• search
  • Live TV
కరీంనగర్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

మాకెంతో ఇష్టమైన కేఎఫ్ బీర్లు ఎందుకు అమ్మడం లేదు: షాకింగ్ ఫిర్యాదు, ఏం జరిగిందంటే?

|

జగిత్యాల: మద్యం ప్రియుల కోసం ఫిర్యాదు చేసి సంచలనంగా మారాడు ఓ వ్యక్తి. జగిత్యాలలో మద్యం వ్యాపారులు కింగ్‌ ఫిషర్‌ బీరు‌ను అమ్మడం లేదంటూ పట్టణానికి చెందిన సూర్యనారాయణ అనే వ్యక్తి ప్రజా వాణిలో ఫిర్యాదు చేశారు. అంతేగాక, యువతకు ఇష్టమైన బీరును తెప్పించటం లేదని.. వ్యాపారులు సిండికేట్‌గా మారి కింగ్‌ఫిషర్‌ బీరు అమ్మకాలు చేయడం లేదని ఫిర్యాదులో వివరించాడు.

సంచలనంగా మారిన కేఎఫ్ బీరు ఫిర్యాదు

సంచలనంగా మారిన కేఎఫ్ బీరు ఫిర్యాదు

బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు ఎగనామం పెట్టి లండన్ చెక్కేసిన విజయ్ మాల్యాను భారత్‌కు తిరిగి రప్పించడానికి అధికారులు ఓ వైపు నానా తంటాలు పడుతుంటే.. తెలంగాణకు చెందిన కింగ్‌ఫిషర్ లవర్ ఆ బ్రాండ్ అమ్మకాల కోసం ప్రభుత్వానికే అర్జీ పెట్టుకోవడం సంచలనంగా మారింది. అనేక సమస్యలపై ప్రజలు ఫిర్యాదు చేసేందుకు ఏర్పాటుచేసిన ప్రజావాణి కార్యక్రమంలో బీరుపై ఫిర్యాదు రావడంతో అధికారులతోపాటు పట్టణవాసులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఈ ఫిర్యాదు అందుకున్న అధికారులు దాన్ని అబ్కారీ శాఖకు బదిలీ చేశారు.

కేఎఫ్ బీర్ల ఎందుకు అమ్మడం లేదు?

కేఎఫ్ బీర్ల ఎందుకు అమ్మడం లేదు?

కాగా, జగిత్యాలతో పాటు మరికొన్ని మండలాల్లో కింగ్ ఫిషర్ బీర్ విక్రయించడంలేదంటూ పట్టణానికి చెందిన అయిల సూర్యనారాయణ(టీవీ సూర్యం) తన ఫిర్యాదులో ఆవేదన వ్యక్తం చేశాడు. మద్యం విక్రయదారులు సిండికేటుగా మారి స్థానిక వైన్‌షాప్‌లు, బార్ అండ్ రెస్టారెంట్లలో కొన్నేళ్లుగా కింగ్ ఫిషర్ బీర్ల అమ్మకాలను నిలిపివేశారని ఆయన ఆరోపించారు. తమ ఫేవరేట్ బీర్ అమ్మకాలను తిరిగి ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలంటూ జగిత్యాల కలెక్టర్‌కు ప్రజావాణిలో సోమవారం (సెప్టెంబర్ 24) ఫిర్యాదు చేశారు.

ఎంతో ఇష్టంగా సేవించే ఆ బీరే అమ్మకపోతే ఎలా?

ఎంతో ఇష్టంగా సేవించే ఆ బీరే అమ్మకపోతే ఎలా?

