స్వదేశానికి నిమ్మగడ్డ..8 నెలల తర్వాత: సెర్బియా నుండి విముక్తి: వెంటనే క్వారంటైన్ లో..!
జగన్ అక్రమాస్తుల కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న పారిశ్రామిక వేత్త నిమ్మగడ్డ ప్రసాద్ సెర్బియా ఆంక్షల నుండి స్వదేశానికి చేరుకున్నారు. ఎనిమిది నెలల తరువాత ఆయన హైదరాబాద్ వచ్చారు. గత ఏడాది జూలైలో యుఏఈ జారీ చేసిన రెడ్ కార్నర్ నోటీసు ఆధారంగా సెర్బియా పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు.
అనంతరం దేశం విడిచి వెళ్లరాదనే షరతుతో విదులయ్యారు. రెడ్ కార్నర్ నోటీసు ఆధారంగా నిర్బంధంలోకి తీసుకోవటంపై నిమ్మగడ్డ ప్రసాద్ సెర్బియా సుప్రీం కోర్టులో పిటీషన్ దాఖలు చేసారు. దీని పైన విచారించిన సెర్బియా కోర్టు నిమ్మగడ్డ నిర్బంధం చెల్లదంటూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో..సెర్బియా నుండి వచ్చిన నిమ్మగడ్డ కరోనా నేపథ్యంలో వైద్యుల పర్యవేక్షణలో ఆయన క్వారంటైన్లో ఉన్నారు.
ఏపీలో వైసీపీ మాస్కుల కలకలం ... రాజకీయ పార్టీలు కరోనాను వాడుకుంటున్నారుగా !!

వాన్ పిక్ వ్యవహారంలో ఫిర్యాదులపై..
నిమ్మగడ్డ ప్రసాద్ ను సెర్బియా పోలీసులు నిర్బంధంలోకి తీసుకోవటం జాతీయ స్థాయిలో చర్చ సాగింది. ఆయనకు మద్దతుగా వైసీపీ నేతలు కేంద్రం వద్ద రాయబారం చేస్తున్నారనే రాజకీయ విమర్శలు వినిపిం చాయి. గత ఏడాది జూలైలో ఫుట్‌బాల్ క్రీడాకారుల ఎంపికకు సంబంధించి సెర్బియా వెళ్లిన నిమ్మగడ్డను అక్కడి పోలీసులు అరెస్టు చేసారు. వ్యాపార ఒప్పందాల్లో భాగంగా రస్‌ఆల్‌ఖైమా ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా పోలీసులు అరెస్టు చేసి, కోర్టులో హాజరుపర్చారు.

దేశం విడిచి వెళ్లరాదని
తర్వాత కొన్ని రోజులకు బెయిల్ లభించినా తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు దేశం విడిచి వెళ్లరాదని సెర్బియా ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఆ ఆంక్షలను సడలించడంతో నిమ్మగడ్డ హైదరాబాద్ చేరుకున్నారు. జగన్ కంపెనీల్లో పెట్టుబడులకు(వాన్‌పిక్) సంబంధించిన వ్యవహారంలో నిమ్మగడ్డ ప్రసాద్ ఆయన సోదరుడు ప్రకాశ్ నిందితులుగా ఉన్నారు. నిమ్మగడ్డ గతంలో జైలు జీవితం గడిపారు. సీబీఐ కోర్టులో ఈ కేసు ప్రస్తుతం విచారణలో ఉంది.

రాస్ ఆల్‌ఖైమా పెట్టుబడులు..
నిమ్మగడ్డ ప్రసాద్ వాన్ పిక్ లో భాగస్వామిగా ఉండగా..అందులో రాస్ ఆల్‌ఖైమా పెట్టుబడులు పెట్టింది. అయితే, నిమ్మగడ్డ ఆ సొమ్మును జగన్ కంపెనీలకు తరలించారనే అభియోగాలు ఉన్నాయి. దీని పైన రాస్ ఆల్‌ఖైమా అంతర్జాతీయ కోర్టులో ఫిర్యాదు చేసింది. దీంతో..రెడ్ కార్నర్ నోటీసు జారీ అవ్వటంతో సెర్బియా పోలీసులు అరెస్ట్ చేసారు. మొత్తంగా దాదాపు ఎనిమిది నెలల పాటు నిర్బంధంలో ఉంటూ బయట పడటానికి తీవ్రంగా శ్రమించాల్సి ఉంచింది. ప్రస్తుతం సెర్బియా నుండి విముక్తి పొందిన నిమ్మగడ్డ ప్రసాద్ కరోనా నేపథ్యంలో వైద్యుల పర్యవేక్షణలో ఆయన క్వారంటైన్లో ఉన్నారు.