కేసీఆర్ నాయకుడు అయ్యింది ఎన్టీఆర్ వల్లే... కృతజ్ఞత ఉంటే రుణం తీర్చుకో .. బీజేపీ నేత సూచన
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, తెలుగుజాతి కీర్తిని నలుదిశలా వ్యాపింపజేసిన మహానటుడు దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఎన్టీఆర్ కుటుంబ సభ్యులతో పాటు, ఎన్టీఆర్ అభిమానులు, తెలుగుదేశం పార్టీ నేతలు నందమూరి తారక రామారావుకు ఘనంగా నివాళులు అర్పిస్తున్నారు. నేడు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ ను పూలతో అలంకరించారు. ఎన్టీఆర్ 25 వ వర్ధంతి సందర్భంగా ఇప్పటి బీజేపీ నేత, ఒకప్పటి టిడిపి నేత మోత్కుపల్లి నర్సింహులు ఎన్టీఆర్ ఘాట్ లో ఎన్టీఆర్ కు నివాళులర్పించారు.

కెసిఆర్ ముఖ్యమంత్రి అవ్వడానికి కారణం ఎన్టీఆర్... మరచిపోయిన కేసీఆర్ .. మోత్కుపల్లి ఫైర్
ఈ సందర్భంగా ఆయన తెలంగాణ సీఎం కేసీఆర్ పై తీవ్ర పదజాలంతో విమర్శల వర్షం కురిపించారు. కెసిఆర్ నాయకుడు అయ్యింది ఎన్టీఆర్ వల్లనే అంటూ పేర్కొన్న మోత్కుపల్లి నర్సింహులు, కెసిఆర్ కు కనీసం ఆ కృతజ్ఞత ఉంటే ఎన్టీఆర్ ఘాట్ కు వచ్చి ఆ మహానుభావునికి నివాళులు అర్పించాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ ఎన్నో పాపాలు చేస్తున్నాడని, కెసిఆర్ ముఖ్యమంత్రి అవ్వడానికి కారణం ఎన్టీఆర్ అనే విషయాన్ని మరిచి పోతున్నాడని విమర్శించారు.

ఎన్టీఆర్ రుణం తీర్చుకోవాలని కెసిఆర్ కు హితవు
ఎన్టీఆర్ జయంతి, వర్ధంతి లను అధికారికంగా నిర్వహించి ఎన్టీఆర్ రుణం తీర్చుకోవాలని కెసిఆర్ కు హితవుపలికారు మోత్కుపల్లి నర్సింహులు. సీఎం కేసీఆర్ ఎన్టీఆర్ పేరును తన కుమారుడికి పెట్టుకున్నారని గుర్తు చేసిన మోత్కుపల్లి నర్సింహులు ఇప్పుడు కేసీఆర్ ఎన్టీఆర్ ను మర్చిపోయారు అంటూ విమర్శించారు. తనలాంటి వారి మాటలు ముఖ్యమంత్రి వరకు చేరడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
ఎన్టీఆర్ రాజకీయాలకు కొత్త నిర్వచనం ఇచ్చిన మహనీయుడు అంటూ కితాబిచ్చారు మోత్కుపల్లి నర్సింహులు.

తాను ఎన్టీఆర్ శిష్యుడిగా ఉండడం గర్వకారణమని చెప్పుకున్న మోత్కుపల్లి
తిండి లేని వారికి ఆహారం పెట్టి, ఇల్లు లేని వారికి ఇళ్ళు ఇచ్చిన రాజకీయ వ్యవస్థలో నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టిన ఎన్టీఆర్ ఎన్నో సంస్కరణలతో తనదైన పాలన సాగించారని మోత్కుపల్లి నర్సింహులు గుర్తు చేశారు. పేద బడుగు బలహీన వర్గాలకు ఎన్టీఆర్ ఎంతో చేశారని గుర్తు చేసిన ఆయన, తాను ఆయన శిష్యుడిగా ఉండడం గర్వకారణమని పేర్కొన్నారు. సూర్యచంద్రులు ఉన్నంతవరకు ఎన్టీఆర్ పేరు నిలిచి ఉంటుందని, ఆయనను ఎవరూ మరిచిపోలేరు అని గుర్తు చేశారు.

ఎన్టీఆర్ కు భారత రత్న ఇవ్వాలని బీజేపీని కోరతా
ఎన్టీఆర్ సంస్కరణలు నేటికీ అన్ని పార్టీలు అమలు చేస్తున్నాయని పేర్కొన్న మోత్కుపల్లి నర్సింహులు బీసీలకు రిజర్వేషన్లు, మహిళలకు ఆస్తిలో హక్కు కల్పించిన మహనీయుడు ఎన్టీఆర్ అని పేర్కొన్నారు. ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలని తమ పార్టీ దృష్టికి తీసుకెళ్తానని మోత్కుపల్లి తెలిపారు. జాతీయ పార్టీ లతో పోటీ పడిన వ్యక్తి, తెలుగు జాతి ఖ్యాతిని చాటి చెప్పిన వ్యక్తి ఎన్టీఆర్ అని మోత్కుపల్లి నర్సింహులు పేర్కొన్నారు.