మద్యం ప్రియులు.. ముఖ్యంగా యువత ఎక్కువగా ఇష్టపడి సేవించే బీర్లలో కింగ్ ఫిషర్‌దే మొదటి స్థానమని, ఈ బీర్ల విక్రయం ద్వారా ప్రభుత్వానికి ఆదాయం కూడా దండిగా సమకూరుతుందని సూర్యం వివరించారు. కానీ, జగిత్యాలలో కింగ్ ఫిషర్ బీరు విక్రయాలను నిలిపేసి వాటి స్థానంలో నాసిరకం బీరును అమ్ముతూ కొనుగోలుదారులను మోసం చేస్తున్నారని వివరించారు. పొరుగున కరీంనగర్‌లో కింగ్ ఫిషర్ బీర్ యథేచ్చగా దొరుకుతుండగా జగిత్యాలలో ఈ గడ్డు పరిస్థితికి కారణమేంటని సూర్య నారాయణ ప్రశ్నించారు.

రాజ్యాంగాన్ని ప్రస్తావించిన ఫిర్యాదుదారుడు

రాజ్యాంగాన్ని ప్రస్తావించిన ఫిర్యాదుదారుడు

అంతేగాక, ‘భారత రాజ్యాంగంలోని ఆర్టికల్-19 ద్వారా సంక్రమించిన ప్రాథమిక హక్కులలోని స్వేచ్ఛతో కూడిన కొనుగోలు హక్కుకు మద్యం విక్రయదారులు భంగం కలిగిస్తున్నారు. జగిత్యాల పట్టణం, పలు మండలాల్లో ఏ నెల నుంచి కింగ్ ఫిషర్ బీర్లను విక్రయించడం నిలిపివేశారనే అంశంపై విచారణ జరిపించాలి. మద్యం డిపోల్లో స్థానిక మద్యం వ్యాపారులు, కింగ్ ఫిషర్ కోటాను కొనుగోలు చేయకపోవడంపై విచారణ జరిపి మద్యం వ్యాపారులపై చర్యలు తీసుకోవాలి. కింగ్ ఫిషర్ బీర్లను మద్యం ప్రియులకు అందుబాటులోకి తేవాలని కోరుతున్నా' అని సూర్యం తన పిర్యాదులో పేర్కొన్నారు.

 కేఎఫ్ బీర్లు ఎందుకు అమ్మడం లేదంటే..?

కేఎఫ్ బీర్లు ఎందుకు అమ్మడం లేదంటే..?


కాగా, ఈ విషయాన్ని ఎక్సైజ్ సూపరింటెండెంట్ దృష్టికి తీసుకెళ్లినట్లు జగిత్యాల కలెక్టర్ శ్రీధర్ తెలిపారు. ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీధర్‌ను ఈ విషయంపై వివరాలు కోరగా.. మద్యం వ్యాపారులు రెండేళ్లుగా జగిత్యాలలో కింగ్ ఫిషర్ బీరు అమ్మకాలను నిలిపేసినట్లు తెలిపారు. వీటిని విక్రయించకపోవడానికి పలు కారణాలు ఉన్నాయని తెలిపారు. కింగ్ ఫిషర్ బీర్‌లో దుమ్ము కణాలు వచ్చినట్లు గతంలో ఫిర్యాదు అందిందని ఎక్సైజ్ సూపరింటెండెంట్ తెలిపారు. దీంతోపాటు మిగతా బీర్లతో పోలిస్తే కింగ్ ఫిషర్ బీరు బాటిళ్లు తేలిగ్గా పగిలిపోతాయని, మిగిలిన స్టాక్‌ను తిరిగి తీసుకోవడంలో కింగ్ ఫిషర్ సంస్థ తాత్సారం చేస్తోందని మద్యం వ్యాపారులు ఆరోపిస్తున్నట్లు ఆయన వివరించారు. ఈ కారణంగానే రెండేళ్లుగా జగిత్యాలలో వ్యాపారులు ఈ బ్రాండ్ బీర్ల అమ్మకాలు నిలిపేసినట్లు వెల్లడించారు. ఓ బ్రాండ్ అమ్మకాల గురించి మద్యం అమ్మకందారులపై ఒత్తిడి చేయలేమని, అయితే, ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు.

English summary
Aila Suryanarayana of Jagtial town surprised district collector Sridhar by making a formal complaint about the non-availability of Kingfisher beer in bars and wine shops for over two years.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X