పోలీసులపై దుర్భాషలాడి, దురుసుగా ప్రవర్తించిన ఎంఐఎం కార్పొరేటర్ అరెస్ట్ (వీడియో)
హైదరాబాద్: ఎంఐఎం పార్టీకి చెందిన భోలక్‌పూర్ కార్పొరేటర్ గౌసుద్దీన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటీవల ముషీరాబాద్‌లో పోలీసుల విధులను అడ్డుకోవడమే కాకుండా.. వారిపై దుర్భాషలాడి, దురుసుగా ప్రవర్తించారు. ఈ క్రమంలో కార్పొరేటర్ తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ కార్పొరేటర్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులతో దురుసుగా ప్రవర్తించిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని డీజీపీకి ట్వీట్ చేయడంతో పోలీసులు రంగంలోకి దిగి కార్పొరేటర్ గౌస్ పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. గాంధీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి కోర్టులో హాజరుపర్చారు.

పోలీసులను బెదరించిన ఎంఐఎం కార్పొరేటర్ గౌసుద్దీన్
వివరాల్లోకి వెళితే.. సోమవారం అర్ధరాత్రి తర్వాత పోలీసులు భోలక్‌పూర్ ప్రాంతానికి వెళ్లారు. ప్రతిరోజూ అర్ధరాత్రి దాటిన తర్వాత దుకాణాలు మూసేయాలని స్థానిక దుకాణదారులకు సూచించారు.అయితే, రంజాన్ సందర్భంగా తెరుచుకున్నామంటూ దుకాణాదారులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో అక్కడికి వచ్చిన కార్పొరేటర్ గౌసుద్దీన్.. పోలీసులపై దుర్భాషలాడారు. వాళ్లపైకి దూసుకెళ్లి దౌర్జన్యం చేశారు. దుకాణాలు మూసేదిలేదని వారితో వాగ్వాదానికి దిగాకు. 30 రోజుల వరకు ఈ ఏరియాకు రావొద్దంటూ హెచ్చరించి దుర్భాషలాడారు. కాగా, ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
కేటీఆర్ సూచనతో ఎంఐఎం కార్పొరేటర్ అరెస్ట్
కార్పొరేటర్‌గా గెలిచినంత మాత్రాన.. పోలీసులంటే గౌరవం ఇవ్వరా? నోటికి ఎంత వస్తే అంత మాట్లాడతారా..? అందరికీ ఉన్న రూల్స్ వాళ్లకి వర్తించవా..? ఏంటి ఆ పొగరు. ఏం చూసుకుని ఆ దురుసు.. అంటూ పాతబస్తీలో పోలీసుల పట్ల ఎంఐఎం కార్పొరేటర్ వ్యవహరించిన తీరుపై నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో పోలీసులను ధూషించిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని ఓ నెటిజన్ మంత్రి కేటీఆర్‌కు ట్వీట్ చేశాడు. దీనిపై స్పందించిన కేటీఆర్ డీజీపీ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు కార్పొరేటర్ గౌస్ తీరుపై మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసు విధులకు ఆటంకం కలిగించిన వాళ్లపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్రంలో ఇటువంటి వాటికి తావులేదని, తప్పు చేసిన వాళ్లపై రాజకీయ పార్టీలకు అతీతంగా చర్యలు తీసుకోవాల్సిందేనని కేటీఆర్ స్పష్టం చేశారు.
రెండ్రోజుల తర్వాత.. కేటీఆర్ ట్వీట్ చేస్తేనే అరెస్ట్ చేస్తారా: రాజా సింగ్ ఫైర్
కార్పొరేటర్ వ్యవహారంపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్ ట్వీట్ చేస్తేనే పోలీసులు కేసు బుక్ చేస్తారా అంటూ ఆయన ప్రశ్నించారు.
లా అండ్ ఆర్డర్ కేటీఆర్ చేతిలో ఉందా? హోం మంత్రి చేతిలో ఉందా ? కేటీఆర్ ట్వీట్ చేయకపోతే అరెస్ట్ చేయరా? డీజీపీ, హైదరాబాద్ సీపీ ఏం చేస్తున్నారు? అంటూ ప్రశ్నించారు. ఘటన జరిగి రెండు రోజులైనా కార్పోరేటర్‌పై కేసు ఎందుకు బుక్ చేయలేదు. కేటీఆర్ ట్వీట్ చేసిన తర్వాత కేసు బుక్ చేస్తారా? అని ఆయన నిలదీశారు.
సామాన్య ప్రజలు ఇలా మాట్లాడితే పోలీసులు ఊరుకుంటారా... థర్డ్ డిగ్రీ ఉపయోగించి జైలులో వేస్తారు. ఎంఐఎం వాళ్లు ఏం చేసినా కేసులు పెట్టోద్దని ప్రభుత్వం పోలీసులకు ముందే చెప్పిందని రాజాసింగ్ ఆరోపించారు.