హుజూర్ నగర్ ఉపపోరు: బీజేపీ రంగంలోకి దించబోతున్న శ్రీకళారెడ్డిపై ఆసక్తికర చర్చ
తెలంగాణ రాష్ట్రంలోని హుజూర్ నగర్ ఉప పోరు అన్ని ప్రధాన పార్టీలకు కత్తి మీద సాములా మారాయి. ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ టిఆర్ఎస్ నుండి అభ్యర్థిగా గత ఎన్నికల్లో పోటీ చేసి కేవలం 7 వేల ఓట్లతో ఓటమిపాలైన సైదిరెడ్డి ని రంగంలోకి దింపుతుంది. ఇక కాంగ్రెస్ పార్టీ తరఫున ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య పద్మావతి హుజూర్ నగర్ ఎన్నికలబరిలో నిలిచారు. ఇదిలా ఉంటే బిజెపి సైతం బలమైన అభ్యర్థిని రంగంలోకి దింపాలని నిర్ణయం తీసుకుంది. శ్రీకళారెడ్డి ని బిజెపి నుండి హుజూర్ నగర్ బరిలో నిలపాలని భావిస్తోంది. దీంతో అసలు ఈ శ్రీకళారెడ్డి ఎవరు అన్న చర్చ తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా జరుగుతుంది.

ఉత్తమ్ రాజీనామాతోనే హుజూర్ నగర్ ఉప ఎన్నికf
హుజూర్ నగర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీకి కంచుకోట . గత ఎన్నికల్లో హుజూర్ నగర్ అసెంబ్లీ స్థానం నుండి టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎన్నికల బరిలోకి దిగారు. టిఆర్ఎస్ నుంచి బరిలో నిలిచిన సైది రెడ్డి పై విజయం సాధించారు. అయితే ఆ తరువాత ఎంపీ ఎన్నికల్లో పోటీచేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంపీ గాను విజయం సాధించడంతో, హుజూర్ నగర్ ఎమ్మెల్యే స్థానానికి ఆయన రాజీనామా చేయవలసి వచ్చింది. దీంతో హుజూర్ నగర్ లో ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి.

బీజేపీ నుండి కీసర శ్రీకళారెడ్డి .. ఎవరంటే
ఎవరికి వారు హుజూర్ నగర్ ఉప ఎన్నిక ప్రతిష్టాత్మకంగా భావించడంతో వ్యూహ ప్రతివ్యూహాలతో ముందుకు వెళుతున్నారు. ఇప్పటికే టిఆర్ఎస్, కాంగ్రెస్ లు తమ అభ్యర్థులను ప్రకటించడంతో ఇక బిజెపి సైతం కీసర శ్రీకళారెడ్డి పేరును హుజూర్ నగర్ అభ్యర్థిగా ప్రకటించింది . ఇప్పటివరకు వినని కొత్త పేరు కావడంతో ఇంతకీ ఎవరు ఈమె, ఈమె కుటుంబ నేపథ్యం ఏంటి అన్న చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతుంది. శ్రీకళారెడ్డి తండ్రి జితేందర్ రెడ్డి స్థానికంగా మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్న నేత కావటంతో ఆయన కుమార్తె ను రంగంలోకి దించాలని భావిస్తున్నారు బీజేపీ నేతలు.

రాజకీయాల్లో స్థానికంగా గుర్తింపు ఉన్న నేత జితేందర్ రెడ్డి కుమార్తె
1972 లో హుజూర్ నగర్ ఎమ్మెల్యేగా ఇండిపెండెంట్ గా గెలిచారు శ్రీకళారెడ్డి తండ్రి జితేందర్ రెడ్డి. ఇక శ్రీకళారెడ్డి భర్త ధనుంజయ్ యూపీ నుంచి గతంలో ఎంపీగా పనిచేశారు. ఇలా ఆమె ఫ్యామిలీ నుంచి గతంలో ప్రజాప్రతినిధులుగా రాజకీయాల్లో పని చేసిన అనుభవం ఉంది. దీంతో ఇప్పుడు శ్రీకళారెడ్డి కూడా రాజకీయాల్లో రాణించాలని ఎప్పటినుంచో తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. రాజకీయాలపై ఆసక్తి ఉన్న ఆమె 2004 టీడీపీ తెలంగాణలో బలంగా ఉన్న సమయంలో టీడీపీలో చేరారు.

గతంలో కోదాడ టీడీపీ టికెట్ ఆశించి భంగపడిన శ్రీకళారెడ్డి
ఎమ్మెల్యే కావాలనే కోరికతో కోదాడ టీడీపీ టిక్కెట్ ఆశించి భంగపడ్డారు. ఆ తర్వాత వైసీపీలో చేరారు. కానీ యాక్టివ్ రాజకీయాలకు దూరంగానే ఉన్నారు. ఇక ఇటీవల రాజ్యసభ ఎంపీ గరికపాటి మోహన్ రావుతో కలిసి బీజేపీలో చేరారు. ఇప్పుడు ఏకంగా హుజూర్ నగర్ బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగేందుకు రెడీ అవుతున్నారు. ప్రజలతో మమేకం అయ్యేలా సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ స్థానికంగా మంచి పేరు సంపాదించిన ఆమెను ఇక్కడ నుంచి ఎన్నికల బరిలోకి దింపుతోంది బీజేపీ . చూడాలి మరి హుజూర్ నగర్ ఓటర్లు శ్రీకళారెడ్డి ని ఏ విధంగా ఆదరిస్తారో..