రేవంత్ కు తలనొప్పిగా హుజురాబాద్ అభ్యర్థి ఎంపిక ; కొండా సురేఖకా? స్థానిక నేతకా? కాంగ్రెస్ మల్లగుల్లాలు
హుజురాబాద్ ఉప ఎన్నికల పోరులో కాంగ్రెస్ పార్టీ వెనకబడిందా? ప్రధాన పార్టీలైన టిఆర్ఎస్, బిజెపిలు ఇప్పటికే అభ్యర్థిని ప్రకటించి ఉప ఎన్నికల పోరాటంలో దూకుడు చూపిస్తుంటే కాంగ్రెస్ పార్టీ ఇంకా అభ్యర్థిని ఎంపిక చేయడంలోనే మీనమేషాలు లెక్కిస్తోందా ? మొన్నటి వరకు కొండా సురేఖను బరిలోకి దించుతామని చెప్పి, మళ్లీ స్థానిక నేతలకు అవకాశంపై ఆలోచిస్తున్న కాంగ్రెస్ అధిష్టానం యూ-టర్న్ తీసుకుందా? టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ తరఫున హుజురాబాద్ ఉప ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థిని ఎంపిక చేయడం పెద్ద తలనొప్పిగా మారుతుందా అంటే అవును అన్న సమాధానమే వస్తుంది.
Huzurabad
By
poll:
దూకుడు
పెంచిన
రాజకీయ
పార్టీలు..నోటిఫికేషన్
ఎప్పుడంటే!!

టీఆర్ఎస్ నుండి గెల్లు శ్రీనివాస్ .. ప్రచారంలో ముందు వరసలో ఉన్న టీఆర్ఎస్
హుజరాబాద్ ఉప ఎన్నికల పోరాటం హోరాహోరీగా కొనసాగుతుంది. ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ నుండి అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ ను ప్రకటించి, అధికార టీఆర్ఎస్ ఎన్నికల ప్రచారంలో ముందు వరుసలో నిలిచింది. హుజూరాబాద్ నియోజకవర్గంలో మంత్రులను సైతం రంగంలోకి నుంచి ఎన్నికల ప్రచారాన్ని సాగిస్తుంది. మండలాల వారీగా, గ్రామ గ్రామాన పర్యటిస్తూ టిఆర్ఎస్ పార్టీతోనే అభివృద్ధి జరుగుతుందని, టీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంది. ఇక హుజురాబాద్ నియోజకవర్గ ఎన్నికల నేపథ్యంలో వరాల జల్లు కురిపించిన కేసీఆర్, నియోజకవర్గాన్ని అద్దంలా తీర్చి దిద్దే పనిలో పడ్డారు. అభివృద్ధిని చూపించి ఓట్లు వేయమని విజ్ఞప్తి చేస్తున్నారు. దళిత బంధు వంటి కొత్త పథకాన్ని తీసుకు వచ్చి హుజురాబాద్ కేంద్రంగా దళితులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నికల నేపథ్యంలోనే ఇటీవల కాలంలో హుజూరాబాద్ నియోజకవర్గానికి వందల కోట్ల నిధుల వరద కొనసాగుతోంది.

బీజేపీ నుండి జోరుగా ఎన్నికల ప్రచారాన్ని సాగిస్తున్న ఈటల
ఇదిలా ఉంటే బిజెపి నుండి ఎన్నికల బరిలోకి దిగిన ఈటల రాజేందర్ హుజురాబాద్ నియోజకవర్గంలో తన పట్టును నిలుపుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా గ్రామగ్రామాన పర్యటిస్తూ, పాదయాత్రలు చేస్తూ ఎన్నికల ప్రచారాన్ని సాగిస్తున్నారు. హుజరాబాద్ ఎమ్మెల్యేగా తాను రాజీనామా చేయడం వల్లే ఈరోజు హుజురాబాద్ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని, తన వల్ల జరుగుతున్న అభివృద్ధిని చూసి తనకు ఓటు వేయాలని ఆయన ఓటర్లను విజ్ఞప్తి చేస్తున్నారు. తెలంగాణ ఆత్మగౌరవానికి పట్టం కట్టాలని ప్రజలను కోరుతున్నారు. ఇక బిజెపి నుండి కీలక నాయకులు సైతం రంగంలోకి దించి ప్రచార పర్వాన్ని సాగిస్తున్నారు ఈటల రాజేందర్.

