మాజీ ఎంపీ రవీంద్ర నాయక్ కొంతమంది లంబాడీ మహిళలతో కలిసి ఢిల్లీకి బస్సులో వెళ్లారు. దేవరకొండ టికెట్ తనకే ఇవ్వాలని రాహుల్ కు విన్నవించారు. మరోవైపు నాగర్ కర్నూల్ నుంచి టికెట్ ఆశిస్తున్న మణెమ్మ రాహుల్ నివాసం ఎదుట నిరసనకు దిగారు. బీసీలకు టికెట్లివ్వాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. స్టేషన్ ఘన్ పూర్ టికెట్ తనకే ఇవ్వాలంటూ విజయరామారావు డిమాండ్ చేస్తుండగా.. వరంగల్ టికెట్ ఆశిస్తున్న అశోక్ గౌడ్ కూడా ఢిల్లీలో మంతనాలు జరుపుతున్నారు.

English summary
security has been tightened at gandhi bhavan congress party office hyderabad in the occasion of party cadre protests against tickets. congress high command fears about 1999 situation, so that police security increased.since 2-3 days the protestants raise their voice at gandhi bhavan about party tickets, some more leaders went to delhi for demanding assembly tickets.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X