'కాళ్లు మొక్కి మోసం చేశాడు, కేసీఆర్‌ను నమ్మేస్థితిలో లేరు': ఇంటిపోరు వల్లే థర్డ్... రేవంత్
హైదరాబాద్: జాతీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్ చేసిందేమీ లేదని, థర్డ్ ఫ్రంట్ అనివార్యమన్న తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి, మధుయాష్కీ స్పందించారు. కేసీఆర్ వ్యాఖ్యల వెనుక అసలు ఉద్దేశ్యం వేరు అని వారు ఎద్దేవా చేశారు.
భయం.. భయం!: 2019 బిగ్ ప్లాన్, కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ వెనుక అసలు కథ ఇదీ!!
ఆయన కేసులకు భయపడి ఇప్పుడు థర్డ్ ఫ్రంట్ అంటున్నారని చెప్పారు. నాలుగేళ్లుగా ప్రధాని మోడీ అంటే గడగడ వణికారని, రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికలతో పాటు పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ వంటి వాటికి మద్దతిచ్చారని గుర్తు చేశారు.

ఇదో కొత్త డ్రామా
ఇప్పుడు మాత్రం ఫెడరల్ ఫ్రంట్ అంటూ కొత్త డ్రామా ఆడుతున్నారని ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో ఒక్క ఎంపీ సీటు గెల్చుకోలేని కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ గురించి మాట్లాడటం విడ్డూరమన్నారు.

కవితతో సహా ఎవరూ గెలవరు
వచ్చే ఎన్నికల్లో కవితతో పాటు తెలంగాణ రాష్ట్ర సమితి లోకసభ అభ్యర్థులు ఎవరు కూడా గెలవరని ఉత్తమ్ అన్నారు. అందుకే ఫెడరల్ ఫ్రంట్ అనే కొత్త నాటకానికి తెరలేపారన్నారు. నాలుగు వేల మంది రైతులు రాష్ట్రంలో ఆత్మహత్యలు చేసుకుంటే పరామర్శించేందుకు వెళ్లని కేసీఆర్ అకస్మాత్తుగా రైతులను ఉద్దరిస్తానని చెబితే ఎవరు నమ్ముతారన్నారు.

అందుకే కేసీఆర్ ఇలా
తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చిన కేసీఆర్, అవినీతి పాలన సాగిస్తున్న కేసీఆర్.. ఇప్పుడు ఇంటి పోరు పడలేక, ప్రజా వ్యతిరేకతను దృష్టి మరల్చేందుకు జాతీయ రాజకీయాల గురించి మాట్లాడుతున్నారని రేవంత్ రెడ్డి అన్నారు.

కాళ్లు మొక్కి మోసం చేశాడు
తెలంగాణ రాష్ట్రం కోసం ఆనాడు సోనియా గాంధీ కాళ్లు మొక్కి మోసం చేసిన కేసీఆర్‌ని ఎవరూ నమ్మే పరిస్థితి లేదని మధుయాష్కీ అన్నారు. ప్రజలను మళ్లీ మోసం చేసేందుకు కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అంటున్నారన్నారు. తన అవినీతి బండారం బయటపడుతుందనే ఉద్దేశంతోనే థర్ఢ్ ఫ్రంట్‌ను తెరపైకి తెస్తున్నారని, తమిళనాడులో శశికళ, బీహార్‌లో లాలూ ప్రసాద్ యాదవ్ మాదిరి కేసీఆర్ జైలుకెళ్లడం ఖాయమన్నారు.
కేసీఆర్ తన రాజకీయ భవిష్యత్ కోసం ఎంతటి నీచ రాజకీయాలకైనా దిగజారుతారని మధుయాష్కీ మండిపడ్డారు. నాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు వ్యతిరేకంగా ఓటేసిన మజ్లిస్ పార్టీతో అంటకాగుతున్నారన్నారు.