హుజురాబాద్ అభ్యర్థి ప్రకటనలో వెనకబడిన కాంగ్రెస్ పార్టీ
హుజూరాబాద్ నియోజకవర్గంలో మొదటి నుంచి మంచి పేరున్న, పట్టున్న నాయకుడైన ఈటల రాజేందర్ ఈ ఉప ఎన్నికలను సవాల్ గా స్వీకరిస్తున్నారు. దమ్ముంటే సీఎం కేసీఆర్ తనపై ఎన్నికల బరిలోకి దిగాలని సవాల్ చేస్తున్నారు. కెసిఆర్ దంతా కపట ప్రేమని నిప్పులు చెరుగుతున్నారు. ఇలా అధికార టిఆర్ఎస్, ప్రతిపక్ష బీజేపీ పెద్ద ఎత్తున ఎన్నికల ప్రచారం సాగిస్తుంటే, తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి టీపీసీసీ చీఫ్ గా పగ్గాలు చేపట్టిన తర్వాత దూకుడు చూపిస్తున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎంపికలో మాత్రం వెనుకబడిందని చెప్పాలి. హుజురాబాద్ ఉప ఎన్నికపై దృష్టి పెట్టిన దాదాపు అన్ని పార్టీలు స్పష్టమైన కార్యాచరణతో ముందుకు వెళుతుంటే, ఇప్పటివరకు అభ్యర్థిని ప్రకటించకుండా కాంగ్రెస్ పార్టీ మీనమేషాలు లెక్కిస్తోంది.

హుజురాబాద్ లో గట్టి పోటీ ఇచ్చే బలమైన అభ్యర్థి కోసం కాంగ్రెస్ కసరత్తు .. కొండా సురేఖ పేరు
అటు ఈటల రాజేందర్ ను, ఇటు అధికార టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ ను ఢీకొనేలా బలమైన అభ్యర్థిని రంగంలోకి దించాలని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ కొండా సురేఖ పేరు ఖరారు చేసినట్లుగా వార్తలు వచ్చాయి. ఆగస్టులోనే ఆమె పేరును అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని పెద్ద ఎత్తున ప్రచారం సైతం జరిగింది. హుజూరాబాద్ నియోజకవర్గంలో పోటీ చేయాలంటే సురేఖ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ముందు తన డిమాండ్లను పెట్టినట్లుగా సమాచారం. ఇక కొండా సురేఖ డిమాండ్లకు ఓకే అయితే, ఆమె హుజూరాబాద్ నియోజకవర్గం నుండి పోటీ చేసే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్ పార్టీ స్థానిక నేతల అభిప్రాయసేకరణ జరిపిన తరువాత అభ్యర్థి ఎవరన్నది చెప్తామని వెల్లడించింది.

స్థానిక నేతను రంగంలోకి దించే ఆలోచన .. కవ్వంపల్లి సత్యనారాయణ పేరు పరిశీలన
హుజూరాబాద్ నియోజకవర్గంలోని సామాజిక సమీకరణలు, ఆయా పార్టీల నుండి పోటీలో ఉన్న అభ్యర్థులు, ఇతర స్థానిక పరిస్థితులు వంటి అన్ని విషయాలను పరిగణలోకి తీసుకొని అభ్యర్థిని నిర్ణయించాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. స్థానికంగా పట్టున్న నేతలు రంగంలోకి దింపితే బాగుంటుందన్న ఆలోచన కూడా చేస్తున్నట్లు సమాచారం. దీంతో స్థానిక అంశం తెరమీదకు రావడంతో కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ పేరు ప్రధానంగా చర్చనీయాంశంగా మారింది.

కాంగ్రెస్ గా అభ్యర్థి ఎవరు? టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి అభ్యర్థి ఎంపిక తలనొప్పి
కీలక నాయకులు పోటీలో ఉన్న వేళ, గట్టిపోటీ ఇవ్వలేని నాయకులను రంగంలోకి దింపితే కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ ఎన్నికల పోటీలోనే లేకుండా పోతుంది. అందుకే ఇతర రాజకీయ పార్టీల అభ్యర్థులకు గట్టి పోటీ ఇచ్చేలా అభ్యర్థిని ఎంపిక చేయాలని నిర్ణయించిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విషయంలో మల్లగుల్లాలు పడుతోంది. ఇక ఈ పరిణామాలు టీపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డికి పెద్ద తలనొప్పిగా తయారయ్యాయి. హుజురాబాద్ ఎన్నికల బరిలోకి దింపేందుకు ఐదుగురు పేర్లను పరిశీలిస్తున్న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఎవరిని ఫైనల్ చేస్తారనేది ఉత్కంఠగా మారింది. ఏదేమైనా సెప్టెంబర్ 10వ తేదీ లోపు తమ అభ్యర్థిని ప్రకటిస్తామని కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం చెప్తున్న వేళ కొండా సురేఖ రంగంలోకి దిగుతారా ? కవ్వంపల్లి సత్యనారాయణ రంగంలోకి దిగుతారా? అనేది రాజకీయవర్గాలలో ఆసక్తికర చర్చకు కారణమవుతుంది.