వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎన్టీఆర్‌కు సన్నిహితుడు: కెసిఆర్, బాబు సంతాపం, సినారె చివరి మాట ఇదే...

సినారె మృతి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, కెసిఆర్ సంతాపం ప్రకటించారు. ఆయన సేవలను వారు కొనియాడారు.

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ప్రముఖ సాహితీవేత్త సి. నారాయణ రెడ్డి మృతికి ఎల్లలోకం సంతాపం ప్రకటించింది. తెలుగు సాహిత్య ప్రపంచం విషాద సముద్రంలో మునిగిపోయింది. తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సినారె మృతికి సంతాపం ప్రకటించారు.

ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డితో పాటు పలువురు రాజకీయ నాయకులు ఆయన మృతికి సంతాపం ప్రకటించారు. ఆయన భౌతికకాయాన్ని హైదరాబాదులోని పుప్పాలగుడాలో గల ఆయన నివాస గృహానికి తరలించారు.

తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిధారెడ్డి, తెలుగు విశ్వవిద్యాలయం మాజీ వైస్ చాన్సలర్ ఎన్ గోపి తదితరులు ఆయన మృతికి సంతాపం ప్రకటించారు. ఓ కుటుంబ సభ్యుడిని కోల్పోయిన దిగులు వ్యక్తం చేశారు.

సినారె కృషి మరిచిపోలేనిది: కెసిఆర్

సినారె కృషి మరిచిపోలేనిది: కెసిఆర్

జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత డాక్టర్ సి.నారాయణరెడ్డి మరణం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. భగవంతుడు ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని ప్రార్ధించారు. సాహిత్య రంగంలో సీనారే చేసి కృషి ఎప్పటికీ మరిచిపోలేనిదని ఆయన చెప్పారు. అధ్యాపకుడిగా, సాహితీవేత్తగా, కవిగా, సినీ గేయ రచయితగానే కాకుండా రాజ్యసభ సభ్యుడిగా కూడా ఆయన సేవలందించారని ముఖ్యమంత్రి గుర్తు చేసుకున్నారు. అత్యంత ప్రతిష్టాత్మకమైన జ్ఞానపీఠ్ అవార్డుతో పాటు అనేక అవార్డులు అందుకున్న తెలంగాణ బిడ్డ సీనారే కలం నుంచి వచ్చిన అనేక పద్య కావ్యాలు, గేయ వ్యాక్యాలు, వచన కవితలు, కథనాలు, బుర్రకథలు, గజళ్లు ఆయనను ఎప్పటికీ గుర్తుంచుకునేలా చేస్తాయని కెసిఆర్ అన్నారు.

ఎన్టీఆర్‌తో సన్నిహత సంబంధాలు: చంద్రబాబు

ఎన్టీఆర్‌తో సన్నిహత సంబంధాలు: చంద్రబాబు

ప్రముఖ రచయిత, జ్ఞాన్ పీఠ్ అవార్డ్ గ్రహీత సి. నారాయణరెడ్డి మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. జ్ఞానపీఠ్‌ పురస్కారానికే వన్నె తెచ్చిన మహా రచయిత సినారె అని, రచయితగా, రాజ్యసభ సభ్యుడిగా సినారె అందించిన సేవలు చరిత్రలో నిలిచిపోతాయని చంద్రబాబు చెప్పారు. తెలుగు చలనచిత్ర రంగంలో సినారె పాటలు ఆణిముత్యాలు అని ఆయన కొనియాడారు. ఎన్టీ రామారావుకు ఆయనతో సన్నిహిత సంబంధాలు ఉండేవని ఆయన గుర్తు చేసుకున్నారు.

ఆణిముత్యాన్ని కోల్పోయింది: వెంకయ్య

ఆణిముత్యాన్ని కోల్పోయింది: వెంకయ్య

సినారె మృతికి కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు సంతాపం తెలిపారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. తెలుగు సాహిత్యలోకం ఒక ఆణిముత్యాన్ని కోల్పోయిందని ఆయన అన్నారు. తెలుగు సాహిత్య రంగానికి సినారె రారాజు అని, సినారె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్లు వెంకయ్యనాయుడు తెలిపారు.
ఇదిలా ఉంచితే.. గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సినారె కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం కన్నుమూసిన విషయం తెలిసిందే.

