యూఏఈలో 13ఏళ్లు, రూ. కోటి వీసా జరిమానా మాఫీ: తిరిగి ఇండియాకు తెలంగాణ వాసి
న్యూఢిల్లీ: పదమూడేళ్లుగా ఎలాంటి పత్రాలు లేకుండా యూఏఈలో ఉంటున్న ఓ 47ఏళ్ల భారతీయుడికి సంబంధించిన అర మిలియన్ దిర్హామ్స్(రూ. 1,00,21,000) వీసా జరిమానాను అక్కడి ప్రభుత్వం మాఫీ చేసింది. దీంతో అతడు తిరిగి స్వదేశానికి చేరుకున్నాడని స్థానిక మీడియా వెల్లడించింది.

కరోనాతో ఉద్యోగం పోయింది..
గల్ఫ్ న్యూస్ కథనం ప్రకారం.. తెలంగాణకు చెందిన పోతుగోండ మేడీ అనే వలస కార్మికుడు కరోనా మహమ్మారి కారణంగా తన ఉద్యోగం కోల్పోవడంతో ఇక్కడి ఇండియన్ కాన్సులేట్‌ను సంప్రదించాడు. తనకు వేరే ఉద్యోగం కూడా దొరకడం లేదని చెప్పాడని ఇండియన్ కాన్సులేట్ లేబర్ అండ్ కాన్సులర్ కాన్సుల్ జితేందర్ నేగి తెలిపారు.

పోతుగోండ మేడీ భారతీయుడేనా?
2007లో విజిట్ వీసా మీద గల్ఫ్ దేశానికి వచ్చినట్లు పోతుగోండ తెలిపాడు. ఆ తర్వాత అతడ్ని అతడి ఏజెంట్ మోసం చేశాడు. మేడీకి చెందిన పాస్‌పోర్ట్‌ను తిరిగివ్వకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. దీంతో ఇండియన్ మిషన్‌కు.. మేడీ పౌరసత్వం ధృవీకరించడం కూడా కష్టంగా మారింది. ఈ క్రమంలో హైదరాబాద్ నగరంలోని ఓ చారిటీ సంస్థకు ఇతని కుటుంబం గురించిన వివరాలు తెలుసుకుని చెప్పాలని కోరింది.

ఎట్టకేలకు వివరాలు సంపాదించి..
సామాజిక కార్యకర్త శ్రీనివాస్ సహకారంతో మేడికి సంబంధించిన రేషన్ కార్డు, ఎలక్షన్ కార్డును తన సొంత గ్రామం నుంచి సంపాదించాం. అయితే, కొన్ని వివరాలు మ్యాచ్ కాకపోయినప్పటికీ.. మేడీ భారతీయుడని నిర్దారించాం' అని జితేందర్ నేగి తెలిపారు. భారత కాన్సులేట్ మేడీకి ఉచిత విమాన టికెట్ అందించిన తర్వాత.. సంబంధిత అధికారులు యూఏఈ ప్రభుత్వం తీసుకొచ్చిన వీసా గడువు ముగింపు పథకం కింద దరఖాస్తు చేసుకున్నారు.

తిరిగి ఇండియాకు.. రూ. కోటి వీసా జరిమానా మాఫీ..
ఈ పథకం ప్రకారం.. మార్చి 1, 2020 కంటే ముందు వీసా గడువు ముగిసినవారు ఈ ఏడాది నవంబర్ 17 లోపు దేశం విడిచి వెళ్లాలి. ఇలా వెళ్లిన వారికి వీసా బకాయిలు చెల్లించాల్సిన అవసరం లేదు. దుబాయ్‌లో ది జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ అండ్ ఫారెన్ ఎఫైర్స్ ఈ పథకం కింద మిలియన్ల దిర్హామ్స్ వీసా పెనాల్టీలను మాఫీ చేసింది. ఈ పథకంలో భాగంగానే మేడీకి సంబంధించిన సుమారు రూ. కోటి బకాయిలను మాఫీ చేసింది. కాగా, ఇప్పటి వరకు యూఏఈలో 80,000 మంది కరోనా బారినపడగా, 399 మంది మరణించారు.