లైఫ్ సైన్సెస్ రాజధానిగా హైదరాబాద్, సిటీకి మరో అంతర్జాతీయ సంస్థ: దావోస్‌లో కేటీఆర్ కామెంట్స్
దావోస్/హైదరాబాద్: లైఫ్ సైన్సెస్ క్యాపిటల్‌గా హైదరాబాద్ నిలిచిందని తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. స్విట్జర్లాండ్ దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో కేటీఆర్ పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వంలో జరిగిన లైఫ్ సైన్సెస్ రంగంపై చర్చించారు. చర్చలో డాక్టర్ రెడ్డీస్ చెందిన జీవీ. ప్రసాద్ రెడ్డి, పీడబ్లూసీకి చెందిన మహ్మమద్ అథర్లు పాల్గొన్నారు. లైఫ్ సైసైన్సెస్ క్యాపిటల్‌గా హైదరాబాద్ ఉందని.. దీన్ని మరింతగా బలోపేతం చేసేందుకు ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మా క్లస్టర్నుని హైదరాబాద్ ఫార్మా సిటీ పేరుతో ఏర్పాటు చేస్తున్నామని కేటీఆర్ తెలిపారు.
లైఫ్ సైన్సెస్ రాజధానిగా హైదరాబాద్: కేటీఆర్
అయితే జాతీయ, అంతర్జాతీయ ప్రాధాన్యత ఉన్న ఈ ప్రాజెక్టుకు కేంద్రం నుంచి సరైన మద్దతు లభించడం లేదని... భవిష్యత్తులో లైసెన్స్ ఫార్మా రంగం మరింతగా విస్తరించాలంటే ఇన్నోవేషన్ విషయానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు మంత్రి కేటీఆర్.హైదరాబాద్ లైఫ్సైన్సెస్లో ఇతర నగరాలకంటే ముందుందని.. భవిష్యత్తులో నూతన మందుల ఆవిష్కరణ ప్రయోగశాలను దాటి డిజిటల్ డ్రగ్ డిస్కవరీ వైపు లైఫ్‌సైన్సెస్ ముందుకు వెళ్తున్న నేపథ్యంలో ఐటీ, ఫార్మా రంగం కలిసి పనిచేయాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు.
సులభతర విధానాలకు కేంద్రం చొరవ అవసరమన్న కేటీఆర్
ఇప్పటికే హైదరాబాద్ నగరంలో ఉన్న నోవర్టిస్ అతిపెద్ద రెండవ కార్యాలయాన్ని హైదరాబాద్‌లో కలిగి ఉందని.. భారతదేశంలో పరిశోధన, అభివృద్ధి రంగాన్ని అభివృద్ధి చేసేందుకు విదేశాల నుంచి వచ్చే పెట్టుబడులకు సులభతరంగా విధానాలు ఉండాలన్నారు. ఎందుకంటే ఈ రంగంలో ఇన్నోవేషన్‌పై పెట్టే పెట్టుబడులు అత్యంత రిస్క్‌తో కూడుకున్నవని, ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం మరింత చొరవగా ముందుకు కదలాలని కేటీఆర్ సూచించారు. ఆ దిశగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్, వాణిజ్య శాఖ మంత్రి మరిన్ని చర్యలు తీసుకోవలసిన అవసరం ఉందన్నారు.
పెట్టుబడులకు తెలంగాణ సర్కారు సానుకూలం: కేటీఆర్
భారతదేశంలో నైపుణ్యానికి కొదవలేదన్న కేటీఆర్... ప్రభుత్వాలు లైఫ్‌సైన్సెస్ రంగంలో పరిశోధన, అభివృద్ధి ఇన్నోవేషన్‌కి ప్రాధాన్యత ఇస్తూ ఆ రంగంలో భారీగా పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం ఉందన్నారు కేటీఆర్. ఈ దిశగా తెలంగాణ ప్రభుత్వం లైఫ్‌సైన్సెస్ రంగంలోని ఔత్సాహిక పరిశధకులకు సహకారం అందించేందుకు అనేక కార్యక్రమాలను చేపట్టిందని తెలిపారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ నగరంలో ఉన్న ప్రముఖ సంస్థలతో కలిసి పని చేస్తోందని వెల్లడించారు.
హైదరాబాద్‌కు మరో అంతర్జాతీయ సంస్థ
కాగా, తెలంగాణ రాష్ట్రంలో మరో అంతర్జాతీయ కంపెనీ పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించింది. హైదరాబాద్‌లో తమ కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నట్లు స్విట్జర్లాండ్‌కు చెందిన బీమా సేవల కంపెనీ స్విస్ రే ప్రకటించింది. దావోస్ పెవిలియన్‌లో మంత్రి కేటీఆర్‌తో సమావేశమైన స్విస్‌రే కంపెనీ ఎండీ వెరోనికా, ప్రతినిధులు ఈ మేరకు నిర్ణయించారు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా మంత్రి కేటీఆర్ వెల్లడించారు.హైదరాబాద్ బ్యాంకింగ్, ఫైనాన్షియల్, సర్వీసెస్, ఇన్సూరెన్స్ రంగంలోకి స్విస్రేకు స్వాగతమని కేటీఆర్ ట్వీట్ చేశారు. 250 మంది ఉద్యోగులతో ప్రారంభమయ్యే హైదరాబాద్ యూనిట్లో డేటా, డిజిటల్ కేబులిటీస్, ప్రొడక్ట్ మోడలింగ్, రిస్క్ మేనేజ్మెంట్పై దృష్టి సారిస్తుందని తెలిపారు.