బ్రేకింగ్ వార్తలకు ఎన్నాళ్లు బ్రేకులు.?మీడియా సర్కిల్స్ లో మళ్లీ రవి ప్రకాష్ ప్రస్తావన.!
హైదరాబాద్ : ఎవడు కొడితే దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్ అవ్వుద్దో ఆడే పండుగాడు. అనే డైలాగ్ చాలా ఫేమస్. అది ఇప్పటికి కూడా ప్రజల నోట్లో బాగా నానుతుంది. అంటే ఎవడు చేసే పని వాడు చేస్తేనే జనాలకు కిక్కెక్కుతుందని అర్ధం. ఊహించని వేగంతో ఉరుములాంటి ధ్వనితో, మెరుపులాంటి వెలుగుతో తెలుగువాళ్ల గడపలను తాకిన ఆ ప్రభావవంతమైన వార్తా విధానాలు, దాన్ని ముందుకు నడిపించిన వ్యక్తి గురించి మళ్లీ చర్చ అందుకుంది. సాదా సీదా వార్తలు చూసి మోతాదు సరిపోక మళ్లీ రెండేళ్ల క్రితం సంచలనానికి మారుపేరుగా వచ్చిన బ్రేకింగ్ వార్తలే మళ్లీ వినాలని, అందుకు కారణమైన వినూత్న వ్యక్తి గురించి మళ్లీ చర్చ మొదలైనట్టు తెలుస్తోంది.

ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో సంచలనాలు.. కొత్త మార్పులకు శ్రీకారం..
అసలు విషయానికి వస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మీడియా మతిని, గతిని మార్చేసి, ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో సంచలనాలు నమోదు చేసి, మీడియా రంగానికి దేశ వ్యాప్తంగా ఓ క్రేజ్ తీసుకొచ్చిన వినూత్న వ్యక్తి తెర ముందుకు రాక రెండేళ్లవుతోంది. ఆయన మార్క్ బ్రేకింగ్ వార్తలు విని కూడా రెండేళ్లు గడిచిపోతునన్నాయి. ఈ రెండేళ్లలో ప్రేక్షకులు ఏం కోల్పోయారు అనే అంశం కన్నా మీడియాలో ఆ వ్యక్తి తరహా బ్రేకింగ్ లు, రాజకీయ చర్చలు, సూటి ప్రశ్నలు ఏమయ్యాయనే కొత్త చర్చ మీడియా సర్కిల్స్ లో తాజాగా మళ్లీ వినిపిస్తోంది. మీడియా రంగంలో డాషింగ్ కథనాలను సేకరించి డేరింగ్ గా ప్రపంచానికి చూపించిన రవి ప్రకాష్ గురించి పాత్రికేయుల మద్య మళ్లీ ఆసక్తికర చర్చ జరుగుతోంది.

సాహసోపేత వార్తలు.. సంచలన ప్రసారాలు
తెలంగాణతో పాటు ఏపీలో జరుగుతున్న రాజకీయ పరిణామాల పట్ల సామాన్య ప్రజానీకానికి వెళ్లాల్సిన సమాచారం అంత సూటిగా, స్పష్టం వెళ్లడం లేదని, మీడియాలో ప్రధానంగా ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో బుల్లెట్ లా దూసుకెళ్లే వార్తలు ప్రసారం కాకపోవడంలో తలెత్తుతున్న లోపాలపైన తాజాగా చర్చ జరుగుతోంది. ఎందుకు గ్యాప్ వస్తోంది, వార్తను వార్తలాగా, బ్రేకింగ్ వార్తను బ్రేకింగ్ వార్తలాగా ఎందుకు ప్రసారం చేయలేకపోతోంది ప్రస్తుత మీడియా అనే అంశం పట్ల లోతైన చర్చ జరుగుతోంది. మళ్లీ ప్రభావవంతంగా పనిచేసే మీడియా కోసం దానిని నడిపించే డైనమిక్ పర్సనాలిటీ రవిప్రకాష్ గురించి చర్చ జరుగుతోంది.

మళ్లీ ఎఫెక్టివ్ మీడియా గురించి చర్చ.. బ్రేకింగ్ వార్తల గురించి ఎదురుచూపులు
ఉన్న పలంగా ఎఫెక్టివ్ మీడియా ఆవశ్యకత, రవిప్రకాష్ నడిపంచే విధానం గురించి చర్చ ఎందుకు మొదలైంది.? రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న రాజకీయ పరిణామాలు రవి ప్రకాష్ పస్తావనకు దోహదం చేస్తున్నాయి. ప్రభుత్వాలకు భయపడకుండా, వ్యవస్ధల ఒత్తిడిలకు లొంగకుండా వార్తను వార్తలాగా ప్రసారం చేసి దానిలోని టేస్టును తెలుగుప్రజలకు చూపించారు రవిప్రకాష్. కాని ప్రస్తుత మీడియాలో అలాంటి వ్యవహారం లేదనే చర్చ జరుగుతోంది. ఎవరికి వారు ఏదో కారణంతో వ్యవస్దలో జరుగుతున్న పరిణామాలను ఎత్తి చూపడంలో జంకుతున్నారనే చర్చ జరుగుతోంది. రవిప్రకాష్ ఉంటే ఇది ఖచ్చితంగా బ్రేకింగ్ వార్త అయ్యి ఉండి ఉండేదని మొన్నటివరకు చాలా తక్కువ వ్యాల్యూమ్ లో చెప్పిన వారు ఇప్పుడు గళమెత్తి నినదిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.

వెలుగు చూడని ఎన్నో అంశాలు.. రవి ప్రకాష్ ఉంటే ఇలా జరిగేదా..? మీడియా సర్కిల్స్ లో కొత్త చర్చ
తాజాగా తెలంగాణలో రామానుజుల వెయ్యేండ్ల వేడుకల సందర్బంగా చోటు చేసుకున్న పచ్చని చెట్ల విధ్వంసానికి సంబందించిన వార్తలు ప్రసారం కాకపోవడం శోచనీయమని, వార్తను ప్రసారం చేసే ధైర్యం ఏ మీడియాకు ఉందని, రవిప్రకాష్ ఉంటే ఆ వార్తను బ్రేక్ చేసి వందలాది పచ్చని చెట్లకు ప్రాణం పోసేవాడని మీడియా సర్కిల్ లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. అదొక్కటే కాకుండా ఏపిలో ప్రభుత్వ పరంగా చోటు చేసుకుంటున్న పరిణామాలను కూడా రవిప్రకాష్ ఆసక్తికరంగా, విశ్లేషణాత్మకంగా చూపించే వారనే చర్చ కూడా జరుగుతోంది. అంటే నిజాయితీగా, నిస్వార్ధంగా ప్రజాహితం కోసం చేసే పనులు ఎవరు ఔనన్నా, కాదన్నా ప్రజల హృదయాల్లో పదిలంగా ఉంటాయనే అంశం స్పష్టమవుతోంది. ఇక్కడ రవిప్రకాష్ మీడియాలో చేసింది కూడా అదే. అందుకే మరోసారి వినూత్న చర్చ.