• search
 • Live TV
నిజామాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

తెలంగాణలో ఇప్పుడిదే హాట్ టాపిక్.. కేసీఆర్‌ను గట్టిగా ఢీకొడుతున్న మల్లన్న.. కొరుకుపడని కొయ్యలా...

|

జర్నలిస్టు నవీన్ కుమార్ అలియాస్ తీన్మార్ మల్లన్నపై దాడి తెలంగాణలో హాట్ టాపిక్‌గా మారింది. గత కొద్ది నెలలుగా సోషల్ మీడియాలో అనేక సమస్యలపై ఆయన ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తూ వస్తున్నారు. ప్రభుత్వ పథకాలు మొదలు పాలనపై ఆయన పలుమార్లు సంచలన ఆరోపణలు చేశారు. మొదట్లో కొద్దిపాటి వ్యూస్‌తో మొదలైన ఆయన యూట్యూబ్ ఛానెల్.. అనతి కాలంలోనే 4లక్షల పైచిలుకు ఫాలోవర్స్‌ను సంపాదించుకుంది. ముఖ్యంగా కరోనా మొదలయ్యాక... మల్లన్నకు జనంలో ఆదరణ మరింత పెరిగింది.

ప్రతీరోజూ ఆయన బయటపెడుతున్న విషయాలు,ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న తీరు చాలామందిని ఆలోచింపజేసేలా మారింది. తెలుగులో ప్రముఖ టీవీ చానెల్స్‌ను తలదన్నే రీతిలో ఆయన లైవ్స్‌కు వ్యూయర్‌షిప్ ఉండటం గమనార్హం. మొత్తం మీద తెలంగాణలో తనకంటూ ఓ సైన్యాన్ని ఏర్పరుచుకున్న మల్లన్న ప్రభుత్వానికి కొరకరాని కొయ్యలా తయారయ్యాడు.

ఆర్మూర్‌లో కేసు..

ఆర్మూర్‌లో కేసు..

ఇటీవలి కాలంలో మల్లన్న ప్రభుత్వంపై చేసిన పలు ఆరోపణలు,వ్యాఖ్యానాలకు ఆయనపై వివిధ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో శనివారం(జూలై 11) ఆయనకు ఆర్మూర్ పోలీసులు 41సీఆర్పీసీ కింద నోటీసులిచ్చారు. దీంతో ఆదివారం ఆర్మూర్ పోలీసుల ఎదుట హాజరయ్యేందుకు లాయర్‌తో కలిసి ఆయన తన వాహనంలో బయలుదేరారు. అయితే మార్గమధ్యలో ఇందల్వాయి టోల్‌ గేటు వద్ద పోలీసులు మల్లన్న వాహనాన్ని ఆపారు.

మల్లన్నపై దాడి...?

మల్లన్నపై దాడి...?

పోలీసులు మల్లన్న వాహనాన్ని నిలిపివేసిన సమయంలో కొంతమంది వ్యక్తులు కారు వద్దకు వచ్చి... మల్లన్నకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కారు అద్దాలపై పిడిగుద్దులు కురిపించారు. అయితే పోలీసులు వెంటనే వారిని అడ్డుకుని మల్లన్న వాహనానికి క్లియరెన్స్ ఇచ్చారు. అయితే నోటీసుల్లో పేర్కొన్నట్లు ఆర్మూర్ పోలీస్ స్టేషన్‌కు కాకుండా డిచ్‌పల్లి పోలీస్ స్టేషన్‌కు రావాలని చెప్పారు. మల్లన్న మద్దతుదారులు అప్పటికే పెద్ద ఎత్తున ఆర్మూర్ పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారన్న ప్రచారం నేపథ్యంలో... అక్కడ శాంతిభద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉందన్న కారణంతో డిచ్‌పల్లి పోలీస్ స్టేషన్‌కు రావాలని కోరారు.

మల్లన్న ఏమన్నారు...?

మల్లన్న ఏమన్నారు...?

పోలీసులు చెప్పినట్లుగానే మల్లన్న తన లాయర్‌తో కలిసి డిచ్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో హాజరయ్యారు. అక్కడ విచారణ అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. పోలీసులకు తాము సహకరించామని, పోలీసులు కూడా తమకు రక్షణ కల్పిస్తూ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారని చెప్పారు. ఇందల్వాయి టోల్ గేట్ వద్ద తమపై ఆర్మూర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మనుషులు దాడి చేశారని ఆరోపించారు. కారుపై రాళ్లు రువ్వారని,అద్దాలపై పిడిగుద్దులు కురిపించారని ఆరోపించారు. కాబట్టి వాళ్లపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. అలాగే తమకు రక్షణ కల్పించాలని కోరామన్నారు.

రాజకీయాలకు అతీతంగా దాడిని ఖండించిన నేతలు...

రాజకీయాలకు అతీతంగా దాడిని ఖండించిన నేతలు...

