• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

విమోచనాన్ని విస్మరించడం భావితరాలకు అన్యాయం... సాంస్కృతిక, సాంఘీక వారసత్వంపై దాడి : కిషన్ రెడ్డి

By G Kishan Reddy, Union Minister
|

వ్యాస రచయిత - జి.కిషన్ రెడ్డి, (కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖల మంత్రి)

గతాన్ని గుణాత్మకంగా పరిశోధించాలి. పక్షపాతానికి తావు లేకుండా అధ్యయనం చేయాలి. ఉన్నది ఉన్నట్టే విషదీకరించాలి. అప్పుడే అది 'చరిత్ర' అవుతుంది. 'చరిత్ర' నిష్పక్షపాతంగా ఉంటేనే మనకు కానీ, మన భవిష్యత్తు తరాలకు కానీ నాటి సంఘటనలపై సరైన అవగాహన కలుగుతుంది, అర్థం చేసుకునే వీలవుతుంది. కానీ భారత చరిత్రను.. ఆ మాటకొస్తే అప్పటి మన తెలంగాణ ప్రాంత చరిత్రను పాక్షికంగానే అక్షరబద్ధం చేశారు, పైగా పూర్తి పక్షపాతంతో అసంపూర్తిగా గ్రంథస్తం చేశారు.

కొందరు మేధావులు, చరిత్రకారులు తమ సైద్ధాంతిక భావజాలానికి అనుగుణంగా చరిత్రను వక్రీకరించారనడం దేశవ్యాప్తంగా వెల్లడవుతోన్న విస్తృతాభిప్రాయం. ఎంపిక చేసిన కొన్ని అంశాలకే అధిక ప్రాధాన్యత కల్పించారని, ప్రాధాన్యత సంతరించుకున్న ఎన్నో అంశాలను ఉద్దేశ్యపూర్వకంగానే తక్కువ చేసిచూపారని, ఇంకొన్నింటిని పూర్తిగా తొక్కిపెట్టారనేది చరిత్రను పరిశీలిస్తే అవగతమవుతుంది. ఇది ''భారతదేశ సాంస్కృతిక, సాంఘీక వారసత్వంపై దాడి'' అని పేర్కొనడం ఎంతమాత్రం అతిశయోక్తి కాదు.'

ignoring liberation day is injustice to the future generations says union minister kishan reddy

వాస్తవాలను వక్రీకరించారు...
స్వాతంత్ర్యం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భాన్ని మనం ''ఆజాదీ కా అమృత్ మహోత్సవ్'' పేరిట ఏడాది పాటు ఉత్సవాలు జరుపుకొంటున్నాం. ఈ సందర్భంగా మనకు స్వేచ్ఛా స్వాతంత్య్రాలను ప్రసాదించిన నాటి సమర యోధులను స్మరించుకోవడం మన బాధ్యత. అందుకే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఈ ''ఆజాదీ కా అమృత్ మహోత్సవ్''లో భాగంగా నాటి సమరయోధులను గౌరవిస్తూ అనేక కార్యక్రమాలు చేపట్టింది. మన స్వాతంత్ర్య పోరాటాల చరిత్రకు భిన్న దృక్పథాలు, పార్శ్వాలున్నాయి, విభిన్న కోణాలున్నాయి. వాటిని విస్మరిస్తూ ఒకే కోణంలోనే మన పోరాటాల చరిత్రను అధ్యయనం చేశారు, వాస్తవాలను వక్రీకరించి అక్షరబద్ధం చేశారు. దీంతో అసమాన ధైర్య సాహసాలు, పోరాటాలు, త్యాగాలు చేసిన ఉద్ధండులెందరికో చరిత్ర పుటల్లో స్థానం లేకుండా పోయింది.

