రాహుల్ పై వ్యాఖ్యలు కేసీఆర్ కు అస్త్రాలు ఎలా అవుతాయి?సీఎం టార్గెట్ ఖచ్చితంగా అతడే.!
హైదరాబాద్ : ఊహించని పరిణామాలు చోటు చేసుకునే వ్యవస్థ రాజకీయ రంగం మాత్రమే.!అధికారాన్ని కాపాడుకోవడానికి, రాబోవు ఎన్నికల్లో మళ్లీ అధికారాన్ని కైవసం చేసుకోవడానికి సర్కస్ విన్యాసాలను మించి కష్టపడుతుంటారు రాజకీయ నేతలు. అందులో సంబంధం ఉన్న అంశాలే కాకుండా అసలు ఏమాత్రం సంబంధం లేని అంశాంలకు ప్రతిస్పందిస్తూ ప్రజల దృష్టిని ఆకర్శించేందుకు, ప్రసార మాద్యమాల్లో ప్రచారం పొందేందుకు, అసలు రాజకీయ నేతల క్రెడిబిలిటీకి తావివ్వకుండా తెగ కసరత్తులు చేస్తుంటారు. తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అచ్చం ఇలాంటి అంశాన్ని నెత్తిన వేసుకుని ప్రజల ప్రతిస్పందన కోసం, వెన్నెల కోసం ఎదురు చూస్తున్న చెకోర పక్షిలా ఎదురుచూస్తున్న పరిణమాలు తెలంగాణ రాజకీయాల్లో తాజాగా చోటు చేసుకున్నాయి.

కాంగ్రెస్ పార్టీ కరోనావైరస్ కన్నా ప్రమాదం.. అప్పుడు కేసీఆర్ చేసిన ఘాటు వ్యాఖ్యలు..
అసోం సీఎం హేమంత బిశ్వ శర్మ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మీద చేసిన ఆరోపణలకు కాంగ్రెస్ పార్టీ నేతలు దేశ వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.హేమంత బిశ్వ శర్మ చేసిన అనుచిత వ్యాఖ్యలకు బీజేపి క్షమాపణలు చెప్పాలని డిమండ్ చేస్తున్న సంఘటనలు కూడా పెద్ద ఎత్తున చోటుచేసుకుంటున్నాయి. రాహుల్ గాంధీ పైన బీజేపి సీఎం అనుచితంగా వ్యాఖ్యానించారు కాబట్టి కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన చేసినా, ఆ వ్యాఖ్యలను ఖండించినా, క్షమాపణలును డిమాండ్ చేసినా అర్థవంతంగా ఉంటుంది. కానీ అసోం సీఎంకు గానీ, ఆయన చేసిన వ్యాఖ్యలకు గానీ, రాహుల్ గాంధీ కి గానీ, కాంగ్రెస్ పార్టీకి గానీ ఎలాంటి సంబంధం లేని తెలంగాణ సీఎం చంద్రశేఖర్ రావు ప్రతిస్పందించడం హాస్యాస్పదంగా పరిణమించింది.

ప్రేమికుల రోజు ప్రేమ వలకబోత.. రాహుల్ పై వ్యాఖ్యల పట్ల కేసీఆర్ ఓవరాక్షన్
అసోం సీఎం రాహుల్ గాంధీ పై చేసిన వ్యాఖ్యల పట్ల సీఎం చంద్రశేఖర్ రావు స్పందించడం దేశ రాజకీయాల్లో అంతగా చర్చ లేనప్పటికీ తెలంగాణ రాజకీయాల్లో మాత్రం సంచలనంగా మారింది. కేంద్ర బడ్జెట్ తర్వాత బీజేపిని, ప్రధాని నరేంద్ర మోదీని టార్గెట్ చేసిన చంద్రశేఖర్ రావు అకస్మాత్తుగా రాహుల్ గాంధీ అంశాన్ని ఎత్తుకోవడం ఆశ్చర్యానికి గురి చేసింది. తరుచుగా కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ నేతలను బంగాళా ఖాతంలో కలపాలనడమే కాకుండా కాంగ్రెస్ పార్టీ కరోనా వైరస్ కన్నా ప్రమాదమని అభివర్ణించిన చంద్రశేఖర్ రావు ఇదే కాంగ్రెస్ యువరాజుకు అనుకూలంగా ఎలా స్పందిస్తారన్నది చర్చనీయాంశంగా మారింది. తిట్టింది బీజేపి, తిట్టిచ్చుకుంది కాంగ్రెస్.. మధ్యలో చంద్రశేఖర్ రావుకేంటి సంబంధం అనే చర్చ తెలంగాణ రాజకీయాల్లో ఊపందుకుంది.

