హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఒకే వేదికపై ఇద్దరు: కేసీఆర్ నోట చంద్రబాబు మాట, మోగిన చప్పట్లు

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇద్దరు 'చంద్రులు' మరోసారి కలిశారు. ఈ అరుదైన దృశ్యానికి హైదరాబాద్‌లోని మారియట్ హోటల్‌ వేదికగా నిలిచింది. వివరాల్లోకి వెళితే... తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లోని న్యాయాధికారులతో రెండు రోజులపాటు నిర్వహించే సమావేశం శనివారం ఉదయం నగరంలోని మారియట్‌ హోటల్‌లో ప్రారంభమైంది.

ఈ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, కేసీఆ‌ర్‌లతో పాటు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఎ.ఆర్.దవే, జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఎన్.వి.రమణ, ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి దిలీప్ భోస్లేతో పాటు గుజరాత్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌. సుభాష్‌రెడ్డి తదితరులు హాజరయ్యారు.

Judges seminar started in Hyderabad

ముందుగా చంద్రబాబు, కేసీఆర్‌లు ఇతర న్యాయమూర్తులతో కలిసి జ్యోతి వెలిగించి సదస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందు మాట్లాడారు. నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతిలో అధునాతన హైకోర్టుని నిర్మిస్తామని చెప్పారు.

రాష్ట్రంలోని అన్ని కోర్టులకు మౌలిక వసతులను కల్పిస్తామని తెలిపారు. కోర్టులు సైతం అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు. గతంలో చైనాను ప్రస్తావించేవారు. ప్రస్తుతం భారత్‌ పేరు ప్రముఖంగా వినిపిస్తోందన్నారు. ఆ తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగించారు.

Judges seminar started in Hyderabad

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పేరుని ప్రస్తావించగా సభలో చప్పట్లు మారుమ్రోగాయి. ఈ కార్యక్రమానికి చొరవ తీసుకున్న న్యాయమూర్తులకు కేసీఆర్ ధన్యవాదాలు తెలిపారు. కోర్టుల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయాల్సి అవసరాన్ని ఆయన ప్రస్తావించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం ఉందని సీఎం కేసీఆర్ చెప్పారు.

దేశ పురోభివృద్ధిలో న్యాయవ్యవస్థ పాత్ర కీలకమన్న ఆయన.. ఎవరికివారు సమర్థవంతంగా పనిచేయటం వల్లే దేశ పురోభివృద్ధి సాధ్యమన్నారు. అనంతరం సుప్రీం కోర్టు న్యాయమూర్తి ఎన్.వి. రమణ మాట్లాడుతూ న్యాయ సేవ.. సమాజ సేవ లాంటిదని అన్నారు. న్యాయం ఎక్కడ ఉంటుందో అక్కడ విజయం తథ్యమని భగవద్గీత చెబుతోందన్నారు.

న్యాయం అందించటంలో పేదలు, ధనికులు అనే తారతమ్యం ఉండదన్నారు. ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్ మంచి విజన్‌తో పనిచేస్తున్నారని అన్నారు. మాతృభాష, మాతృభూమిని ఎప్పటికీ మరువకూడదంటూ గురజాడ సూక్తులను చదివి వినిపించారు. తెలుగు రాష్ట్రాల న్యాయాధికారుల సదస్సులో పాలుపంచుకోవటం సంతోషకరంగా ఉందన్నారు.

ఈ సదస్సు శనివారం, ఆదివారం రెండు రోజుల పాటూ జరగనుంది. 2006లో చివరిగా ఈ సదస్సు జరిగింది. మళ్లీ పదేళ్ల తర్వాత ఈ సదస్సు ఇప్పుడు హైదరాబాద్‌లో జరుగుతోంది. కేసులను త్వరగా పరిష్కరించడమే ప్రధాన ఎజెండాగా ఈ సదస్సు ప్రారంభమైంది.

English summary
Judges seminar started in Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X