వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాళేశ్వరంపై కాంగ్రెస్ కక్ష గట్టిందా?: నిజమేనా? ఈ నిరసనల మాటేమిటి?

తెలంగాణను మాగాణం చేయాలన్న ఏలిన వారి సంకల్పం సబబే కానీ ఆ పేరుతో బుల్డోజర్ మాదిరిగా వ్యవహరిస్తుండటంతో విమర్శలు ఎదుర్కొనే పరిస్థితిని తెచ్చుకుంటున్నది.

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: 'నీళ్లు - నియామకాలు- నిధులు' తెలంగాణ రాష్ట్ర సాధన డిమాండ్ ఇది. కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇస్తే తెలంగాణ ఇస్తామని కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఇచ్చిన హామీకి కట్టుబడి కాంగ్రెస్ పార్టీ అధినేత సోనియాగాంధీ 2014లో రాష్ట్రం ఏర్పాటుచేశారు. కానీ భావోద్వేగ రాజకీయాలతో అధికారం చేపట్టిన తెలంగాణ రాష్ట్ర సమితి నాయకత్వం.. రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు గతం మరిచి.. భవిష్యత్ అంతా మనదే అన్న ధోరణితోనే వ్యవహరిస్తోంది.

తెలంగాణను మాగాణం చేయాలన్న ఏలిన వారి సంకల్పం సబబే కానీ ఆ పేరుతో బుల్డోజర్ మాదిరిగా వ్యవహరిస్తుండటంతో విమర్శలు ఎదుర్కొనే పరిస్థితిని తెచ్చుకుంటున్నది. ఆంధ్రప్రదేశ్ ప్రజలతో పోలిస్తే చట్టబద్ధంగా ఏం జరుగుతుందన్న విషయం తెలంగాణ సామాన్యులకు తెలియని వ్యవహారాలు.

ఇప్పుడిప్పుడే తెలివిడి తెచ్చుకుంటున్న వైనం.. అందువల్లే తెలంగాణ ఏర్పాటైన తొలినాళ్లలో జీవోల జారీతోనే సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రజల భూములు స్వాధీనం చేసుకోగలిగింది రాష్ట్ర ప్రభుత్వం. వాస్తవంగా కేంద్రస్థాయిలో చట్టం ఉన్న తర్వాత దాని ప్రకారమే ముందుకు సాగాలన్నది రాజ్యాంగ మౌలిక సూత్రాల్లో ఒకటి. కానీ పలు రకాల కోర్టు కేసులు, విమర్శలు, ప్రతిపక్షాల ఆందోళన ఫలితంగా 2013 భూసేకరణ చట్టాన్ని పోలిన చట్టం ఇటీవలే చేసింది తెలంగాణ ప్రభుత్వం.

పేరుకే కేంద్ర చట్టాన్ని పోలిన చట్టం రూపకల్పన

పేరుకే కేంద్ర చట్టాన్ని పోలిన చట్టం రూపకల్పన

కానీ కేంద్ర చట్టంలో పేర్కొన్న భూ పరిహారం, ప్రజాభిప్రాయ సేకరణకు పాటించాల్సిన నిబంధనల ఊసే లేకుండా వ్యవహరిస్తూ ముందుకు సాగుతున్న తెలంగాణ ప్రభుత్వం.. గోదావరి నదిపై కాళేశ్వరం రిజర్వాయర్ నిర్మాణానికి పనులు ప్రారంభించిన తర్వాత కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి.. అనుమతులివ్వొద్దని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలికి ఫిర్యాదు చేశారు. ఆ విషయం బహిరంగంగానే చెప్పారాయన. ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టకుండానే పనులు ప్రారంభించినందున అనుమతులు మంజూరు చేయొద్దని కోరానని చెప్పారు.

Recommended Video

TRS and Congress workers Throw Chairs at each Other, Video
 వెన్వెంటనే ప్రజాభిప్రాయ సేకరణ దేనికి?

వెన్వెంటనే ప్రజాభిప్రాయ సేకరణ దేనికి?

