హారన్ కొడుతున్నారా? అయితే జైలుకు వెళ్ళాల్సిందేనట.. ట్రాఫిక్ పోలీసుల వార్నింగ్!!
తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ లో విపరీతంగా పెరిగిపోయిన వాహనాలతో వాతావరణ కాలుష్యం కాకుండా శబ్ద కాలుష్యం కూడా పెరిగిపోయింది. ఈ క్రమంలో శబ్ద కాలుష్యానికి చెక్ పెట్టడానికి హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సరికొత్త నిర్ణయం తీసుకున్నారు. మల్టీ సౌండ్ హారన్ లు వినియోగిస్తున్న వారిపై చర్యలు తీసుకుని, అవసరం అనుకుంటే వారిని జైలుకు పంపించాలని నిర్ణయం తీసుకున్నారు.

మల్టీ సౌండ్ హారన్ లు ఉపయోగించే వారిపై ట్రాఫిక్ పోలీసుల కొరడా
హైదరాబాద్ మహానగరంలో వాహనాల రణగొణ ధ్వనులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. గాలి కాలుష్యంతో పాటుగా శబ్ద కాలుష్యం విపరీతంగా పెరగడంతో, దీనిని నియంత్రించడానికి హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగారు. హైదరాబాద్ నగరంలో రోజురోజుకు లేటెస్ట్ బైక్స్ పెరిగిపోతున్నాయి. ఇక వాటికి చాలామంది మల్టీ సౌండ్ హారన్ లు ఉపయోగిస్తూ శబ్ద కాలుష్యాన్ని మరింత పెంచుతున్నారు. ఇక ప్రైవేట్ బస్సుల తీరితే సరేసరి. దీంతో మల్టీ సౌండ్ హారన్లు ఉపయోగించే వాహనాలపై కొరడా ఝుళిపించాలి అని నిర్ణయం తీసుకున్నారు హైదరాబాద్ నగర ట్రాఫిక్ పోలీసులు.

మల్టీ సౌండ్ హారన్ల తొలగింపుకు 3నెలల గడువు .. ఆపై జైలుకే
మోటార్ వాహనాల చట్టం ప్రకారం వాహనాలకు ఉన్న హారన్లు కాకుండా, మల్టీ సౌండ్ హారన్ వినియోగిస్తే వారిని జైలుకు పంపనున్నారు. ప్రస్తుతం హారన్లను స్వాధీనం చేసుకుంటున్న పోలీసులు, ఆ హారన్ల తొలగింపుకు వాహనదారులకు మూడు నెలల గడువు ఇవ్వనున్నారు. ఆలోపు మల్టీ సౌండ్ హారన్ లు తొలగించకపోతే వారిపై కేసులు పెట్టి, కోర్టుకు పంపి జైలు శిక్ష విధించేలా చూస్తామంటూ చెప్తున్నారు.
నగరంలో మల్టీ సౌండ్ హారన్ ల తొలగింపుకు స్పెషల్ డ్రైవ్
ఇప్పటికే నగరంలో పెద్ద ఎత్తున హారన్లు మోగిస్తూ రోడ్లపై దూసుకు వెళ్తున్న బస్సులు, ప్రైవేటు బస్సులపై దృష్టిసారించిన ట్రాఫిక్ పోలీసులు సౌండ్ మీటర్ తనిఖీ చేసి పరిమితికి మించి శబ్దం ఉన్నవాటిని స్వాధీనం చేసుకుంటున్నారు. మరీ ఎక్కువ హారన్లు వినియోగిస్తున్న వారిపై పెట్టీ కేసులు కూడా నమోదు చేస్తున్నారు. బస్సులు, లారీలు, టూ వీలర్లు ఇలా ఏ వాహనానికి మల్టీ సౌండ్ హారన్ ఉన్నా సరే వాటిని తొలగిస్తున్నారు. అంతేకాదు వారం రోజుల్లోనే రెండు వేల హారన్ లను స్వాధీనం చేసుకున్న ట్రాఫిక్ పోలీసులు, మల్టీ సౌండ్ హారన్ ల వల్ల చెవులు, మెదడుకు హాని కలుగుతుందని చెప్తున్నారు.

త్వరలో సౌండ్ పొల్యూషన్ కు చెక్ పెట్టేలా అకౌస్టిక్ కెమెరాలు
నగరంలో మల్టీ సౌండ్ హారన్ లు వినియోగిస్తున్న వారంతా తక్షణం వాటిని తొలగించాలని, లేదంటే భవిష్యత్ లో తీవ్ర పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుంది అంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇక ఇప్పటికే హైదరాబాద్ మహానగరంలో సౌండ్ పొల్యూషన్ కు చెక్ పెట్టడం కోసం కీలక నిర్ణయం తీసుకున్న ట్రాఫిక్ పోలీసులు ఏ వాహనం నుండి పెద్దగా సౌండ్ వస్తుందో చూసి కెమెరాతో వీడియో తీసే అకౌస్టిక్ కెమెరాలను ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయం తీసుకున్నారు.

హారన్ ల విషయంలో తస్మాత్ జాగ్రత్త
దీనికి సంబంధించి ఇప్పటికే కసరత్తు చేస్తున్న ట్రాఫిక్ పోలీసులు త్వరలోనే ఈ కెమెరాల ద్వారా పని మొదలు పెట్టనున్నారు. ఇక వీటిని ఏర్పాటు చేసిన తర్వాత హారన్ ల నిబంధనలు ఉల్లంఘించే వారికి వెయ్యి రూపాయల జరిమానాతో పాటుగా, ఎక్కువ చలనాలు నమోదయ్యే వాహనాలపై కేసులు, చార్జిషీట్లు నమోదు చేస్తామని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు. మరి హారన్ ల విషయంలో తస్మాత్ జాగ్రత్త. మీరు బాగా సౌండ్ చేస్తే ట్రాఫిక్ పోలీసులు రీ సౌండ్ వచ్చేలా జైలుకు పంపుతారట!!