telangana cm kcr hyderabad ias siddipet sangareddy తెలంగాణ సీఎం కేసీఆర్ హైదరాబాద్ ఐఏఎస్ సిద్దిపేట సంగారెడ్డి
తెలంగాణలో ఐఏఎస్‌ల బదిలీ... ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం...
తెలంగాణ ప్రభుత్వం పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కొందరు ఐఏఎస్ అధికారులకు అదనపు బాధ్యతలు అప్పగించింది. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఎం.హనుమంతరావు,మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్లు వెంకటేశ్వర్లును ప్రభుత్వం బదిలీ చేసింది. హైదరాబాద్ కలెక్టర్ శ్వేతామహంతికి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అదనపు బాధ్యతలు అప్పగించింది.ప్రస్తుత సిద్దిపేట కలెక్టర్ వెంకట్ రామిరెడ్డికి మెదక్ కలెక్టర్‌గా ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది.
నాలుగు రోజుల క్రితమే ఇద్దరు ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసిన సంగతి తెలిసిందే. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ అబ్దుల్ అజీమ్‌లు బదిలీ అయ్యారు. సందీప్ ఝా స్థానంలో కుమ్రం భీం జిల్లా కలెక్టర్‌గా 2015 -బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి రాహుల్ రాజ్‌ను నియమించారు. ప్రస్తుతం రాహుల్‌రాజ్ జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ అబ్దుల్ అజీమ్ స్థానంలో ములుగు కలెక్టర్ కృష్ణ ఆదిత్యకు అదనపు బాధ్యతలు అప్పగించారు.

అంతకుముందు,మంచిర్యాల జిల్లా కలెక్టర్ భారతీ హోళికేరిని ప్రభుత్వం సిద్దిపేట కలెక్టర్‌గా బదిలీ చేసింది.ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్‌కు మంచిర్యాల కలెక్టర్‌గా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు అప్పగించింది.
ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రభుత్వం భారీగా కలెక్టర్లను బదిలీ చేసిన సంగతి తెలిసిందే. ఒకేసారి 50 మంది ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. టీఆర్ఎస్ రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత ఇంత భారీ ఎత్తున ఐఏఎస్‌ల బదిలీ జరగడం అదే తొలిసారి.జిల్లా స్థాయి మొదలు రాష్ట్ర స్థాయి వరకు అన్ని శాఖల్లో ప్రభుత్వం మార్పులు చేసింది.21 జిల్లాలకు కొత్త కలెక్టర్లను నియమించగా.. కీలకమైన శాఖల్లో అధికారులను మార్చారు.కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రధానాధికారి రజత్‌కుమార్‌ను కీలకమైన నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శిగా ప్రభుత్వం నియమించింది.