కాంగ్రెస్ పార్టీ నేత మర్రి శశిధర్ రెడ్డి కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖను కలువడం అధికార తెలంగాణ రాష్ట్ర సమితికి, రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రం కాళ్లలో కట్టెలు పెట్టినట్లు కనిపిస్తున్నది. అవును మరి నిజమే పచ్చ కామెర్ల రోగికి లోకమంతా పచ్చగానే కనిపిస్తున్నదన్నట్లు వ్యవహరిస్తున్నది అధికార పక్షం. తాము తెలంగాణను చక్కదిద్దేందుకు ప్రయత్నిస్తుంటే కాంగ్రెస్ పార్టీ కుట్రలు చేస్తున్నదని మీడియా ముందు పెడ బొబ్బలు పెడుతున్నది. అదే నిజమైతే వెన్వెంటనే కరీంనగర్, పెద్దపల్లి, రామగుండం, కామారెడ్డి, నిజామాబాద్, యాదాద్రి - భువనగిరి, జనగామ తదితర జిల్లాల పరిధిలో ఆగమేఘాలపై ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాల్సిన అవసరమేమిటో అధికార పక్షమే చెప్పాలి మరి.

టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మాత్రమే ప్రజాప్రతినిధులా?

టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మాత్రమే ప్రజాప్రతినిధులా?

వాస్తవంగా ప్రజాభీష్టానికి అనుగుణంగా ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంటే గ్రామగ్రామాన ప్రజాభిప్రాయ సేకరణ జరుపాలి. కానీ భారీ బందోబస్తు మధ్య అనునిత్యం తనిఖీలు నిర్వహించి, జిల్లా కేంద్రాలు, ముఖ్య పట్టణ కేంద్రాల్లో అధికార తెరాస నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎమ్మెల్సీల సమక్షంలోనే నిర్వహిస్తున్న ప్రజాభిప్రాయ సేకరణ సాంకేతికంగా కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ వద్ద అనుమతి తెచ్చుకోవడానికి వెసులుబాటు కల్పిస్తుందేమో కానీ, వాస్తవంగా రైతులు, ప్రజల జీవితాలతో ఆడుకోవడమేనన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పెద్దపల్లిలో కాంగ్రెస్ నేత దుద్దిళ్ల శ్రీధర్ బాబు తదితరులు ప్రజాభిప్రాయ సేకరణను అడ్డుకునేందుకు వెళితే సంయమనం పాటించాల్సిన అధికార పక్షం ఎందుకు విధ్వంసానికి పాల్పడిందో సీఎం - టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, భావి సీఎంగా భావిస్తున్న కే తారక రామారావు సమాధానం చెప్పాలని రాజకీయ విమర్శకులు అభిప్రాయ పడుతున్నారు.

 పెద్దపల్లిలో కాంగ్రెస్, టీఆర్ఎస్ బాహాబాహీ ఇలా

పెద్దపల్లిలో కాంగ్రెస్, టీఆర్ఎస్ బాహాబాహీ ఇలా

కాళేశ్వరం ప్రాజెక్టు పర్యావరణ అనుమతి కోసం పెద్దపల్లిలో బుధవారం చేపట్టిన ప్రజాభిప్రాయ సేకరణ రసాభాసగా మారింది. తెరాస, కాంగ్రెస్‌ కార్యకర్తలు బాహాబాహీకి దిగారు. తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో నీటిపారుదల ఆయకట్టు అభివృద్ధి శాఖ.. ప్రాజెక్టుకు అనుసంధానమైన సిరిపురం బ్యారేజీ, అన్నారం, గోలివాడ పంప్‌హౌస్‌లపై ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. భూ నిర్వాసితుల సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల నిర్వాసితులు భూములు కోల్పోవడమేగాక చుట్టుపక్కల గ్రామాలు మునిగిపోతాయన్నారు. 2 వేల మందికి పైగా నిర్వాసితులకు పరిహారం విషయంలో అన్యాయం జరిగిందని, దీనిపై నేతలు స్పందించాలని డిమాండ్‌ చేశారు. ఈ క్రమంలో కాంగ్రెస్‌ వర్గీయులు ‘కేసీఆర్‌ డౌన్‌.. డౌన్‌..' అంటూ నినాదాలు చేశారు.

