ఫామ్ హౌస్ లో కేసీఆర్ బాగానే ఉన్నారు జనాల పరిస్థితేంటి ? కరోనాపై కుట్రలెవరివి ?.. భట్టి విక్రమార్క
సీఎం కేసీఆర్ కరోనా వైరస్ విషయంలో కుట్రలు జరుగుతున్నాయని చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ నేత మల్లు భట్టి విక్రమార్క మండిపడ్డారు. కరోనా పై కుట్ర చేస్తుంది ఎవరు అంటూ ఆయన సీఎం కెసిఆర్ ను ప్రశ్నించారు . ఇక అంతే కాదు కుట్రలు ఎవరు చేశారు, ఏం చేశారో కూడా బయట పెట్టాలని భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు.

ప్రజలు ఉపాధి కోల్పోతే ఈ కరెంట్ బిల్లుల గోలేంటి ?
ఒక పక్క రాష్ట్రంలో కరోనాకేసులు పెరుగుతూ ఉంటే సీఎం కేసీఆర్ ఫాంహౌస్ లోనో, ప్రగతి భవన్ లోనో క్షేమంగానే ఉన్నారని కానీ రాష్ట్రంలో సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి అని భట్టి విక్రమార్క కెసిఆర్ నిలదీశారు. లాక్ డౌన్ కారణంగా ప్రజలు ఉపాధి కోల్పోయారని, మూడు నెలల కరెంట్ బిల్లు రద్దు చేయాలని డిమాండ్ చేశారు బట్టి విక్రమార్క. అలా కాకుండా రాష్ట్ర ప్రజలకు విపరీతంగా కరెంట్ బిల్లు వేస్తున్నారని, ఇదెక్కడి న్యాయమని ప్రశ్నించారు.

కరోనా విషయంలో రాష్ట్రం చేతులెత్తేసింది
పేదలు కరెంట్ బిల్లు కట్టలేని పరిస్థితిలో ఉన్నారని ఆయన పేర్కొన్నారు. కరోనా కట్టడి చేయడంలో టిఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని భట్టి విక్రమార్క విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో రోజురోజుకీ కరోనాకేసులు పెరుగుతున్నా ప్రభుత్వం కరోనా కట్టడిలో చేతులెత్తేసింది అని ఆయన ఆరోపించారు. ఇక తెలంగాణా రాష్ట్ర సచివాలయం లో ఏం జరుగుతుందో కూడా అర్ధం కాని పరిస్థితి నెలకొందని ఆయన అన్నారు .

ఈ నెల 11వ తేదీన ఛలో సెక్రటేరియట్ ..
ఇక నియంత్రిత సాగు పేరుతో నియంతృత సాగు చేయించాలని చూడటం కరెక్ట్ కాదన్నారు . ప్రభుత్వం సూచించిన పంటలను సాగు చేస్తేనే రైతు బంధు ఇస్తామని చెప్పటం సరైనది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. రైతు బంధు, విద్యుత్ బిల్లుల విషయాలపై మంత్రులను కలిసేందుకుగాను ఈ నెల 11వ తేదీన ఛలో సెక్రటేరియట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు.

కేసీఆర్ ఏది తోస్తే అది చేస్తే ఎలా ?
విద్యుత్ బిల్లులను మూడు వాయిదాల్లో చెల్లించొచ్చని అలా కాకుంటే వడ్డీ చెల్లించాల్సి ఉంటుందన్న మంత్రి జగదీశ్ రెడ్డి వ్యాఖ్యల పట్ల ఆయన మండిపడ్డారు . కరెంట్ బిల్లులపై వడ్డీ వసూలు చేయడం ఏంటని ఆయన ప్రశ్నించారు. లాక్డౌన్ కారణంగా ఆర్థికంగా చితికిపోయిన ప్రజలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ ఏది తోస్తే అది చెయ్యటం కాదని ప్రజల పరిస్థితిని బట్టి స్పందించాలని పేర్కొన్నారు .