హైదరాబాద్ ప్రజల్లో 54 శాతం మందికి యాంటీబాడీలు: సీసీఎంబీ స్టడీ
హైదరాబాద్: నగరంలోని 54 శాతం మంది ప్రజల్లో కరోనావైరస్ యాంటీబాడీలు
ఉన్నాయని సెంటర్ ఫర్ సెల్యూలర్ అండ్ మాలిక్యూలర్ బయోలజీ(సీసీఎంబీ) తాజాగా తన అధ్యయనం తేల్చింది. నగరంలోని 30 వార్డుల్లో తొమ్మిదివేల మంది నమూనాలను పరిశీలించినట్లు చెప్పారు. వీరిలో పదేళ్ల నుంచి ముసలివాళ్ల వరకు ఉన్నారు.
56 శాతం మహిళలు, 53 శాతం పురుషుల్లో యాంటీబాడీలు ఉన్నాయని వెల్లడించింది. ఇక వృద్ధుల్లో 49శాతం యాంటీబాడీలు ఉన్నట్లు గుర్తించింది. యాంటీబాడీలు ఉన్న 75 శాతం మందికి కరోనా వచ్చినట్లు కూడా తెలియదనేలదని సీసీఎంబీ శాస్త్రవేత్తలు తెలిపారు. భారత్ బయోటెక్- ఎన్ఐఎన్(నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్)తో కలిసి సీరో సర్వే చేసినట్లు సీసీఎంబీ తెలిపింది.

సొంత ఇంటివారితో కరోనా సోకినవారు 78 శాతంగా ఉండగా, బయటివారితో కరోనా బారిన పడినవారు 68 శాతంగా ఉన్నారని పేర్కొంది. పెద్ద ఇళ్లు కలిగినవారు, చిన్న కుటుంబం కలవారు తక్కువగా కరోనా బారినపడ్డారని ఎన్ఐఎన్ శాస్త్రవేత్త డాక్టర్ లక్ష్మయ్య తెలిపారు. ఇంతకుముందు కరోనాబారినపడినవారిలో సుమారు 90శాతం మందికి యాంటీబాడీలున్నాయని మరో శాస్త్రవేత్త తెలిపారు. హైదరాబాద్ హర్డ్ ఇమ్యూనిటీవైపు నెమ్మదిగా నడుస్తోందని, ఇప్పుడు వ్యాక్సినేషన్‌తో మరింత పుంజుకుంటుందని సీసీఎంబీ డైరెక్టర్, డాక్టర్ రాకేష్ మిశ్రా తెలిపారు.
కాగా, తెలంగాణలో కొత్తగా 152 కరోనా కేసులు వెలుగుచూశాయి. కరోనాతో బుధవారం ఇద్దరు మరణించారు. కరోనా బారినుంచి 114 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 1948కి చేరింది. వీరిలో 835 మంది హోంఐసోలేషన్లో చికిత్స పొందుతున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 25 కేసులు నమోదయ్యాయి.