HUZURABAD రేవంత్ లెక్క పక్కా- ఆ అభ్యర్దే ఎందుకంటే: అక్కడే ట్విస్టు - కొత్తగా రేసులోకి..!!
హుజూరాబాద్ బై పోల్. ఇప్పుడు తెలంగాణ రాజకీయం మొత్తం ఈ ఉప ఎన్నిక చుట్టూ తిరుగుతోంది. ఏ నిర్ణయమైనా ఈ ఉప ఎన్నిక కోసమే అన్నట్లుగా కొనసాగుతోంది. ఇప్పటికే బీజేపీ నుండి ఈటల రాజేందర్ లేదా ఆయన సతీమణి , టీఆర్ఎస్ నుంచి శ్రీనివాస యాదవ్ అభ్యర్ధులుగా పోటీలో ఉండటం ఖాయమైంది. కాంగ్రెస్ నుంచి మాత్రం అధికారికంగా అభ్యర్ధి ఖరారు కాలేదు. తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా రేవంత్ పగ్గాలు చేపట్టిన తరువాత ఎదుర్కొంటున్న తొలి ఎన్నిక ఇది. అయితే, రేవంత్ ఈ ఎన్నికను తాను ఎక్కడా సీరియస్ గా తీసుకుంటున్నట్లుగా కనడపకుండా జాగ్రత్త పడుతున్నారు.

రేవంత్ పక్కా వ్యూహాత్మకంగా..
ఫలితం ఎలా ఉన్నా..అది పార్టీ భవిష్యత్ కు ప్రత్యేకించి తనకు ఇబ్బంది లేదనే విధంగా ఆచి తూచి ఈ ఎన్నికలో వ్యవహరిస్తున్నారు. అయితే, ఎన్నికలో మాత్రం గట్టి పోటీకి సిద్దం అవుతున్నారు. అక్కడ వచ్చే ఓట్లు..మద్దతు తనకు బాధ్యతలు అప్పగించిన తరువాత లభించినదిగా చెప్పుకోవటానికి సిద్దం అవుతున్నారు. దీని కోసం గతంటో పోటీ చేసిన కౌశిక్ రెడ్డి కంటే ఎక్కువ ఓట్లు సాధించాలనే పట్టులతో ఉన్నారు. ఇందులో భాగంగా.. హుజురాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి ఎంపికపై కసరత్తు పూర్తి అయ్యింది. టీపీసీసీకి ముగ్గురి పేర్లతో ఎన్నికల కమిటీ చైర్మన్ దామోదర రాజనర్సింహ నివేదిక అందజేశారు.

ముగ్గురు పేర్లు సిఫార్సు... చివరకు సురేఖకే..
నివేదికలో ఎస్సీ, బీసీ, రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతల పేర్లు ఉన్నట్లు తెలుస్తోంది. నివేదికతో ఏఐసీసీ ఇన్చార్జ్ మానిక్కం ఠాగూర్ నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. సోనియా ఆమోదంతో ఒకటి, రెండు రోజుల్లో కొండా సురేఖ పేరు ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
అయితే, రేవంత్ రెడ్డి ఉప ఎన్నికలో తొలుత పొన్నం ప్రభాకర్ పేరు పైన చర్చ జరిగినా..ఇప్పుడు బీసీ మహిళా అభ్యర్ధిని ఎంచుకోవటం పక్క ప్రణాళిక ప్రకారమే జరిగిందని తెలుస్తోంది. అందునా.. తాను పోటీ చేయాలంటే వీటిని ఆమోదించండంటూ కొండా సురేఖ కొన్ని షరతులు సైతం పెట్టారు.

సురేఖ షరతులను అంగీకరించి..
2023లో హుజూరాబాద్ సీటు మళ్లీ తనకే కేటాయించాలని డిమాండ్ చేశాని సమాచారం. దీంతో పాటు అసెంబ్లీ ఎన్నికల్లో వరంగల్ అర్బన్, పరకాల, భూపాలపల్లి టికెట్లను తాను చెప్పిన వారికి ఇస్తానని కూడా ఇప్పుడే హామీ ఇవ్వాలని సురేఖ అధిష్ఠానాన్ని కోరినట్లు సమాచారం. అయితే భూపాలపల్లి విషయంలో అధిష్టానం కొంత ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది.
భూపాలపల్లి విషయంలో వెనక్కి తగ్గితే వచ్చే ఎన్నికల్లో హుజురాబాద్, పరకాల, వరంగల్ అర్బన్ స్థానాల్లో అభ్యర్థుల ఖరారు సురేఖ చెప్పిన మేరకు నిర్ణయం తీసుకుంటామంటూ హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఇక, కొండా సురేఖ ఎంపిక వెనుక రేవంత్ లెక్క పక్కాగా ఉన్నట్లు కనిపిస్తోంది. హుజురాబాద్ నియోజకవర్గంలో బీసీ సామాజిక వర్గాల ప్రాబల్యం ఎక్కువ.