మరుగునపడిన అన్‌సంగ్ హీరోస్

మరుగున పడిన స్వాతంత్ర్య సమర యోధుల (అన్ సంగ్ హీరోస్) (Unsung heroes)ను గుర్తించి, వారి సేవలు, త్యాగాలు, పోరాటాలను వెలుగులోకి తెస్తూ, భవిష్యత్ తరాలకు అందించడమూ ఈ అమృత మహోత్సవాల లక్ష్యాల్లో ఒకటి. మరుగున పడిన యోధులను వెలుగులోకి తీసుకురావడమంటే ఇప్పటికే గుర్తింపు పొంది, భారతీయుల పూజలందుకుంటోన్న మహనీయులను తక్కువ చేయడం ఎంత మాత్రం కాదు. వారితో పాటు ఈ అన్ సంగ్ హీరోస్ ను స్మరించుకోవాలనేది ప్రభుత్వ ప్రయత్నం, తాపత్రయం.బ్రిటిషర్లు దేశాన్ని విడిచి వెళ్లే నాటికి ప్రస్తుత తెలంగాణ రాష్ట్రం భాగంగా ఉన్న నాటి హైదరాబాద్ సంస్థానంలో భిన్నమైన పరిస్థితులు ఉండేవి. దేశానికి స్వాతంత్ర్యం లభించిందన్న సంతోషంతో వరంగల్ జిల్లాలో జాతీయ జెండా ఎగరేసిన మొగులయ్య అనే ఉద్యయకారుడిని నిజాం మనుషులు కాల్చి చంపారు. హైదరాబాద్ సంస్థానంలో భారత జెండా ఎవరు ఎగరేసినా ఇదే జరుగుతుందన్న హెచ్చరికలూ పంపారు. దేశవ్యాప్తంగా స్వాతంత్ర్య సంబరాలు జరుపుకొంటున్నప్పటికీ.. హైదరాబాద్ సంస్థాన ప్రజలు మాత్రం ఇంకా బానిస సంకెళ్ల నుంచి విముక్తి పొందక నిజాం నిరంకుశ పాలనలో, రజాకర్ మూకల అరాచక, అకృత్యాలతో నలిగిపోయారు.

నరరూప రాక్షసుడు ఖాసీం రజ్వీ..
హైదరాబాద్ సంస్థానం ప్రత్యేక దేశంగా ఉండాలనేది నాటి నిజాం వాంఛ. అది కుదరకపోతే భౌగోళికంగా విడివిడిగానే ఉన్న ఒకే దేశంగా ఉన్న పాకిస్తాన్, తూర్పు పాకిస్తాన్ (ప్రస్తుత బంగ్లాదేశ్) మాదిరిగా హైదరాబాద్‌ను పాకిస్తాన్ లో విలీనం చేయాలనేది ఆయన దురాలోచన. జాతీయభావాలు మెండుగా గల ఇక్కడి ప్రజలు మాత్రం భారతదేశంలో విలీనం కావాలనే వాంఛించారు. ప్రత్యేక దేశం అన్న ఊహ కూడా వారి దరిదాపుల్లో లేదు. అయితే తన ఆశలకు విరుద్ధంగా ఇక్కడి ప్రజల ఆకాంక్షలు ఉండడంతో నిజాం రాజు.. ఖాసీంరజ్వీ నేతృత్వంలో ప్రత్యేక రజాకార్ల ముఠాను ఏర్పాటు చేసి, ప్రజలమీదికి ఉసిగొల్పారు. ఇస్లాం ఛాందసవాదాన్ని నరనరాన నింపుకొన్న నరరూప రాక్షసుడు ఖాసీంరజ్వీ ప్రజలపై, ముఖ్యంగా హిందువులపై చెప్పనలవికాని అకృత్యాలకు పాల్పడ్డారు.

గ్రామాలపై పడి ధన,మాన,ప్రాణ దోపిడీ
రజాకార్లు ఊర్ల మీద పడి ప్రజల ధన మాన ప్రాణాలు దోచుకున్నారు. నాజీలను మించిన దురాగతాలకు తెగబడ్డారు. 13 నెలల పాటు ఇక్కడి ప్రజలు నరకాన్ని ప్రత్యక్షంగా అనుభవించారు. నిజాం నిరంకుశ పాలన నుంచి విముక్తి పొంది, భారతదేశంలో విలీనం కావడమే లక్ష్యంగా నాటి హైదరాబాద్ సంస్థానం ప్రజలు ''గోల్కొండ ఖిల్ల కింద నీ ఘోరీ కడతం కొడుకో.. నైజాం సర్కారోడో..'' అంటూ ఎవరికివారు విడివిడిగా, ఉమ్మడిగా అనేక పోరాటాలు చేశారు. ప్రజల పోరాటాలకు ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ చొరవతో చేపట్టిన ''ఆపరేషన్ పోలో'' పేరిట పోలీస్ చర్య తోడవడంతో 17 సెప్టెంబర్ 1948న నిజాం లొంగిపోయాడు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన 13 నెలల తర్వాత హైదరాబాద్ సంస్థానం నిజాం, రజాకార్ల దుర్మార్గాలు, అత్యాచారాలు, దోపిడీ నుండి విముక్తి పొంది, భారతదేశంలో విలీనమైంది.

