హైదరాబాద్లో మహిళా జర్నలిస్ట్ ఆత్మహత్యాయత్నం-ఆ నేత వేధింపులే కారణమంటూ సెల్ఫీ వీడియో
హైదరాబాద్లో ఓ మహిళా జర్నలిస్ట్ ఆత్మహత్యాయత్నం కలకలం రేపుతోంది. ఎంబీటీ(మజ్లిస్ బచావో తెహ్రీక్) పార్టీకి చెందిన ఓ నేత తనను వేధిస్తున్నారని ఆరోపిస్తూ ఆమె ఆత్మహత్యకు యత్నించారు. ఆత్మహత్య సమయంలో సెల్ఫీ వీడియో చిత్రీకరించిన ఆ జర్నలిస్ట్... సదరు నేతపై పలు ఆరోపణలు చేశారు. నిందమాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించిన ఆమె ప్రస్తుతం ఓవైసీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

అసలేం జరిగింది...
చాంద్రాయణ గుట్ట పోలీసుల కథనం ప్రకారం... గుల్షన్ ఎ ఇక్బాల్ కాలనీలో నివాసముండే నాహీదా ఖాద్రీ(37) అనే మహిళా ఓ న్యూస్ ఛానెల్లో జర్నలిస్టుగా పనిచేస్తున్నారు. ఎంబీటీ నేత సయ్యద్ సలీం(66) కొద్దిరోజులుగా తనను వేధిస్తున్నారని ఆమె ఆరోపిస్తున్నారు. ఇటీవల అసభ్యకర వీడియోలు,ఫోటోలు సోషల్ మీడియాలో అప్లోడ్ చేసి ఆమె పరువుకు భంగం కలిగించే రీతిలో సలీం వ్యవహరించినట్లు తెలుస్తోంది. దీంతో సలీంపై నాహీదా ఖాద్రీ మే 25న సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సోషల్ మీడియాలో ధూషించిన సలీం...
పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ సలీం ఆమెను వేధించడం మానలేదని తెలుస్తోంది. శుక్రవారం(జూన్ 11) ఫేస్బుక్ లైవ్ పెట్టిన సలీం... నాహీదా ఖాద్రిని తీవ్రంగా ధూషించినట్లు సమాచారం. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఖాద్రీ ఆత్మహత్యకు యత్నించారు. ఆత్మహత్యకు ముందు సెల్ఫీ వీడియో చిత్రీకరించిన ఆమె... సయ్యద్ సలీం వేధింపులు తట్టుకోలేకనే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు తెలిపారు. ఆయన వ్యాఖ్యలతో తన కుటుంబం మానసిక క్షోభకు గురైందన్నారు.

దాడికి యత్నించిన మజ్లిస్ కార్యకర్తలు
తనకు పెళ్లి కావాల్సిన కూతుళ్లు ఉన్నారని... సయ్యద్ వేధింపులతో 20 రోజులుగా నరకయాతన అనుభవిస్తున్నానని ఖాద్రీ పేర్కొన్నారు. తనకు ఆత్మహత్య తప్ప మరో దారి కనిపించట్లేదని ఆ సెల్ఫీ వీడియోలో వెల్లడించారు. నాహీదా ఖాద్రీ ప్రస్తుతం ఓవైసీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తన తల్లి ఆత్మహత్యకు యత్నించడానికి కారణం సయ్యద్ సలీమే అని ఖాద్రీ కుమార్తె పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు సలీంను అరెస్ట్ చేసి రిమాండుకు తరలించారు. విషయం తెలిసిన మజ్లిస్ కార్యకర్తలు పోలీస్ స్టేషన్కు చేరుకొని సలీంపై దాడికి యత్నించారు. పోలీసులు వారిని అడ్డుకుని అక్కడి నుంచి పంపించేశారు. ప్రస్తుతం కేసు దర్యాప్తు కొనసాగుతోంది.