శ్రీనివాస్‌ సభావేదికపై బైఠాయించడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. తెరాస, కాంగ్రెస్‌ నాయకులు పరస్పర ఆరోపణలకు దిగారు. ఇరు పార్టీల కార్యకర్తలు పరస్పరం కుర్చీలు విసురుకుంటూ ముష్టిఘాతాలకు దిగారు. వేదికపైనున్న శ్రీనివాస్‌పై తెరాస కార్యకర్తలు దాడి చేశారు. వెంటనే పోలీసులు సభలో ఉన్న మాజీ మంత్రి శ్రీధర్‌బాబు, శ్రీనివాస్‌లతో పాటు దాదాపు 150 మంది కాంగ్రెస్‌ కార్యకర్తలను అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలించారు. శ్రీనివాస్‌కు గాయాలవడంతో ఆసుపత్రికి తరలించాల్సి వచ్చిందంటే అధికార తెరాస శ్రేణులు ఎంత ప్రతిష్ఠకు పోతున్నాయో అర్థవమవుతూనే ఉన్నది.

విపక్షాలకు అభిప్రాయ సేకరణలో చోటేది?

విపక్షాలకు అభిప్రాయ సేకరణలో చోటేది?

ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాల్లో అధికార టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు, జిల్లా పరిషత్ చైర్ పర్సన్లు మాత్రమే మాట్లాడటమేమిటన్న సందేహాలు ప్రజలందరిలోనూ ఉన్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు చెందిన ప్రజా ప్రతినిధులు ఉన్నా.. వారిని శాంతిభద్రతల పరిరక్షణ పేరిట ప్రజాభిప్రాయ సేకరణకు దూరంగా ఉంచాల్సిన అవసరమేమిటన్న సందేహాలు ఉత్పన్నమవుతున్నాయి. పెద్దపల్లిలో జరిగిన సభలో కేవలం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మాత్రమే విధ్వంసం స్రుష్టించినట్లు అధికార తెలంగాణ రాష్ట్ర సమితి పత్రిక ‘నమస్తే తెలంగాణ'లో వార్తా కథనం ప్రచురితమైంది. వాస్తవంగా అన్ని జిల్లా కేంద్రాల్లోనూ జరిగిన ప్రజాభిప్రాయ సేకరణలోనూ నిర్వాసితుల నిరసన స్వరం వినిపించినట్లు వార్తలొచ్చాయి. ఈ సంగతులు విస్మరించి కేవలం ప్రజలు అమాయకులని ఏలిన వారు భావిస్తున్నట్లున్నారని విమర్శకులు అభిప్రాయ పడుతున్నారు.

భూమికి ప్రత్యామ్నాయంగా భూమి ఇవ్వాలంటున్న రైతులు

భూమికి ప్రత్యామ్నాయంగా భూమి ఇవ్వాలంటున్న రైతులు

రెండు రోజుల క్రితం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ సభలో పాల్గొన్న సాధారణ ప్రజానీకం సర్వం కోల్పోతున్నాం.. సాంత్వన కల్పించండని వేడుకున్నారు. 2013 చట్టం ప్రకారమే పరిహారం కావాలని, కోల్పోయిన భూమికి బదులు ఇవ్వండని నిర్వాసితులు డిమాండ్ చేయడమే క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులను తెలియజేస్తున్నది. ‘ఒకటి కాదు. రెండు కాదు. కొన్ని వందల ఏళ్ల నుంచి తాము వూళ్లొ నివసిస్తున్నాం. తరతరాలుగా ఈ ప్రాంతాల్లోనే కూలీ నాలీ చేసుకొని జీవిస్తున్నాం. వ్యవసాయమే మాకు ప్రధాన జీవనోపాధి. అలాంటి వూరిని, ఇంటిని వదిలి వెళ్లటం అంటే మావాళ్ల కాదు. తాము కోల్పోతున్న భూమికి బదులు భూమిని, ఇళ్లకు బదులు ఇళ్లు, నిరుద్యోగులవుతున్న వారికి జీవనభృతి కల్పిస్తే అంగీకరిస్తాం' అని రైతులు స్పష్టం చేశారు.

