వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కోదండరామ్ వర్సెస్ కెసిఆర్: పరిణామాల నేపథ్యం ఇదీ...

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ జన్మదినోత్సవం సందర్భంగా 2009 డిసెంబర్ తొమ్మిదో తేదీన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేస్తామని కేంద్ర హోంమంత్రి పి చిదంబరం చేసిన ప్రకటన నుంచి తప్పుకున్నందుకు నిరసనగా తెలంగాణ ప్రాంతంలోని అన్ని పార్టీల సహకారంతో, సంప్రదింపులతో ఏర్పాటయ్యిందే సంయుక్త కార్యాచరణ సమితి (జెఎసి). దానికి తొలిదశలో ప్రస్తుతం అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉన్న కే జానారెడ్డి చైర్మన్ గా ఉన్నారన్న ఇప్పటివారిలో చాలా మందికి తెలియదు.

తర్వాతీ కాలంలో నాటి అధికార కాంగ్రెస్ పార్టీ నేతగా నేరుగా జేఏసీలో ఉండడం సబబు కాదని, రాజకీయ నాయకులకు బదులు తటస్థ వైఖరి గల మేధావులను జేఏసీ చైర్మన్‌గా నియమించాలని చైర్మన్‌గా కోదండరాం పేరు ముందుకు వచ్చింది. అప్పటికే తెలంగాణ విద్యావంతుల వేదిక ద్వారా, వివిధ సంస్థల ద్వారా తెలంగాణ ప్రాంతంలో పౌర హక్కుల పరిరక్షణకు పోరాడుతున్న సంగతి విద్యావంతులైన, మేధావులైన వారందరికీ తెలుసు. అది వేరే సంగతి. కానీ తెలంగాణ ఉద్యమం ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) మాత్రమే ఆయనను ఫోకస్ చేసిందన్న వాదన శుద్ద అబద్ధం. ఒక ప్రొఫెసర్‌గా తెలంగాణ విద్యార్థులకు ప్రత్యేకించి ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిధిలో వివిధ కోర్సులు అభ్యసించిన విద్యార్థులందరికీ సుపరిచితుడు.

తెలంగాణ సాధన కోసం కేంద్రంపై ఒత్తిడి తేవడానికి కార్యాచరణ ప్రణాళికతో కూడిన ఆందోళనకు శ్రీకారం చుట్టాలని జేఏసీలోని వివిధ పార్టీలు, పక్షాలు ప్రతిపాదిస్తే.. దాన్ని వ్యతిరేకించిందెవరో లోకానికి తెలియనిది కాదు. అందులో భాగంగా మిలియన్ మార్చ్ నిర్వహణకు పిలుపునిస్తే ట్యాంక్ బండ్‌పై ప్రముఖుల విగ్రహాల విధ్వంసానికి దిగిందెవరో? పోలీసులు ఎవరిపై కేసులు పెట్టారో అందరికీ తెలిసిన సంగతే. నాటి నుంచి సాగర హారం, తర్వాత సకల జనుల సమ్మె వరకు వివిధ సామాజిక వర్గాలను సమీకరించడంలో ప్రస్తుత అధికార తెలంగాణ రాష్ట్ర సమితితోపాటు జేఏసీ పాత్ర.. అందులో కమిటీ చైర్మన్‌గా కోదండరాం పాత్ర ఎవరికీ తెలియని నిగూడ రహస్యమేమీ కాదు.

