కాకతీయుల వైభవం చాటేలా కాకతీయ ఉత్సవాలు: జులై7నుండి 14వతేదీ వరకు: మంత్రి శ్రీనివాస్ గౌడ్
జూలై 7వ తేదీ నుండి 14వ తేదీ వరకు కాకతీయ ఉత్సవాలు వారం రోజుల పాటు అత్యంత వైభవోపేతంగా జరిపించేందుకు తెలంగాణ ప్రభుత్వం విధివిధానాలను రూపకల్పన చేస్తున్నట్లు రాష్ట్ర ఎక్సైజ్ ,పర్యాటక, యువజన క్రీడల సాంస్కృతిక శాఖమంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. బుధవారం నాడు హన్మకొండ, వరంగల్ జిల్లాల పర్యటనలో భాగంగా పద్మాక్షమ్మ ఆలయం దర్శనం అనంతరం, ఖిల్లా వరంగల్, పోర్టు ప్రాంతాన్ని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, స్థానిక శాసనసభ్యులు నన్నపనేని నరేందర్, సంబంధిత ప్రజాప్రతినిధులు జిల్లా అధికారులతో కలిసి మంత్రి శ్రీనివాస్ గౌడ్ పరిశీలించారు.

కాకతీయుల కాలం నాటి పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం : మంత్రి శ్రీనివాస్ గౌడ్
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక ప్రాంతాల అభివృద్ధి దిశగా అడుగులు వేస్తుందని, సీఎం కేసీఆర్ వరంగల్ పర్యాటక ప్రాంతాన్ని అభివృద్ధి దిశగా ముందుకు తీసుకుపోవాలని ధృడ సంకల్పంతో ఉన్నారని తెలిపారు. 700 సంవత్సరాల చరిత్ర గల కాకతీయుల కాలం నాటి అద్భుత కళా నైపుణ్యాలకు ప్రతీకగా ప్రసిద్ధికెక్కిన పర్యాటక ప్రాంతాలను పర్యాటకులను ఆకర్షించే విధంగా అభివృద్ధి చేయటంలో తెలంగాణ ప్రభుత్వం కీలక పాత్ర పోషిస్తుందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు.

రామప్పకు యునెస్కో గుర్తింపుకు సీఎం కేసీఆర్ కృషి
ప్రపంచంలో అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ నిర్మించిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని కొనియాడారు. రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపు తీసుకురావడానికి సీఎం కేసీఆర్ ఎంతగానో కృషి చేశారని తెలిపారు. కాకతీయుల కాలం నాటి కట్టడాలు, దేవాలయాలు అంతరించి పోకుండా కాపాడుతానని మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. చక్కని శిల్ప కళా నైపుణ్యంతో రాతి కట్టడంగా యాదాద్రి దేవాలయం సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో రూపుదిద్దుకుందని, ప్రసిద్ధిగాంచింది అని మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు

వారం రోజుల కాకతీయ ఉత్సవాల్లో కాకతీయుల వారసుడికి ఆహ్వానం
కాకతీయుల గొప్ప వారసత్వ సంపద కొనసాగింపు చేస్తూ వారం రోజుల పాటు జరిపే కాకతీయ వారోత్సవాల్లో మొదటిరోజు కాకతీయుల రాజ వంశీయులైన బస్తర్‌లో ఉన్న కాకతీయుల వారసుడు కమల్‌చంద్ర భంజ్‌దేవ్‌ను ప్రభుత్వం అధికారికంగా ఆహ్వానించాలని నిర్ణయించినట్లు తెలిపారు. కాకతీయుల వారోత్సవాల్లో భాగంగా జూలై 7వ తారీఖున భద్రకాళి దేవాలయం నుండి కళాకారుల డప్పు చప్పుళ్ళతో, నృత్యాలతో ఊరేగింపుగా ఖిల్లా వరంగల్ పోర్టు వరకు ఉత్సవాల ప్రారంభోత్సవ ర్యాలీ ఉంటుందని చెప్పారు.

కాకతీయుల చెరువులే స్పూర్తిగా మిషన్ కాకతీయ
కాకతీయులు తవ్వించిన గొలుసుకట్టు చెరువుల స్ఫూర్తితో మిషన్ కాకతీయ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టి విజయవంతం చేయడం జరిగిందని అన్నారు.భద్రకాళి దేవాలయం, వేయి స్తంబాల దేవాలయం, రామప్ప దేవాలయాలను సుందరంగా తీర్చి దిద్దుతున్నామని అన్నారు.ఉత్సవాలలో భాగంగా కవులు, కళాకారులతో కాకతీయుల పేరిణి శివతాండవం, వివిధ కళా రూప ప్రదర్శన నిర్వహిస్తామని తెలిపారు. ఈ డిసెంబరు నాటికి కాళోజీ కళా కేంద్రం పూర్తి చేస్తామన్నారు. కవులకు కళాకారులకు ఓరుగల్లు నిలయం అని అన్నారు.

పర్యాటక శాఖాధికారులకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆదేశాలు
హైదరాబాద్ నగరం తరువాత రెండవ అతి పెద్ద నగరం వరంగల్ అని నగర అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం శ్రద్ద వహిస్తు న్నట్లు తెలిపారు. పర్యటక,సాంస్కృతిక శాఖలకు సంబంధించి వివిధ పెండిగ్ పనులు వెంటనే పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. పనులలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని సూచించారు.

కాకతీయుల వైభవాన్ని చాటేలా కాకతీయ ఉత్సవాలు
ఈ కాకతీయుల వారోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించడం కోసం విధి విధానాలు రూపొందించడం కొరకు కేటీఆర్ దిశానిర్దేశం లో పని చేస్తున్నామని తెలిపారు. కేటీఆర్ సూచనలు సలహాల మేరకు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మాత్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు ,ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ ,స్థానిక శాసనసభ్యులు నన్నపనేని నరేందర్ , మేయర్ గుండు సుధారాణి, వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ బి గోపి తో పాటు కార్పొరేటర్లతో సంప్రదించు కుని ప్రణాళిక రూపొందించి కాకతీయుల వైభవాన్ని చాటే విధంగా వారోత్సవాలు నిర్వహిస్తామని చెప్పారు.