ప్రజాభిప్రాయ సేకరణకు దూరంగా నిర్వాసితులు

ప్రజాభిప్రాయ సేకరణకు దూరంగా నిర్వాసితులు

నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జరిగిన ప్రజాభిప్రాయ సేకరణలో పాల్గొన్న రైతు సంఘాల ప్రతినిధులు 2013 చట్టం ప్రకారమే నిర్వాసితులకు పరిహారం వర్తింప జేయాలని డిమాండు చేశారు. ప్రజాభిప్రాయ సేకరణలో భాగంగా వచ్చిన పలువురు రైతులు తమకు మాట్లాడే అవకాశం కల్పించలేదంటూ నినాదాలు చేశారు. తమకు ప్రాజెక్టు నిర్మాణం వద్దని, ప్రభుత్వం పునరాలోచన చేయాలని డిమాండు చేశారు. భూ నిర్వాసితులకు కాకుండా ఇతరులకు అవకాశం కల్పించటమేమిటని మండిపడ్డారు. భూనిర్వాసితులందరిని దూరంగా కూర్చోబెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. మోపాల్‌ మండలం మంచిప్పలో నిర్మించ తలపెట్టిన రిజర్వాయర్‌కు సంబంధించి మంగళవారం ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. నిజామాబాద్‌లోని రాజీవ్‌గాంధీ ఆడిటోరియంలో ఇన్‌ఛార్జి కలెక్టర్‌ రవీందర్‌రెడ్డి అధ్యక్షతన కాలుష్య నియంత్రణ మండలి అధికారులు ప్రజల నుంచి అభిప్రాయాలు స్వీకరించారు.

ఉనికి కోల్పోయేలా ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టొద్దని వినతి

ఉనికి కోల్పోయేలా ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టొద్దని వినతి

నిజామాబాద్ ఎంపీపీ కే యాదగిరి మాట్లాడుతూ మంచిప్పలో నిర్మించ తలపెట్టిన ప్రాజెక్టు నిర్మాణంపై ప్రభుత్వం పునరాలోచన చేయాలన్నారు. మొత్తం 3.5 టీఎంసీల నీటి సామర్థ్యంతో ప్రాజెక్టుకు రూపకల్పన చేశారని, ప్రస్తుతం కొండెం చెరువు ఒక టీఎంసీ సామర్థ్యం కలిగి ఉందన్నారు. దీనితో పాటు లక్ష్మి కాలువ, మాసాని చెరువు, కంజర్‌, కాల్‌పోల్‌ చెరువుల సామర్థ్యం కూడా బాగా ఉంది. నిజానికి వీటిని అభివృద్ధి చేస్తే దాదాపు 4.5 టీఎంసీల నీరు నిల్వ చేసే అవకాశం ఉంటుందని చెప్పారు. ‘ఇవన్నీ కూడా గొలుసు కట్టు చెరువులు. ఇందులో ఏ చెరువులో నీరు ఉన్నా మరో చోటుకి సులువుగా తరలించుకోవచ్చు. దీని వల్ల ఆయకట్టు రైతులకు కూడా మేలు జరుగుతుంది. ప్రస్తుతం ఉన్న గ్రామాలు, తండాలు ఉనికి కోల్పోయే ప్రమాదం ఉండదు. ప్రభుత్వం ఈ విషయమై ఆలోచన చేస్తే బాగుంటుంది. అంతేకాని గ్రామాలు, తండాలు ఉనికి కోల్పోయేలా ప్రాజెక్టుని నిర్మిస్తే పెద్ద ప్రయోజనమేమీ ఉండదు. దీనిపై జిల్లా ప్రజాప్రతినిధులు సీఎం కేసీఆర్‌తో చర్చిస్తే బాగుంటుంది' అని పేర్కొన్నారు. రైతుల శ్రేయస్సు కోసమే నీటిని తరలించేందుకు రిజర్వాయర్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందని, దీనివల్ల లక్షల ఎకరాలకు సాగునీరు అందనుందని ప్రజాప్రతినిధులు వివరించారు.