వాస్తవాలు నేపథ్యంగా సాగుతున్న జేఏసీ

వాస్తవాలు నేపథ్యంగా సాగుతున్న జేఏసీ

ప్రభుత్వం, విపక్షాలు అంతరాలు, అభ్యంతరాలు.. సమస్యల పట్ల అవగాహన లేకుండా.. ఉన్నా విస్మరించి జేఏసీ చైర్మన్ కోదండరాంపై విమర్శలు చేస్తున్న వారి వ్యూహం, తెర వెనుక ఉన్న వారెవ్వరో తెలియనంత అమాయకులు ప్రస్తుతం తెలంగాణాలో ఎవరూ లేరు. విమర్శకులకు ఒక విషయం అర్థం కావాల్సి ఉంది. ప్రస్తుత సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు స్వయాన చెప్పినట్లు ‘తెలంగాణ' అంటేనే ‘ధిక్కార స్వరం'. తమకు అన్యాయం జరిగితే తెలంగాణలోని సబ్బండ వర్ణాలు ఎదురు తిరుగుతాయి. తమకు ఆశ్రయం కల్పిస్తే జీవితకాలమంతా అండగా నిలుస్తాయి. జేఏసీ చైర్మన్‌గా కోదండరాంను విమర్శించిన కర్నూల్ జిల్లా నాయకుడు టీజీ వెంకటేశ్ నాలుక కోస్తానని హెచ్చరించిందీ ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వాధినేత అన్న విషయం ఈనాడు స్మార్ట్ ఫోన్ల పుణ్యమా? అని ఇటీవల వాట్సప్ ద్వారా రాష్ట్రమంతా హల్ చల్ చేస్తున్న సంగతి అందరికి తెలుసు. రాజకీయ పార్టీలతో, ప్రజాసంఘాలతో సంప్రదింపుల ద్వారా ఏర్పాటైన సంయుక్త కార్యాచరణ సమితి (జేఏసీ) ప్రస్తుతం రాష్టంలోని ఇతర పార్టీలు, ప్రజాసంఘాల నేతలతో సంప్రదిస్తూ ముందుకు సాగుతున్నదే తప్ప తప్పటడుగులు పడలేదు.

జేఏసీపై కీలక బాధ్యతలు ఇలా

జేఏసీపై కీలక బాధ్యతలు ఇలా

నాడు జేఏసీలో కీలక భూమిక వహించిన టీఆర్ఎస్ సొంత రాష్ట్రంలో ప్రస్తుతం అధికార పక్షం. సహజంగానే అధికార పక్షమంటేనే నిరసనలంటే వ్యతిరేకత ఉంటుంది. ప్రతిపక్షాలు కూడా ప్రజా సమస్యలను ముందుకు తీసుకెళ్లి, ప్రభుత్వంతో సంప్రదించి పరిష్కారానికి పూనుకుంటాయి. తెలంగాణలోనూ అది వర్తిస్తుంది. ఇక్కడ అదనంగా మరొక అంశం కూడా ఉన్నది. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఇరుసుగా పనిచేసిన జేఏసీపైనే అధిక బాధ్యతలు ఉన్నాయన్నది చేదు నిజం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ పార్లమెంట్‌లో పూర్తయిన వెంటనే ఎన్నికల హడావుడి మొదలైనప్పుడు సికింద్రాబాద్ లోక్ సభా స్థానం నుంచి పోటీ చేయాలన్ననాటి టీఆర్ఎస్ అధినేత, నేటి సీఎం కేసీఆర్ సూచనను కోదండరాం మర్యాదపూర్వకంగానే తిరస్కరించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ముగిసిన తర్వాత తిరిగి ప్రొఫెసర్‌గా విధులకు హాజరయ్యారు. సమయానుకూలంగా, ప్రభుత్వ నిర్ణయాల్లో పొరపాట్లను గుర్తుచేస్తూ వచ్చారు.

హైకోర్టు విభజనకు పోరాట స్ఫూర్తి కావాలి..

హైకోర్టు విభజనకు పోరాట స్ఫూర్తి కావాలి..

