errabelli dayakar rao komatireddy venkat reddy uttam kumar reddy seethakka ఎర్రబెల్లి దయాకర్ రావు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి సీతక్క కొండా మురళి
వరంగల్ లో జనగామ కాంగ్రెస్ అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి అరెస్ట్ తో హై డ్రామా.. కెసిఆర్ పాలనపై కాంగ్రెస్ ధ్వజం
ఉమ్మడి వరంగల్ జిల్లాలో జనగామ జిల్లా అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి సెంట్రల్ జైలుకు తరలించటంపై నిరసనగా కాంగ్రెస్ శ్రేణులు భారీ ఎత్తున ఆందోళనకు దిగారు .వరంగల్ సెంట్రల్ జైల్ ముందు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఆందోళన చేపట్టి ప్రభుత్వ తీరుపై విమర్శలు గుప్పించారు. ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రోద్బలంతోనే, ఆయన ఒత్తిడి మేరకే జంగా రాఘవ రెడ్డిని అరెస్టు చేశారంటూ కాంగ్రెస్ నేతలు నిప్పులు చెరిగారు.

వరంగల్ సెంట్రల్ అజిల్ ముందు నిరసనకు దిగిన కాంగ్రెస్ నేతలు
ఈరోజు మాజీ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఎమ్మెల్యే సీతక్క, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి వరంగల్ సెంట్రల్ జైల్ ముందు నిరసనకు దిగారు. దీంతో వరంగల్ ప్రధాన రహదారి మీద భారీ ఎత్తున ట్రాఫిక్ నిలిచిపోయింది. పోలీసులకు, కాంగ్రెస్ నేతలకు మధ్య వాగ్వాదం జరగడంతో తీవ్ర ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఆ తర్వాత రాఘవ రెడ్డి తో ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే సీతక్క ములాఖత్ అయ్యారు. బలమైన ప్రతిపక్ష నాయకులు లేకుండా చేయాలని ప్రతిపక్ష పార్టీలో బలంగా ఉన్న నేతలను టార్గెట్ చేసి అరెస్టు చేస్తున్నారని ఎమ్మెల్యే సీతక్క నిప్పులు చెరిగారు.

పోలీసులు చెంచాగిరి చేస్తున్నారని సీతక్క ఫైర్
ప్రభుత్వం ప్రతిపక్షాల గొంతు నొక్కే ధోరణిని మానుకోవాలన్నారు. అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని మండిపడ్డారు. చట్టాన్ని రక్షించాల్సిన పోలీసులే చెంచాగిరి చేస్తున్నారని సీతక్క మండిపడ్డారు . రాఘవ రెడ్డి పై తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేయడం దారుణమని పేర్కొన్నారు.
ఇక టీ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి జంగా రాఘవరెడ్డి అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. ఎర్రబెల్లి దయాకర్ రావు కుట్ర కారణంగా జంగా రాఘవరెడ్డి అరెస్ట్ చేశారని మండిపడ్డారు. కులాలను అడ్డంపెట్టుకుని కుట్ర చేస్తున్నారన్నారు.

కేసులు పెట్టినంత మాత్రాన కాంగ్రెస్ ను ఏమీ చెయ్యలేరు : ఉత్తమ్ కుమార్ రెడ్డి
కేసులు పెట్టినంత మాత్రాన కాంగ్రెస్ పార్టీని ఏమీ చేయలేరని విమర్శించారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. సీఎం కేసీఆర్ పతనం మొదలయిందని హెచ్చరించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి పోలీసులు కేసీఆర్ ను చూసుకుని ఎగరకండి.. జాగ్రత్తగా ఉండండి, మేము ఎవరిని వదిలిపెట్టేది లేదంటూ వార్నింగ్ ఇచ్చారు. పోలీసులు రాజ్యాంగం పరిధిలో పని చేయాలని సూచించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి జంగా రాఘవరెడ్డి విషయంలో పోలీసుల తీరు సరికాదన్నారు.

కెసిఆర్ కు పోయే రోజులు దగ్గర పడ్డాయి : కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కాంగ్రెస్ నేతలపై కావాలనే అక్రమ కేసులు పెడుతున్నారని, కెసిఆర్ పాలన రజాకార్ల పాలన కంటే ఘోరంగా ఉందని విమర్శించారు . కెసిఆర్ సోయి లేకుండా మాట్లాడుతున్నారని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. జంగా రాఘవరెడ్డి అక్రమ అరెస్టు దారుణమని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మండిపడ్డారు. కెసిఆర్ కు పోయే రోజులు దగ్గర పడ్డాయి అన్నారు. కక్ష సాధింపు చర్యలకు దిగటం దారుణం అన్నారు .