వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేటీఆర్ నోట 'జాతీయ పార్టీ'.. బయో ఆసియా సదస్సులో కేంద్రమంత్రితో ఆసక్తికర వ్యాఖ్యలు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ హెచ్ఐసీసీ వేదికగా జరుగుతున్న బయో ఆసియా సదస్సు-2020లో కేంద్రమంత్రి పీయూష్ గోయల్,తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ మధ్య ఆసక్తికర సంభాషణ చోటు చేసుకుంది. తెలంగాణకు సంబంధించి కేటీఆర్ బాగా పనిచేస్తున్నారని కితాబిచ్చిన పీయూష్.. తెలంగాణనే కాదు దేశాన్ని కూడా ప్రమోట్ చేయండని సూచించారు. దీనికి సరదాగా బదులిచ్చిన కేటీఆర్.. 'అలా అయితే మేము కూడా జాతీయ పార్టీ పెట్టాల్సి వస్తుంది..' అన్నారు.

దానిపై అంతే సరదాగా స్పందించిన పీయూష్.. జాతీయ పార్టీ పెడితే స్వాగతిస్తామని,ప్రస్తుతం కేంద్రంలో జాతీయ పార్టీలకు అవకాశం ఉందని చెప్పారు. కాగా, 2018 చివరలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఫెడరల్ ఫ్రంట్‌ను ప్రతిపాదించిన సీఎం కేసీఆర్.. అవసరమైతే జాతీయ పార్టీ పెడుతానని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. తాజాగా సీఏఏ నేపథ్యంలో బీజేపీకి వ్యతిరేకంగా ఇతర పార్టీల ముఖ్యమంత్రులు,నాయకులను కూడగడుతానని వ్యాఖ్యానించారు. తద్వారా జాతీయ రాజకీయాల పట్ల తాను ఆసక్తిగా ఉన్నానని కేసీఆర్ పదేపదే సంకేతాలిస్తున్నారు.

అప్పట్లో జాతీయ పార్టీ ప్రస్తావన..

అప్పట్లో జాతీయ పార్టీ ప్రస్తావన..

నిజానికి డిసెంబర్,2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లబోతున్నారన్న కథనాలు తెర మీదకు వచ్చాయి. కేటీఆర్‌ను రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేసి ఆయన కేంద్ర రాజకీయాల్లోకి వెళ్తారని అంతా భావించారు. కానీ ఆ ఎన్నికల్లో కేసీఆర్ అంచనా తప్పి.. బీజేపీ గతం కంటే ఎక్కువ సీట్లను గెలుచుకోవడంతో కేంద్రంలో చక్రం తిప్పే అవకాశం దక్కలేదు. అయితే గత రెండేళ్లుగా బీజేపీ ఆయా రాష్ట్రాల్లో ఓటమిపాలు కావడం.. దేశంలో నెలకొన్న ఆర్థిక మందగమనం.. సీఏఏ నిరసనలు వంటి నేపథ్యంలో ఎన్డీయే సర్కారుపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత పెరిగిందని కేసీఆర్ భావిస్తున్నారు. ఈ క్రమంలో బీజేపీకి వ్యతిరేకంగా జాతీయ రాజకీయాల్లో అడుగుపెట్టాలనే యోచనలో ఉన్నారు. అందుకు సరైన సమయం,సందర్భం కోసం ఆయన వేచి చూస్తున్నారు.

కేటీఆర్‌పై పీయూష్ విమర్శలు..

కేటీఆర్‌పై పీయూష్ విమర్శలు..

అంతకుముందు మంత్రి కేటీఆర్‌పై పీయూష్ గోయల్ పలు విమర్శలు గుప్పించారు. కేంద్రానికి ఎక్కువ ఆదాయాన్నిచ్చే తెలంగాణను కేంద్రం విస్మరిస్తుందన్న కేటీఆర్ వ్యాఖ్యలను ఆయన తప్పు పట్టారు. అంతేకాదు,సీఎం కేసీఆర్ కుమార్తె కవిత ఎన్నికల్లో ఓడిపోయినా వారికి తెలిసిరావట్లేదని ఎద్దేవా చేశారు. కేటీఆర్ కామెంట్స్ అవగాహనరాహిత్యం అని కొట్టిపారేశారు.ఆరేళ్లలో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టబట్టే తెలంగాణ కొంచెమైనా అభివృద్ధి చెందిందని, బీజేపీ సహకారం వల్లే ఇది సాధ్యపడిందని గుర్తుచేశారు.

 బయో ఆసియా సదస్సు

బయో ఆసియా సదస్సు

హెచ్ఐసీసీలో జరిగిన సదస్సులో 37 దేశాలకు చెందిన దాదాపు 2వేల మంది ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ అండ్‌ ట్రోపికల్ మెడిసిన్‌తో రాష్ట్ర ప్రభుత్వం ఎంవోయూ కూడా కుదుర్చుకుంది. సిన్‌జీన్ బయోటెక్ రీసెర్చ్ సెంటర్‌ను కూడా కేటీఆర్ ఆవిష్కరించారు. టెక్నాలజీ, లైఫ్ సైన్సెస్ రంగాల్లో హైదరాబాద్ దూసుకుపోతోందని చెప్పారు. లైఫ్ సైన్సెస్ రంగంలో పెట్టుబడులను ప్రోత్సహిస్తున్నామని, ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మా క్లస్టర్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించబోతున్నామని తెలిపారు. మౌలిక సదుపాయాల కల్పనపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. దేశంలోని 35 శాతం మెడిసిన్స్ హైదరాబాద్ కేంద్రంగా తయారవుతున్నాయని చెప్పారు. ఇప్పటికే హైదరాబాద్‌ నగరంలో.. 800 ఫార్మా కంపెనీలు ఉన్నాయని తెలిపారు. 276 ఎకరాల్లో మెడికల్ డివైజెస్ పార్క్ ఏర్పాటు చేశామని, రెండేళ్ల వ్యవధిలోనే 20 కంపెనీలు ఉత్పత్తి ప్రారంభించాయని పేర్కొన్నారు.

English summary
An interesting conversation took place between IT minister KTR and Union Minister Piyush Goyal over establishing a new National Party in central,on the stage of Bio Asia 2020.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X