సోషల్ ఇంజనీరింగ్ లో ఈ లెక్కలన్నీ..
మంచి వక్తగా పేరున్న కొండా సురేఖ అటు టీఆర్ఎస్..ఇటు ఈటల వ్యతిరేక వర్గాన్ని ఆకట్టుకోగలరనే నమ్మకంతో రేవంత్ ఉన్నారు. కొండా సురేఖ పోటీలో ఉంటే మిగిలిన రెండు ప్రధాన పార్టీల అభ్యర్ధులకు చివరి నిమిషం వరకు టెన్షన్ తప్పదనే వాదనలు వినిపిస్తున్నాయి. దీంతో.. రేవంత్ అభిప్రాయం మేరకు హైకమాండ్ సైతం కొండా సురేఖ పేరు ప్రకటన ఇక లాంఛనంగానే కనిపిస్తోంది.
ఇక, హుజూరాబాద్ లో సామాజిక వర్గాల పరంగా చూసినా కొండా సురేఖ ఎంపిక వెనుక అసలైన అంచనాలు బయటకు వస్తున్నాయి. హుజూరాబాద్‌లో మొత్తం ఓటర్లు 2,26,590 మంది. ఇందులో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు 22,600 మంది, మున్నూరు కాపు ఓటర్లు 29,100, పద్మశాలి 26,350, గౌడ 24,200, ముదిరాజ్ 23,220, యాదవ 22,150, మాల 11,100, మాదిగ 35,600, ఎస్టీలు 4,220, నాయీబ్రాహ్మణ 3,300, రజక 7,600,మైనార్టీ 5,100, ఇతర కులాల వాళ్లు 12,050 మంది ఉన్నట్లు లెక్కలు స్పష్టం చేస్తున్నాయి.

ఇద్దరు అభ్యర్ధులకు చుక్కులు చూపించాలంటూ.
అధికార పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ సామాజిక ఓటర్లు 22,150 మందితో పాటు దళిత బంధు పథకంతో అత్యధికంగా నియోజకవర్గంలో ఉన్న 33,600 మంది ఓటర్లను తమ వైపు తిప్పుకోవచ్చనేది అధికార పార్టీ ఎత్తుగడ. బీజేపీ లెక్కలు చూస్తే ..ఈటల రాజేందర్ సుదీర్ఘకాలంగా అక్కడ రాజకీయం చేస్తున్నారు. ఆయన సామాజిక వర్గం ముది రాజ్‌లతో పాటు ఆయన భార్య జమున రెడ్డి సామాజిక వర్గం ఓట్లు కలిసొస్తాయని భావిస్తున్నారు. ఇక బీజేపీకి సంప్రదాయంగా వచ్చే ఓట్లు అదనపు బలమని నమ్ముతున్నారు.

రేవంత్ అసలు లక్ష్యం టార్గెట్ 2023..
కాంగ్రెస్ నుంచి కొండా సురేఖ పోటీలో ఉంటే..ఆమె సామాజిక వర్గం పద్మశాలీల ఓట్లు 26,350, అలాగే ఆమె భర్త కొండా మురళి సామాజిక వర్గం మున్నూరు కాపు ఓటర్లు 29,100 మంది, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ సామాజిక వర్గం రెడ్ల ఓట్లు కాంగ్రెస్ కు టర్న్ అవుతాయనేది కాంగ్రెస్ నేతల అంచనా. దీంతో..హుజూరాబాద్ ను లైట్ గా తీసుకుంటున్న విధంగా వ్యవహరిస్తున్న రేవంత్...అండర్ గ్రౌండ్ వర్క్ మాత్రం చాలా బలంగా ప్లాన్ చేస్తున్నారు. దీని ద్వారా తన బలం చాటాలని ప్రయత్నిస్తున్నారు.