షాకింగ్ : ఎంబీబీఎస్ యువతికి 9 ఏళ్ల బాలుడి వేధింపులు.. ఈమెయిల్,ఫేస్బుక్ హ్యాక్... అశ్లీల పోస్టులు...
ఇప్పుడంతా ఇంటర్నెట్ ప్రపంచం... ఏడాది వయసున్న పిల్లలు సైతం స్మార్ట్‌ఫోన్ చేతికి ఇస్తేనే అన్నం తింటామని మారాం చేసే రోజులివి... పట్టుమని పదేళ్లు కూడా నిండకముందే సోషల్ యాప్స్,ఇంటర్నెట్ వినియోగంలో పిల్లలు ఆరితేరుతున్నారు. అయితే ఇంటర్నెట్లో ఏది చూడాలి... ఏది చూడకూదన్న విచక్షణ లేక కొంతమంది పిల్లలు చెడు మార్గంలో పయనిస్తున్నారు. అంతేనా... కొంతమంది పిల్లలు టెక్నాలజీని ఆసరాగా చేసుకుని చిన్నతనం నుంచే వేధింపులు,మోసాలకు కూడా పాల్పడుతున్నారు. తాజాగా హైదరాబాద్‌లో 9 ఏళ్ల ఓ మైనర్ బాలుడు ఎంబీబీఎస్ చదువుతున్న యువతిని సైబర్ వేధింపులకు గురిచేసిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.

అసలేం జరిగింది...
హైదరాబాద్‌లోని ఓ ప్రాంతంలో నివసించే యువతి ఎంబీబీఎస్ చదువుతోంది. కొద్దిరోజుల క్రితం ఆమె ఈమెయిల్ అకౌంట్ హ్యాక్ అయింది. ఆ ఈమెయిల్ ద్వారానే ఆమె ఆన్లైన్ క్లాసులకు హాజరవుతోంది. ఆమె మెయిల్ హ్యాక్ చేసిన వ్యక్తి.. ఆ ఆన్లైన్ క్లాసుల్లో అసభ్యకరమైన కామెంట్స్ పోస్ట్ చేయడం మొదలుపెట్టాడు.ఆ తర్వాత కొద్దిరోజులకు ఆమె ఫేస్బుక్,ఇన్స్టాగ్రామ్ కూడా హ్యాక్ అయ్యాయి. అందులోనూ అశ్లీల ఫోటోలు,అసభ్యకర పోస్టులు ప్రత్యక్షమయ్యాయి.

ఇంతలోనే మరో పిడుగు...
తమ ఇంటి పొరుగునే ఉండే ఒక బాలుడి సాయంతో ఆమె తన ఫేస్బుక్,ఇన్స్టాగ్రామ్ ఖాతాలను బ్లాక్ చేసింది. అయితే ఆ తర్వాత కొద్దిరోజులకే మళ్లీ ఆ ఖాతాలు రీయాక్టివేట్ కావడం... అశ్లీల ఫోటోలు,అసభ్యకరమైన పోస్టులు అందులో కనిపించడం మొదలైంది. దీంతో ఇదంతా ఎవరు చేస్తున్నారో తెలియక ఆ యువతి ఉక్కిరిబిక్కిరైంది. ఇంతలోనే మరో పిడుగు లాంటి మెయిల్ వచ్చి పడింది. నీ తండ్రి మొబైల్ ఫోన్‌తో పాటు ఆయన నెట్ బ్యాంకింగ్ వివరాలను కూడా హ్యాక్ చేసినట్లు ఆ మెయిల్లో పేర్కొన్నారు. హ్యాక్ చేసిన యువతి మెయిల్ నుంచి ఆమె పొరుగింట్లో ఉండే బాలుడి మెయిల్‌కు దాన్ని పంపించారు.

ఫోటోలు ఇంటర్నెట్లో పోస్ట్ చేస్తానని...
అంతేకాదు,నీ ఫోటోలను ఇంటర్నెట్లో పోస్ట్ చేస్తానని ఆమెకు బెదిరింపులు మొదలయ్యాయి. గుర్తు తెలియని నంబర్స్ నుంచి వాట్సాప్‌కు అసభ్యకర మెసేజ్‌లు వచ్చాయి. దీంతో ఇక భరించలేకపోయిన యువతి సైబర్ పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు మార్చి 27న ఓ మైనర్ బాలుడిని అరెస్ట్ చేశారు. 9 ఏళ్ల ఆ బాలుడే ఎంబీబీఎస్ చదువుతున్న యువతిని వేధింపులకు గురిచేసినట్లు నిర్దారించారు. ఆ యువతి నివసించే కాలనీలో ఆమె ఇంటికి సమీపంలోనే అతను కూడా ఉంటున్నట్లు గుర్తించారు.

ఎట్టకేలకు దొరికిపోయాడు...
తరచూ ఆ యువతి ఇంటికి వెళ్లే ఆ బాలుడు ఆమెతో సన్నిహితంగా మెలిగేవాడు. ఇదే క్రమంలో ఓ రోజు ఆ యువతి తన ఫేస్బుక్,ఇన్స్టాగ్రామ్ ఖాతాలను డిలీట్ చేసేందుకు అతని సాయం కోరింది. దీంతో ఇదే అదనుగా అతను ఆమె ఈమెయిల్ పాస్వర్డ్ మార్చేశాడు. అలా మెయిల్‌తో పాటు దానికి లింక్ చేసి వున్న ఫేస్బుక్,ఇన్స్టాగ్రామ్ ఖాతాలను హ్యాక్ చేశాడు. అప్పటినుంచి అశ్లీల ఫోటోలు,అసభ్యకరమైన పోస్టులతో ఆమెను వేధించడం మొదలుపెట్టాడు. పోలీసులు ఐపీ అడ్రస్ ఆధారంగా దర్యాప్తు చేయడంతో ఎట్టకేలకు అతను పట్టుబడ్డాడు. ఇటీవలే అతన్ని జువైనల్ కోర్టు ఎదుట హాజరుపరిచారు. ప్రస్తుతం అతన్ని అబ్జర్వేషన్ హోమ్‌లో ఉంచారు.