కేటీఆర్ సర్! మీ పంచ్‌కి నా ముక్కు వాచిపోయింది: రాంగోపాల్ వర్మ ఏమన్నారంటే.?
హైదరాబాద్: తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌కు.. ప్రముఖ వివాదాస్పద సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మకు మధ్య సోషల్ మీడియా వేదిక అయిన ట్విట్టర్లో ఆసక్తికరమైన చర్చ జరిగింది. రెండ్రోజుల క్రితం రాంగోపాల్ వర్మ చేసిన ట్వీట్‌కు కేటీఆర్ బదులిచ్చారు. ఆలస్యంగా చూసిన వర్మ ఆదివారం స్పందించారు.
మద్యం హోం డెలివరీ?
ఇక వివరాల్లోకి వెళితే.. లాక్డౌన్ తర్వాత పలు ప్రాంతాల్లో మద్యం దొరక్క కొందరు వింత ప్రవర్తనతో ఆస్పత్రుల చుట్టూ తిరుగుతుండగా.. మరికొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ.. మద్యాన్ని హోం డెలివరీ చేసేందుకు ఆదేశాలిచ్చినట్లు వార్తలు వచ్చాయి. అయితే, ఆ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని పశ్చిమబెంగాల్ ప్రభుత్వం స్పష్టం చేసింది.
తెలుగు రాష్ట్రాల సీఎంలకు..
కాగా, రాంగోపాల్ వర్మ మాత్రం పశ్చిమబెంగాల్ ప్రభుత్వం మద్యాన్ని హోం డెలివరీ చేస్తున్నారనే వార్తను మాత్రమే తెలుసుకున్నారు. ఆ రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రకటన మాత్రం ఆయనకు చేరలేదు. ఈ క్రమంలో ట్విట్టర్ వేదికగా ఆయన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఉద్దేశించి ట్వీట్లు చేశారు.
తెలుగు సీఎంలు కూడా మమతాలాగా పెద్ద మనసుతో...
తెలుగు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, జగన్ ప్రజల పరిస్థితిని అర్థం చేసుకుని మద్యాన్ని అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. జనాలు ఇంట్లో బోర్ కొట్టి జుట్టు పీక్కుంటున్నారని, చిన్న పిల్లల్లా ఏడుస్తున్నారని తెలిపారు. పిచ్చిపట్టి ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారని, మరికొందరు తమ భార్యలను కొడుతున్నారని చెప్పుకొచ్చారు. తెలుగు సీఎంలు కూడా మమతా బెనర్జీలా పెద్ద మనసు చేసుకోవాలంటూ కేసీఆర్, కేటీఆర్, వైఎస్ జగన్మోహన్ రెడ్డిలను ట్యాగ్ చేశారు.
కేటీఆర్ పంచ్‌కు ముక్కు వాచిపోయిందంటూ..
ఈ క్రమంలో వర్మ ట్వీట్‌కు మంత్రి కేటీఆర్ స్పందించారు. ‘వర్మ గారూ.. మీరు మాట్లాడుతోంది హెయిర్ కట్స్ గురించే అనుకుంటా..?' అని బదులిచ్చారు. ఆలస్యంగా చూసిన వర్మ దీనిపై ఆదివారం స్పందించారు. ‘కేటీఆర్ సర్.. మీ రిప్లైను చూసుకోలేదు. నాకు మీ హాస్య చతురత ఎంతో ఇష్టం. మీ బలమైన బాక్సింగ్ పంచ్‌కి నా ముక్కు ఎర్రగా వాచిపోయింది'అని వర్మ వ్యాఖ్యానించారు. అంతేగాక, తెలంగాణ ప్రభుత్వం కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలు బాగున్నాయని వర్మ ట్వీట్ చేశారు. కేటీఆర్ దీనికి లైక్ చేయడం గమనార్హం.