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరిగిన కొద్ది కాలానికి జేఏసీని పూర్తిగా రాష్ట్ర రాజకీయ రంగం నుంచి తప్పించేందుకు నేపథ్యం సిద్ధమైంది. తెలంగాణ ఏర్పాటైన తర్వాత జేఏసీలో ఉండనవసరం లేదని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు బయటకు వెళ్లాయి. కానీ తెలంగాణ ఏర్పాటై మూడేళ్లు కావస్తున్నా.. ఇప్పటికీ రెండు రాష్ట్రాల మధ్య ఉద్యోగుల విభజన పీటముడి వీడనే లేదు. ఇతర రాష్ట్రాలు ఏర్పాటైన వెంటనే విడివిడిగా హైకోర్టు ఏర్పాటైంది. మన తెలుగు రాష్ట్రాల్లోనూ హైకోర్టు మినహా అన్ని విడిపోయాయి. తాజాగా అమరావతిలో సచివాలయం, అసెంబ్లీ నిర్మించుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హైకోర్టు విషయమై మీనమేషాలెక్కిస్తున్నది. దీనికి ప్రత్యామ్నాయంగా గవర్నర్ సమక్షంలో ఇరు రాష్ట్రాల మంత్రుల కమిటీ ద్వారా పరిష్కారానికి చర్చలు జరుగుతున్నాయి. కానీ తెలంగాణ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు జేఏసీలో భాగంగా ఉండి ఆందోళన చేపట్టి ఉంటే ఫలితాలు వేరుగా ఉండేవి. అయితే ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలకు, వాటికి సారథ్యం వహిస్తున్న నేతలపై ఉన్న ఒత్తిళ్లను తోసిపుచ్చలేం.

ప్రభుత్వ కూల్చివేత సాధ్యమా?

ప్రభుత్వ కూల్చివేత సాధ్యమా?

తొలి నుంచి రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలతో సంప్రదింపుల ప్రక్రియ సాగించినట్లే ఇప్పుడు రాష్ట్రంలోని పార్టీలను జేఏసీ చైర్మన్‌గా కోదండరాం సంప్రదించడం నేరమెలా అవుతుందన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీతో తెలంగాణ ఏర్పాటుకు ముందు కూడా సమావేశమై రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను సవవివరంగా వివరించిన వారిలో కోదండరాం కూడా ఒకరు. ఇటీవల సోనియాతో ఆయన సమావేశమెందుకు అయ్యారని ప్రశ్నించాల్సిన అవసరమేమిటి? నాడు, నేడు కోదండరాం వైఖరిలో మార్పు వచ్చిందని చెప్పినా ఎవ్వరూ నమ్మబోరు. నమ్మరు కూడా. ఒక సిద్ధాంతానికి కట్టుబడి.. వెనుకబడిన తెలంగాణను రాష్ట్రంగా సాధించుకోవడానికి అన్ని వర్గాలతో కలిసి పని చేసిన వారిలో ఆయన ఒకరు. కానీ ప్రశ్నించిన తమపై అభాండాలు వేస్తున్నారని అంబాడాలు వేస్తున్నారు. ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కోదండరాం కుట్ర పన్నారని వారు. ఒక ఆరోపణ చేశారు. ఒక రిటైర్డ్ ప్రొఫెసర్.. ప్రభుత్వాన్ని కూల్చివేయడం అంటే ఇదేమైనా రాచరికమా? కాదే. అసెంబ్లీ ఉంటుంది. దాంట్లో అధికార, విపక్షాలు ఉంటాయి. మెజారిటీ ఉన్న పార్టీయే అధికారంలో ఉంటుంది. ఇక 2014 ఎన్నికల్లో కేవలం ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ మాత్రమే సంపాదించిన తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్).. దాదాపు అన్ని పార్టీల నుంచి ఎమ్మెల్యేలను ‘బంగారు తెలంగాణ' పేరిట తన వైపునకు ఆకర్షించింది. తెలుగుదేశం పార్టీ దాదాపు కనుమరుగై పోయింది. ప్రధాన ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ఇవ్వాళ్లా? రేపా? అన్నట్లు ఉన్నది.

అధికార పక్షం ఆధిపత్య రాజకీయం

అధికార పక్షం ఆధిపత్య రాజకీయం

అధికార టీఆర్ఎస్ రాజకీయంగా తనను ప్రశ్నించే వారు ఉండరాదన్న ధోరణిలో పాలనను, రాజకీయాలను ముందుకు తీసుకువెళుతున్న తరుణం. అదే సమయంలో రాష్ట్రంలో లక్షా ఏడువేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, వాటిని తప్పక భర్తీ చేస్తామని సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు నిండు సభ అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. కానీ ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) ద్వారా నియామకమైనవి కేవలం పది వేల మంది లోపే. జేఏసీ నిరసన ర్యాలీకి పిలుపునిచ్చిన తర్వాతే మూడు దఫాలుగా నియమించ తలపెట్టిన 10 వేల మంది పోలీసుల నియామకానికి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందన్న సంగతి చేదు నిజం. అంతకు ముందే జేఏసీకి ఉనికే లేదని ప్రభుత్వ పెద్దలు వాదించారు. అటువంటప్పుడు జేఏసీ చైర్మన్ అనే పేరుతో కోదండారం విమర్శలు చేయడమేమిటని వారంతా ప్రశ్నించిన రోజులు ఉన్నాయి.