దేశ చరిత్రలోనే అదొక మైలురాయి...
తెలంగాణకు స్వాతంత్ర్యం లభించిన 'సెప్టెంబర్ 17' భారతదేశ చరిత్రలోనే ఒక మైలురాయి. మనకు స్వాతంత్ర్యం లభించని 15 ఆగస్టున జాతీయ జెండా ఎగరవేసి, స్వాతంత్ర్య సమరయోధులను స్మరించుకునే మనం, మనకు నిజమైన స్వాతంత్ర్యం లభించిన 17 సెప్టెంబర్ ను మాత్రం విస్మరించడం దురదృష్టకరం. 'విమోచన', 'విముక్తి', 'విలీన' అన్న పదాల మధ్య వ్యత్యాసాన్ని బూచిగా చూపి, లేనిపోని భయాందోళనలు సృష్టించి సెప్టెంబర్ 17ను అధికారికంగా జరపకపోవడం నాటి సమరయోధుల పోరాటాలను, త్యాగాలను అగౌరవపర్చడమే కాదు, భవిష్యత్ తరాలను మోసం చేసినవారవుతాం.

1946 నుంచే నిజాం వ్యతిరేక పోరాటం మొదలైందన్నట్టు కొందరు చరిత్రను వక్రీకరిస్తూ, ప్రజలను తప్పుదారిపట్టిస్తున్నారు. మంగళ్ పాండే మొదలుపెట్టిన 1857 మొదటి స్వాతంత్ర్య సంగ్రామం కన్నా ముందే ఈ గడ్డపై బ్రిటిషర్లకు, నిజాం (అప్పటి అసఫ్ జాహీలు) కు వ్యతిరేకంగా పోరాటాలు జరిగాయి.

కొమ్రం భీంకు తగినంత గుర్తింపు దక్కలేదు...
ఉత్తర తెలంగాణ నుంచి చత్తీస్ ఘడ్ వరకు విస్తరించిన గోండ్వానా ప్రాంతంలో ఆంగ్లేయులకు, నిజాం సేనలకు వ్యతిరేకంగా 'రాంజీగోండ్' నేతృత్వంలో అనేక పోరాటాలు జరిగాయి. గెరిల్లా యుద్ధరీతిలో బ్రిటిష్, నిజాం సైనికులను ముప్పుతిప్పలు పెట్టి, మూడు చెరువుల నీళ్లు తాగించారు. చివరికి బ్రిటిష్, నిజాం సైన్యం కుట్రలు పన్ని రాంజీగోండ్ ను బంధించి, 17 సెప్టెంబర్ 1860న నిర్మల్ లోని మర్రిచెట్టుకు ఉరితీశారు. రాంజీగోండ్ తో పాటు 1000కి పైగా ఉద్యమకారులను ఉరి తీసిన రక్తపు చరిత్రకు ఈ మర్రిచెట్టు సాక్ష్యం. ఈ ఊడల మర్రి కాస్తా 'ఉరుల మర్రి'గా పేరు పొందింది. రాంజీగోండ్ ను ఉరితీసిన తర్వాత 88 సంవత్సరాలకు 17 సెప్టెంబర్ 1948న నిజాం నుంచి ఈ ప్రాంతం విముక్తి పొందింది. ఇదే గడ్డపై పుట్టిన మరో ఆదీవాసీ వీరుడు కొమ్రం భీం ''జల్, జంగల్, జమీన్'' నినాదంతో నిజాంకు, బ్రిటిషర్లకు వ్యతిరేకంగా అనేక పోరాటాలు చేసి, అసువులు బాశారు. మన చరిత్రలో రాంజీగోండ్, కొమ్రం భీం లాంటి యోధులకు దక్కాల్సినంత గుర్తింపు దక్కలేదనడం కాదనలేని వాస్తవం. ఇలాంటి వీరులను వెలుగులోకి తెచ్చి, సగౌరవంగా స్మరించుకోవడం ఈ ''ఆజాదీ కా అమృత్ మహోత్సవ్'' ఉద్దేశ్యాల్లో ఒకటి.

టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారికంగా ఎందుకు నిర్వహించట్లేదు...
ఇంతటి విశిష్ట చరిత్ర సొంతం చేసుకున్న మనం, నాటి సమరయోధులను స్మరించుకుంటూ సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహించడం మన కర్తవ్యం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనూ పార్టీలకు అతీతంగా ఇక్కడి ప్రజలందరూ తెలంగాణ ఆత్మగౌరవ నినాదంతో సెప్టెంబర్ 17న విమోచన దినోత్సవం జరపాలని ఉద్యమించారు. విమోచన దినం ఎందుకు జరపరంటూ ప్రస్తుత ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గారు అప్పటి ముఖ్యమంత్రులు వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డిలను నిలదీశారు, వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇప్పుడు స్వరాష్ట్రం సాధించుకున్నా విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించుకోలేని దౌర్భాగ్యం మనది. ఖాసీంరజ్వీ వారసత్వాన్ని అందుకున్న ఓ మత ఛాందసవాద పార్టీకి భయపడి, విమోచన దినోత్సవం అధికారికంగా నిర్వహించకపోతే భవిష్యత్ తరాలు మనల్ని క్షమించవు. తెలంగాణ సెంటిమెంటు అడ్డం పెట్టుకొని అధికారంలోకి వచ్చిన పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వం ప్రజల సెంటిమెంటుకు విలువ ఇవ్వకుండా, అధికారికంగా విమోచన దినోత్సవాన్ని జరపడానికి నిరాకరించడం క్షమించరాని నేరం. నాటి హైదరాబాద్ సంస్థానంలో భాగమై మహారాష్ట్రలో విలీనమైన 5 జిల్లాల్లో, కర్నాటకలో విలీనమైన 3 జిల్లాల్లో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సెప్టెంబర్ 17న విమోచన దినోత్సవాలను అనేక సంవత్సరాలుగా, ప్రతి ఏటా అధికారికంగా నిర్వహిస్తున్నారు. పూర్తి రాష్ట్రానికి వర్తించే ఈ విమోచన దినోత్సవాన్ని తెలంగాణ రాష్ట్రంలో అధికారికంగా నిర్వహించేందుకు ఇక్కడి టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం మజ్లిస్ పార్టీ ఆదేశాలతో ప్రజాభిప్రాయానికి విరుద్ధంగా వ్యవహరిస్తోంది.

మతకోణంలో చూడవద్దు...
విమోచన దినోత్సవాన్ని మత కోణంలో చూడడం సరైనది కాదు. నిజాంకు వ్యతిరేకంగా హిందువులు, ముస్లింలతో పాటు అన్ని మతాల వారూ పోరాడారు. నిరంకుశ నిజాం వ్యతిరేక వార్తలతో 'ఇమ్రోజ్' అనే పత్రిక నడిపి, రజాకార్ల చేతిలో క్రూరంగా హతమైన షోయబుల్లాఖాన్ ముస్లిమే అని గుర్తుంచుకోవాలి. మనం నిత్యం సంచరించే కాచిగూడ స్టేషన్ రోడ్డులోనే రజాకర్లు కిరాతకంగా కత్తులతో దాడి చేసి, షోయబుల్లాఖాన్ కాళ్లూ, చేతులు నరికారు. అదేవిధంగా నిజాంను ధిక్కరిస్తూ, బ్రిటిషర్లపై తిరుగుబాటు బావుటా ఎగరేసిన తుర్రెబాజ్ ఖాన్ ముస్లిమే. నాటి బ్రిటిష్ రెసిడెన్సీ, ప్రస్తుత కోఠి మహిళా కళాశాల తుర్రెబాజ్ ఖాన్ ధైర్య సాహసాలకు సాక్షి. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ముస్లింలు సైతం పోరాడారని చరిత్ర చెబుతుంటే విమోచన దినోత్సవం ముస్లింలకు వ్యతిరేకం అనడం మూర్ఖత్వమే. చరిత్రను మతప్రాతిపదికన కాకుండా నిష్పక్షపాతంగా చెప్పాలి. వక్రభాష్యాలు లేకుండా ఉన్నది ఉన్నట్టు వివరించాలి. ఎవరివో మనోభావాలు దెబ్బతింటాయని సాకుగా చూపి, చరిత్రలో మలుపు తిప్పిన కీలకమైన ఘట్టాలను విస్మరించడం తగదు. దేశానికి స్వాతంత్ర్యం లభించి 75వ ఏట అడుగుపెట్టిన ఈ శుభ సందర్భంలోనైనా సెప్టెంబర్ 17న అధికారికంగా విమోచన దినోత్సవం జరపాలని, జాతీయ జెండా ఎగరవేసి, నాటి సమరయోధులను సగౌరవంగా స్మరించుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను.

  టీపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పై మండిపడ్డ టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి || Oneindia Telugu

  English summary
  Union Minister Kishan Reddy articulated his opinion on September 17th as there is different opinions to accept it as liberation day.He reiterated that Sep 17th should be declare and celebrate as liberation day as nizam rule end and become part of Indian union.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X