స్పష్టత లేకుండా ప్రాజెక్టుల నిర్మాణమేమిటన్న నిర్వాసితులు

స్పష్టత లేకుండా ప్రాజెక్టుల నిర్మాణమేమిటన్న నిర్వాసితులు

యాదాద్రి - భువనగిరి జిల్లా పరిధిలోని రాయిగిరిలో నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ సభలో పాల్గొన్న నిర్వాసితులు ‘ మా బతుకులు ఆగం చేయొద్దు.. ప్రాజెక్టులకు మేం వ్యతిరేకం కాదు ముందు పరిహారంపై స్పష్టతనివ్వండి' అని గంధమల్ల, బస్వాపూర్‌ భూ నిర్వాసితులు డిమాండ్‌ చేశారు. అండగా ఉంటామని, స్థైర్యం కోల్పోవద్దని ప్రజాప్రతినిధులు, అధికారులు చెప్పినా కాళేశ్వరం ప్రాజెక్టు 15, 16 ప్యాకేజీల నిర్మాణానికి అనుమతి కోసం పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ ఆందోళన మధ్యే సాగింది.

‘ మా తాత ముత్తాతల కాలం నుంచి మేం ఈ వూర్లలో ఉంటున్నాం సారూ. వావివరుసలతో మంచీచెడూ పంచుకుంటున్నాం. పల్లెనే జీవనాధారంగా బతుకుతున్నాం. ఇప్పుడు ఉన్నపళంగా వూరు విడిచి వెళ్లమంటే ఎక్కడికి పోవాలి? మూడు వందల వూర్లు బతుకుతాయంటే మా మూడూర్లు ముంపునకు గురిచేయడానికి సిద్ధం. అయితే మాకు భూమికి భూమి, ఇళ్లకు ఇళ్లు, ఇంటికో ఉద్యోగం, యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి. మా సంబంధాలు తెగిపోకుండా కొత్త వూరు నిర్మించాలి. పరిహారంపై స్పష్టత ఇవ్వాలి. భూమికి భూమి ఇవ్వని పక్షంలో మార్కెట్‌ ధర ప్రకారం పరిహారం చెల్లించాలి. ఏ స్పష్టత లేకుండా ప్రాజెక్టు పనులు ప్రారంభించొద్దు. మా బతుకులను ఆగం చేయొద్దు' అని భువనగిరి సమీపంలోని రాయిగిరిలో మంగళవారం గంధమల్ల, బస్వాపూర్‌ జలాశయాల నిర్మాణాలపై జరిగిన ప్రజాభిప్రాయ సేకరణలో నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేశారు.

అందరికీ న్యాయం చేస్తామన్న అనితా రామచంద్రన్

అందరికీ న్యాయం చేస్తామన్న అనితా రామచంద్రన్

ఒకవైపు రాయిగిరలో ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతున్న సమయంలోనే సమావేశ మందిరం బయట ముంపు గ్రామాల ప్రజలు ఆందోళన నిర్వహించారు. ప్రాజెక్టు నిర్మాణ స్థలంలోనే ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించాలని, పరిహారం చెల్లించిన తర్వాతనే భూసేకరణకు సర్వే చేయాలని నినాదాలు చేశారు. సమావేశ మందిరంలోకి దూసుకెళ్తున్న వారిని పోలీసులు అడ్డుకున్నారు. స్పందించిన కలెక్టర్ అనితా రామచంద్రన్‌ అందరికీ మాట్లాడే అవకాశం కల్పిస్తామని, ఇది కేవలం పర్యావరణ అనుమతుల కోసం చేపడుతున్న అభిప్రాయ సేకరణ మాత్రమేనని... పరిహారం నిమిత్తం తామే స్వయంగా ముంపు గ్రామాల్లో పర్యటించి నిబంధనల ప్రకారం పరిహారం చెల్లించి న్యాయం చేస్తామని పదేపదే విజ్ఞప్తి చేశారు. దీంతో ఆందోళన చేస్తున్న నిర్వాసితులు శాంతించారు.

