తెలంగాణలో ప్రజలు పట్టం కట్టేదెవరికి : కేసీఆర్ తో సై అనేది ఆ పార్టీనే: తాజా సర్వే సంచలనం..!!
తెలంగాణలో రాజకీయ సమరం తారా స్థాయికి చేరింది. ఈ సారి అధికారం తమదే తమదే అంటూ కాంగ్రెస్ - బీజేపీ పోటా పోటీగా ప్రచారం చేసుకుంటున్నాయి. అసలు వాళ్లు ఏ మాత్రం పోటీయే కాదు..మరోసారి మాదే అధికారం అంటూ టీఆర్ఎస్ చెబుతోంది. వరుసగా రెండో సారి అధికారంలోకి వచ్చిన కేసీఆర్..ఈ సారి సంచలన పధకాల అమలుతో ముందుకు వెళ్తున్నారు. తెలంగాణలో ముందస్తు ఎన్నికలు ఖాయమనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ సమయంలో ఇండియా టుడే -సీవోటర్ నిర్వహించిన మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో ఆసక్తి కర సమీకరణాలు... అంచనాలు వెలుగు లోకి వచ్చాయి.

సర్వేలో ఆసక్తికర అంశాలు
దేశ వ్యాప్తంగా నిర్వహించిన ఈ సర్వేలో కేంద్రంలో ప్రధాని మోదీ హవా కంటిన్యూ అవుతుందని సర్వే తేల్చింది. ప్రతిపక్ష నేతగా మాత్రం మెజార్టీ ప్రజలు మమతా బెనర్జీకి ఓటు వేసారు. జాతీయ స్థాయిలోనే కాదు.. అంతర్జాతీయ స్థాయిలోనూ మోదీకే జనాదరణలో తొలి స్థానంలో నిలిచారు. ఏపీలో బీజేపీ - కాంగ్రెస్ కు ఒక్క లోక్ సభ స్థానం కూడా రాదంటూ సర్వే అంచనా వేసింది.
ఇక, జగన్ - చంద్రబాబు మధ్య పోటీ ఉంటుందనే సంకేతాలు సర్వే ద్వారా స్పష్టం అయ్యాయి. తెలంగాణ విషయంలో మాత్రం గత ఎన్నికల కంటే పరిస్థితుల్లో మార్పులు వచ్చినట్లుగా సర్వే గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే తెలంగాణలోని 17 లోక్సభ సీట్లలో బీజేపీకి 6 సీట్లు వస్తాయి. 2019 లోక్సభ ఎన్నికల కన్నా రెండు సీట్లను ఎక్కువ సాధిస్తుందని సర్వే పేర్కొంది.

టీఆర్ఎస్ - బీజేపీ మధ్య పోటీ
టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు గత లోక్సభ ఎన్నికల్లో 10 సీట్లు గెలుచుకోగా.. ఇప్పటికిప్పుడు ఎన్నికల జరిగితే ఒక సీటు కోల్పోయి 9 స్థానాలకు పరిమితమవుతాయని వివరించింది. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి మరింత నష్టం జరుగుతుందని, ప్రస్తుతం ఉన్న లోక్సభ సీట్లలో ఒక స్థానాన్ని కోల్పోతుందని వెల్లడించింది.
గత ఎన్నికల్లో కాంగ్రెస్ మూడు ఎంపీ స్థానాలను దక్కించకోగా.. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఆ పార్టీకి దక్కేవి కేవలం 2 సీట్లేనని తెలిపింది. ఈ సర్వే ద్వారా తెలంగాణలో ఇప్పుడున్న పరిస్థితులే కొనసాగితే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మూడు పార్టీల మధ్య పోటీ ఉన్నా... టీఆర్ఎస్ - బీజేపీ మధ్యనే ప్రధాన పోటీగా అంచనా వేస్తున్నారు. గ్రేటర్ ఎన్నికలు .. దుబ్బాక.. హుజూరాబాద్ బై పోల్స్ లో టీఆర్ఎస్ ఎన్ని రకాల వ్యూహాలు అమలు చేసినా.. బీజేపీ విజయం సాధించింది.

సర్వే ఫలితాలపై భిన్నాభిప్రాయాలు
అదే సమయంలో జాతీయ స్థాయిలో మోదీ హవా కొనసాగుతుందని చెబుతున్న వేళ... తెలంగాణ ఎన్నికల ప్రచారంలో ఆయనను సైతం ఈ సారి భాగస్వామ్యం చేస్తే మరింత ప్రయోజనం కలుగుతుందనే చర్చలు వినిపిస్తున్నాయి. కానీ, కేంద్రంలో బీజేపీ పైన..రాష్ట్రంలో టీఆర్ఎస్ పైన వ్యతిరేకత ప్రభావంతో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం పరిస్థితులు భిన్నంగా ఉంటాయని చెబుతున్నారు.
కొంత కాలంగా తెలంగాణ కాంగ్రెస్ లో టీపీసీసీ చీఫ్ రేవంత్ కు ఇంటి పోరు ఎక్కువైంది. రాజకీయ పోరాటం కంటే సొంతిల్లు చక్కదిద్దుకోవటం రేవంత్ కు సమస్యగా మారుతోంది. అటు బీజేపీ కోసం జాతీయ నేతలు అందరూ తెలంగాణ బాట పడుతున్నారు.

వచ్చే అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా
ఏ చిన్న అవకాశాన్ని విడవటం లేదు. అయిదు రాష్ట్రాల ఎన్నికలు పూర్తయిన తరువాత తెలంగాణ పైన జాతీయ స్థాయి నేతలు మరింత ఫోకస్ పెడతారని పార్టీ నేతలు చెబుతున్నారు. ఇవన్నీ గమనించిన కేసీఆర్ బీజేపీ వ్యతిరేక పార్టీలను ఏకం చేసే పనిలో పడ్డారు. అవన్నీ జాతీయ స్థాయిలో ప్రభావం చూపించినా.. తెలంగాణలో తమ పాలన-పథకాలు- నిర్ణయాలు తమకు మరోసారి అధికరం ఇస్తాయనే ధీమా వారిలో కనిపిస్తోంది. దీంతో...తాజా సర్వే ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.