పోలీసుల అత్యుత్సాహం ఇలా..

పోలీసుల అత్యుత్సాహం ఇలా..

ఫిబ్రవరి 22నాటి నిరుద్యోగ ర్యాలీ నిర్వహణపై నిషేధం విధించడమే కాదు ప్రభుత్వం ఉక్కు పాదం మోపింది. కానీ ఆ విషయం విస్మరించి ర్యాలీ విషయం పక్కతోవ పట్టిందని ఆరోపణ ముందుకు తెచ్చారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరించే వారిని పోలీసులు అరెస్ట్ చేయడం సహజ పరిణామమే. కానీ జేఏసీ చైర్మన్‌గా తెలంగాణ సాధనలో తమతోపాటు కదం తొక్కిన కోదండరాం అరెస్టుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం.. ప్రభుభక్తి ప్రదర్శించేందుకు పోలీసులు ఆయన ఇంటిపై దాడి చేసి విధ్వంసానికి దిగినట్లు అంతా మీడియాలో.. సోషల్ మీడియాలో వార్తలొచ్చాయి. సోషల్ మీడియాలో వివిధ రకాల వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. శాంతిభద్రతలను పరిరక్షించాల్సిన పోలీసులు విధ్వంసానికి దిగడం సబబేనా? అని సామాన్యులు అనుమానిస్తున్నారు.

జేఏసీ చైర్మన్‌కు అవమానం సబబేనా?

జేఏసీ చైర్మన్‌కు అవమానం సబబేనా?

ఉద్యమాన్ని అణచివేయడానికి చేసిన ప్రయత్నమూ, అందునా విపరీత ధోరణులకే ప్రచారం లభిస్తుంది. కోదండరాం విషయంలో జరిగిందిదే. కానీ ఆయన ఇల్లు, ఆయనకు ఇవ్వాల్సిన ప్రచారం చర్చనీయాంశాలయ్యాయని అన్నారు. ప్రభుత్వ నిర్ణయాలను నిలదీసిన జేఏసి చైర్మన్ కోదండరాంను ప్రశ్నిస్తూ అడ్వకేట్ల జెఎసి నేత కొంతం గోవర్దన రెడ్డి బహిరంగ లేఖ రాసినప్పుడు ఆయనపై విమర్శలు ఎక్కుబెట్టిన మౌనంగా ఉండాల్సిన అవసరమేమిటో అందరికీ తెలిసిన విషయమే. ప్రజాస్వామిక ఉద్యమాల్లో పనిచేసినప్పుడు ప్రభుత్వానికి, రాజ్య వ్యవస్థపై పోరాటం జరిపే వారిపై ప్రభుత్వం దమనకాండ ప్రదర్శిస్తుందన్న సంగతి తెలియదా? అన్నది తెలంగాణ సబ్బండ వర్గాల అనుమానంగా ఉన్నది. ఇవన్నీ విస్మరించి ప్రభుత్వ నిర్ణయాలను ప్రశ్నించడం సబబు కాదా? జేఏసీకి రాజకీయ పార్టీలతో సంబంధం ఉండదని కోదండరాం చిలుక పలుకులు పలికారని ఎగతాళి చేస్తూ విమర్శలు చేస్తున్న వారు చిలుక పలుకులు పలుకడానికి తెర వెనుక ఉన్న వారెవ్వరూ రాష్ట్ర ప్రజలు ఊహించుకోవడం కష్టమేమీకాదు.

English summary
Telangana Political JAC is on division line. With back door support some of JAC leaders questioned their boss Professor Kodandaram. They asks him how will proceed to forward JAC.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X