వివిధ పార్టీలకు చెందిన ప్రజా ప్రతినిధులు స్పష్టత ఇచ్చిన తర్వాతే పనులు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. నిర్వాసితులు భయాందోళనలు తొలగించాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులు, అధికారులపైనే ఉందని సీపీఎం, సీపీఐ, భాజపా, తెదేపా, రైతు సంఘాల నాయకులు స్పష్టం చేశారు. ప్రాజెక్టు నిర్మాణాలపై అందరికీ అర్థమయ్యేలా ముంపు గ్రామాల్లో తెలుగులో ముద్రించిన కరపత్రాలను పంచి వారికి అర్థమయ్యేలా అధికారులు నిర్వాసితులను ఒప్పించాలని సమావేశంలో మాట్లాడారు. జలాశయాల నిర్మాణం ఎక్కడ జరుగుతుందో అక్కడే సమావేశాలు నిర్వహించి వారికి భూ పరిహారంపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. జిల్లా కేంద్రంలో పెట్టడం వల్ల కొన్ని ముంపు గ్రామాల నిర్వాసితులు ఈ ప్రజాభిప్రాయ సేకరణకు హాజరుకాలేకపోయారని ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు పెద్ద మనసుతో ఆలోచించి ముంపు గ్రామాల ప్రజలను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ప్రాజెక్టులకు కాంగ్రెస్ వ్యతిరేకం కాదని ఇలా వ్యాఖ్యలు

ప్రాజెక్టులకు కాంగ్రెస్ వ్యతిరేకం కాదని ఇలా వ్యాఖ్యలు

ఉమ్మడి కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కటకం మృత్యుంజయం మీడియాతో మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టుపై పర్యావరణ కాలుష్య మండలి నిబంధనల ప్రకారం ప్రజాభిప్రాయ సేకరణ జరగడం లేదని అన్నారు. కరీంనగర్‌ జిల్లా కలెక్టర్ సర్ఫరాజ్‌ అహ్మద్‌ను కలిసి విజ్ఞాపనపత్రం అందజేసి మాట్లాడారు. అనంతరం విలేకరులతో ఆయన మాట్లాడుతూ ప్రాజెక్టులకు కాంగ్రెస్‌ ఏనాడు వ్యతిరేకం కాదని, ప్రభుత్వ విధానాలపై మాట్లాడుతున్నామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఖర్చు రూ.80వేల కోట్లు ఉందని, దీనికి రాష్ట్ర ఆర్థిక, పర్యావరణ, సామాజిక అభివృద్ధి మీద ప్రభావం ఉంటుందన్నారు. అలాంటి దీనికి కనీసం సాధారణ ముసాయిదా అందుబాటులో లేదన్నారు. ప్రాజెక్టుతో అక్కడున్న ప్రజలకు మేలు జరిగేలా ఉండాలని, కాని ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు, కాంట్రాక్టర్లకు లాభం చేకూరేలా కన్పిస్తుందన్నారు. ప్రజాభిప్రాయ సేకరణ పూర్తిగా నిబంధనలకు విరుద్ధంగా జరిగిందన్నారు. బహిరంగ విచారణ నిర్వహించిన తీరు చూస్తే కార్యకర్తల సమావేశంలా ఉందని విమర్శించారు.

English summary
TRS MLC Karne Prabhakar accused that Congress leader Marri Shashidhar Reddy has lodged a complaint with Union Environment Secretary Ajay Narayana against the project. He said despite several obstacles being created by the Congress party, Kaleshwaram project would be completed on time. He said the project would benefit lakhs of farmers in the region. Prabhakar said that the TRS Government has re-designed the irrigation projects for better utilistion of Krishna and Godavari Waters and the objections being raised by the Congress leaders were baseless. He appealed to the people not to believe the Congress propaganda and participate in the public hearing on Kaleshwaram project.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X