టార్గెట్ రేవంత్ రెడ్డి.. ప్రజాధరణకు గండికొట్టేందుకు సీఎం ప్రయత్నాలు
రాహుల్ గాంధీపై బీజేపి చేసిన వ్యాఖ్యలను అడ్డం పెట్టుకుని కొత్త రాజకీయానికి చంద్రశేఖర్ రావు తెర తీసారనే చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీలో ఒక వ్యక్తిని దృష్టిలో పెట్టుకుని సీఎం హోదాలో ఉన్న చంద్రశేఖర్ రావు విభిన్న రాజకీయాలకు శ్రీకారం చుట్టారనే చర్చ జరుగుతోంది. భవిష్యత్ రాజకీయాల కోసమే చంద్రశేఖర్ రావు రాహుల్ గాంధీకి అనుకూలంగా మాట్లాడారని ఓ పక్క చర్చ జరుగుతుంటే అందుకు భిన్నంగా మరో చర్చ కూడా జరుగుతోంది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పగ్గాలు రేవంత్ రెడ్డి చేపట్టిన దగ్గరనుండి క్షేత్ర స్ధాయిలో కాంగ్రెస్ బలోపేతం అవుతోంది. అందుకు ఇటీవల ప్రతిష్టాత్మకంగా ముగించిన డిజిటల్ సభ్యత్వ నమోదు ప్రక్రియే ఉదాహరణగా పార్టీలో చర్చ జరుగుతోంది. అంతే కాకుండా తెలంగాణ రాజకీయాల్లో రేవంత్ రెడ్డి ప్రభావవంతమైన పాత్ర పోషిస్తున్న అంశం పట్ల కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చ జరుగుతోంది.

సీఎం యాక్షన్ కు రేవంత్ రియాక్షన్ ఎలా ఉంటుంది.? ఉత్కంఠ రేపుతున్న అంశం
పీసిసి అద్యక్షుడిగా రేవంత్ రెడ్డికి లభిస్తున్న ప్రజాధరణకు గండి కొట్టేందుకు గులాబీ పార్టీ వ్యూహ రచన చేస్తున్నట్టు తెలుస్తోంది. రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మాణంలో రాష్ట్ర విభజన పట్ల ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను మొట్టమొదటిసారిగా ఖండించి, నిరసన కార్యక్రమాలకు రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆ తర్వాత ఐటీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు జోక్యం చేసుకుని మోదీకి వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రమాలకు పిలుపునిచ్చారు. అంతే కాకుండా అసోం సీఎం రాహుల్ గాంధీ పై చేసిన వ్యాఖ్యల పట్ల లోక్ సభలో ఉన్న రేవంత్ రెడ్డి తక్షణం స్పందించారు. ఢిల్లీలో విలేఖరుల సమావేశం నిర్వహించి బీజేపి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసారు. ఈ అంశాన్ని గ్రహించిన గులాబీ దళపతి వెంటనే రాహుల్ అంశాన్ని అందిపుచ్చుకున్నారు. అంటే తెలంగాణలో రేవంత్ రెడ్డిని నిలువరించేందుకు సాక్షాత్తు సీఎం హోదాలో ఉన్న చంద్రశేఖర్ రావు రంగప్రవేశం చేసారనే చర్చ కూడా తెరవెనుక జోరుగా సాగుతోంది. సీఎం టార్గెట్ కాంగ్రెస్ పార్టీ కాదు., సోనియా గాంధీ కాదు., కేవలం రేవంత్ రెడ్డి మాత్రమేననే సంకేతాలు వెలువడుతున్నాయి. మరి సీఎం ఓవరాక్షన్ కు సారీ యాక్షన్ కు రేవంత్ రెడ్డి రియాక్షన్ ఎలా ఉంటుందన్న అంశం ఉత్కంఠ రేపుతోంది.