చివరి మాట ఇదే: సిధారెడ్డి

చివరి మాట ఇదే: సిధారెడ్డి

సినారె మృతికి తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిద్దారెడ్డి సంతాపం ప్రకటించారు. ఈనెల 7న తెలంగాణ సారస్వత పరిషత్తు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని నిర్వహించిందని, ఆ సభకు ముఖ్య అతిథిగా సినారె హాజరయ్యారని తెలిపారు. కానీ నాటి సభలో ఆయన సరిగా మాట్లాడలేకపోయారన్నారని ఆయన గుర్తు చేసుకున్నారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏ సభలోనూ ఆయన మౌనంగా ఉండలేదని సిద్దారెడ్డి తెలిపారు. అదే రోజు ఒకే ఒక్క వాక్యం వెలువడిందని.. 'నా అధ్యక్ష స్థానాన్ని రమణాచారి నిర్వహిస్తారు' అని చెప్పారని, ఇదే ఆయన సభల్లో చివరి మాట అని సిద్దారెడ్డి చెప్పారు. శేషాద్రి రమణ కవుల గురించి ప్రచురించిన పుస్తకాన్ని సినారే ఆవిష్కరించాల్సి ఉందని, కానీ అందుకు కూడా సత్తువ లేకపోవడంతో నందిని సిద్దారెడ్డి ఆవిష్కరిస్తారని పేర్కొన్నారని తెలిపారు. సినారె ఆవిష్కరించాల్సిన పుస్తకం తాను ఆవిష్కరించడమేంటని, ఆరోజే తనకు కొంచెం బాధ అనిపించిందని తెలిపారు.

దిగ్భ్రాంతికి గురిచేసింది: జగన్

దిగ్భ్రాంతికి గురిచేసింది: జగన్

ప్రముఖ తెలుగు కవి, జ్ఞాన్‌పీఠ్ అవార్డు గ్రహిత సి. నారాయణరెడ్డి మరణం తెలుగుజాతికి తీరని లోటని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. సినారె మృతిపట్ల వైఎస్‌ జగన్‌‌తో పాటు పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు. సినారె మరణవార్త తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని ఆయన అన్నారు. రైతు కుటుంబంలో జన్మించిన సినారె తెలుగు సాహితీ రంగంలో రారాజుగా ఎదిగారని నారాయణ రెడ్డి సేవలను జగన్ కొనియాడారు. సినారె విడిచివెళ్లిన జ్ఞాపకాలు ఎప్పటికీ చెరిగిపోనివని జగన్ అన్నారు.

మనసులు దోచుకున్నారు: హరీష్ రావు

మనసులు దోచుకున్నారు: హరీష్ రావు

నన్ను దోచుకుందువటే వన్నెల దొరసాని అని అంటూ తెలుగు ప్రజల మనసులు దోచుకుని ఇక సెలవంటూ నింగికెగసిన ప్రముఖ రచయిత సినారె మృతి పట్ల మంత్రి హరీశ్‌రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. సాహితీ ప్రపంచం ఓ మహా రచయితను కోల్పోయిందన్నారు. తెలుగు సాహిత్యాన్ని సినారె విశ్వవ్యాప్తం చేశారని, సినిమా సాహిత్యానికి సినారె కొత్త నడకలు నేర్పారని మంత్రి కొనియాడారు. తెలుగు సాహిత్యంలో నారాయణ రెడ్డి సేవలు మరువలేనివని, సినారె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్లు ఆయన తెలిపారు.

రఘువీరా సంతాపం

రఘువీరా సంతాపం

ప్రముఖ రచయిత, జ్ఞాన్ పీఠ్ అవార్డ్ గ్రహీత సి. నారాయణరెడ్డి మృతి పట్ల కాంగ్రెస్ నేత రఘువీరారెడ్డి తీవ్ర సంతాపం తెలిపారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. టి. సుబ్బరామిరెడ్డి, మాజీ ఎంపీ కంభంపాటి కూడా సినారె మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సినారె మృతి సాహితీ లోకానికి తీరనిలోటని వారు అన్నారు.

English summary
Andhra Pradesh and Telangana CMs Nara Chandrababu Naidu and K Chandrasekhar Rao condoled the death of C Narayana Reddy (Cinare)
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X