ఆ బ్రాండ్ అంబాసిడర్‌ను నేనే-బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు-కేసీఆర్ ఫ్యామిలీని కేంద్రం వదిలిపెట్టదన్న ఎంపీ అరవిం
టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని దించే బ్రాండ్ అంబాసిడర్ తానే అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పేర్కొన్నారు. 'కేటీఆర్... మీ సర్కారును గద్దె దించే బ్రాండ్ అంబాసిడర్‌ను నేనే.. రైతులను, దళితులను మోసం చేసినవ్.రైతు, దళిత సమాజం తరఫున నిలబడి కొట్లాడే బ్రాండ్ అంబాసిడర్ నేనే.నీ ప్రభుత్వాన్ని గద్దె దించే పోరాటంలో బ్రాండ్ అంబాసిడర్ నేనే...' అని బండి సంజయ్ పునరుద్ఘాటించారు.
'రాష్ట్రంలో 3 లక్షల ఇళ్లు కడితే మరో 10 లక్షల ఇళ్లయినా మంజూరు చేయించే బాధ్యత నాది. అవసరమైతే ఇద్దరం కలిసి ఢిల్లీ పోయి మోదీని అడుగుదామని కూడా చెప్పాను. అయినా కేసీఆర్ దాటవేస్తున్నాడు తప్ప పేదలకు ఇళ్లు కట్టివ్వడం లేదు.' అని మరో ట్వీట్లో ప్రభుత్వాన్ని విమర్శించారు. దేశంలో పండే పంటను ఏవిధంగా ఎగుమతి చేయాలనే అంశంపై అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్రం మీటింగ్ పెడితే... కేసీఆర్ తప్ప అందరు సీఎంలు దానికి హాజరయ్యారని పేర్కొన్నారు.కేసీఆర్ వెళ్తే తెలంగాణలో పండించిన పంటనంతా విదేశాలకు ఎగుమతి చేసే అవకాశం ఉండదన్నారు.

అంతకుముందు,పాదయాత్రలో భాగంగా మెదక్ జిల్లాలో పాపన్నపేటలో మహిళా రైతులతో బండి సంజయ్ ముచ్చటించారు.వరిపొలంలో కలుపు తీస్తున్న మహిళలతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.దేశ ఆహారభద్రతలో మహిళా రైతులు,కూలీలు కీలక భూమి పోషిస్తున్నారని పేర్కొన్నారు.
కేసీఆర్ కుటుంబాన్ని వదిలిపెట్టేది లేదు : ఎంపీ అరవింద్
కేసీఆర్ కుటుంబం చేసిన తప్పులను కేంద్రం వదిలిపెట్టదని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ పేర్కొన్నారు.టీఆర్ఎస్ పాలనలో కొకైన్ టు కాళేశ్వరం అవినీతి చిట్టా కేంద్రం వద్ద ఉందన్నారు. కేటీఆర్ కొకైన్ రామారావుగా మారిపోయాడని ఎద్దేవా చేశారు. కేటీఆర్, కవితల డబ్బు పిచ్చితో తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి ఎవరూ ముందుకు రావటం లేదని విమర్శించారు.
రేవంత్ రెడ్డి, కేటీఆర్ డ్రగ్స్ టెస్టులు ఎక్కడ వరకు వచ్చాయో ప్రజలకు చెప్పాలన్నారు. దేశాన్ని తామే నడుపుతున్నామని చెప్పే కేటీఆర్.. రాష్ట్రంలో ప్రభుత్వ భూములు ఎందుకు అమ్ముతున్నారో చెప్పాలని ప్రశ్నించారు. కేటీఆర్, కవితల వలనే ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని దుస్థితి వచ్చిందన్నారు. ప్రజా సమస్యలపై మాట్లాడితే రాజద్రోహం కేసు పెడతారా? అని నిలదీశారు. కేటీఆర్‌కు ధైర్యం ఉంటే తనపై కేసులు పెట్టాలన్నారు. చచ్చిపోయిన కాంగ్రెస్‌ను లేపేందుకు కేసీఆర్, కేటీఆర్‌లు విశ్వప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. గజ్వేల్‌లో కాంగ్రెస్ నిర్వహించిన సభ సీఎం కేసీఆర్ ప్రణాళికలో భాగమేనని అన్నారు. రేవంత్ రెడ్డి ఏ పార్టీలో ఉన్నాడో.. ఆయనకే తెలియదని విమర్శించారు. రాష్ట్రంలో ఎంత వరి పండినా కొంటామన్న సీఎం కేసీఆర్... ఇప్పుడు ఆ మాట నిలబెట్టుకోవట్లేదని... రైతులను మోసం చేస్తున్నారని మండిపడ్డారు.