మల్లన్నపై దాడిని పార్టీలకు అతీతంగా చాలామంది ఖండిస్తున్నారు. సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ,తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం,బీజేపీ నేత బొడిగె శోభ,కాంగ్రెస్ నేత మానవతారాయ్,పలువురు విద్యార్థి నాయకులు,సోషల్ మీడియాలో పలువురు నెటిజెన్స్ దాడిని ఖండించారు. తెలంగాణలో ప్రశ్నించే గొంతుగా ఎదిగను మల్లన్నపై దాడులకు పాల్పడటం,వేధింపులకు గురిచేయడం సరికాదని అభిప్రాయపడుతున్నారు.

అరవింద్‌పై దాడి... మల్లన్నపై బీజేపీ ముద్ర...?

అరవింద్‌పై దాడి... మల్లన్నపై బీజేపీ ముద్ర...?

మల్లన్నపై దాడి జరిగిన రోజే వరంగల్‌లో ఎంపీ ధర్మపురి అరవింద్‌పై దాడి జరగడం గమనార్హం. ఇక్కడ కూడా టీఆర్ఎస్ నాయకులే దాడికి పాల్పడ్డారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే మల్లన్నపై దాడి ఖండించినవాళ్లలో కొంతమంది అరవింద్‌పై దాడిని కూడా ఖండించగా.. కొంతమంది మాత్రం దాన్ని అంతగా పట్టించుకోలేదు. ఇక్కడే సోషల్ మీడియాలో కొన్ని ఆసక్తికర కామెంట్స్ కనిపించాయి. 'ఇద్దరూ ఒకే సామాజిక వర్గానికి చెందినవాళ్లు.. ఒకరు అధికారికంగా బీజేపీ.. మరొకరు అనధికారికంగా బీజేపీ.' అన్న వ్యాఖ్యలు కనిపించాయి. నిజానికి మల్లన్న మొదటినుంచి బహుజనవాదాన్ని గట్టిగా వినిపిస్తూ వస్తున్నాడు. ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనారిటీల ఐక్యతతో రాజ్యాధికారం సాధించాలని చెప్తున్నాడు. అంబేడ్కర్ మార్గంలో ఆధిపత్య దురహంకారాలను ప్రశ్నిస్తున్నాడు. ఇలాంటి తరుణంలో ఆయనపై బీజేపీ ముద్ర వేసే ప్రయత్నం రాజకీయ కుట్రలో భాగమా... లేక ఆ వ్యాఖ్యలకు ఇప్పటికే ప్రాతిపదిక ఉందా.. అన్నది చర్చనీయాంశం.

  Former MP, Kalvakuntla Kavitha Helps A Tribal Student
  వ్యూహాత్మకంగా బీజేపీ...? జనం నోళ్లలో మల్లన్న..

  వ్యూహాత్మకంగా బీజేపీ...? జనం నోళ్లలో మల్లన్న..

  2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ 4 సీట్లు గెలుచుకోవడం ఆ పార్టీకి బిగ్ బూస్టింగ్ అయింది. దీంతో తెలంగాణలో తాము బలపడగలం అన్న నమ్మకం ఏర్పడింది. ఈ క్రమంలోనే అధ్యక్షుడిగా బండి సంజయ్‌కి పగ్గాలు అప్పగించింది. ప్రస్తుతం తెలంగాణలో రాజకీయ సమీకరణాలను పరిశీలిస్తే... వెలమ వర్సెస్ రెడ్లు అన్నది బహిరంగ సత్యం. ఈ రెండు పార్టీలకు చెక్ పెట్టాలంటే.. తెలంగాణలో సామాజిక సమీకరణాలను ప్రభావితం చేయాలని బీజేపీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో బీసీ కులాల్లో బలంగా కనిపిస్తున్న మున్నూరు కాపు సామాజిక వర్గాన్ని ఏకం చేసి.. తద్వారా బీసీలందరినీ తమవైపుకు తిప్పుకోవాలన్న ఆలోచనలో ఉందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. 2024 ఎన్నికల వరకు టీఆర్ఎస్,కాంగ్రెస్‌లోని మున్నూరు కాపు నేతలను బీజేపీ వైపు ఆకర్షించే ప్రయత్నం జరగవచ్చునన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మాజీ బీజేపీ అధ్యక్షుడు కె.లక్ష్మణ్, ప్రస్తుత బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా ఇదే సామాజికవర్గానికి చెందినవారు కావడం వ్యూహాత్మకమే అన్న అభిప్రాయాలున్నాయి. ఈ నేపథ్యంలోనే అదే సామాజికవర్గానికి చెందిన తీన్మార్ మల్లన్నకు కూడా బీజేపీ రంగు అంటిస్తున్నారా... అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే మల్లన్న మాత్రం తాను ఇండిపెండెంట్‌గానే పోటీ చేస్తానని పలుమార్లు ప్రకటించుకున్నాడు. ఏదేమైనా మల్లన్న జనం నోళ్లలో నానుతున్నాడు. ఆయన చెప్తున్న విషయాలు ఎక్కువగా ప్రచారంలోకి వస్తున్నాయి. అయితే ఇవన్నీ 2024 ఎన్నికల్లో ఆయనకు ఎంతవరకూ తోడ్పడుతాయో వేచి చూడాలి.

  English summary
  Journalist Naveen Kumar alias Teenmar Mallanna given a complaint to Indalwai police,alleged that TRS workers attacked him at Indalwai toll gate near Armoor in Nizamabad district.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X