వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇదేంటి కేసీఆర్!: రామోజీ ఫిలింసిటీకి 295ఎకరాలా?, ప్రశ్నిస్తోన్న తెలంగాణం..

అటు ప్రాజెక్టులు వారి చేతుల్లోనే పెట్టి.. ఇటు రామోజీరావు లాంటి పెట్టుబడిదారులకు ప్రభుత్వమే దగ్గరుండి మరీ మేలు చేకూరుస్తుంటే తెలంగాణవాదులంతా నిశ్చేష్టులై చూస్తున్నారు.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడితే.. రామోజీ ఫిలింసిటీని లక్ష నాగళ్లతో దున్నిస్తానన్నది ఉద్యమ సమయంలో కేసీఆర్ ఇచ్చిన నినాదం. మరేమైంది? మాటలకు-ఆచరణకు మధ్య ఇంత అగాథం ఎందుకొచ్చింది?. ఉద్యమ స్పూర్తి స్థానంలో ఏ రాజకీయ అవకాశవాదం చొరబడింది.

లక్ష నాగళ్లతో దున్నించడం సంగతి అటుంచితే.. ఒకప్పుడు ఫిలింసిటీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డ ఆ నోరు.. ఇప్పుడదే ఫిలింసిటీ 'తెలంగాణకు గర్వ కారణం' అంటూ ఓ స్టేట్‌మెంట్ కూడా ఇచ్చేదాకా వచ్చింది. అదే తీరును కొనసాగిస్తూ ఇప్పుడు మరికొన్ని వందల ఎకరాలను ఫిలింసిటీకి కట్టబెట్టేందుకు కేసీఆర్ సర్కార్ సిద్దమైంది. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే.. అబద్దాలను విని మోసపోయిందెవరు?, ఆంధ్రా పెట్టుబడిదారులకు మేలు చేకూర్చేందుకే తెలంగాణ రాష్ట్రం ఏర్పడినట్టా?..

ఫిలింసిటీకి 295 ఎకరాలు:

ఫిలింసిటీకి 295 ఎకరాలు:

ఇప్పటికే దాదాపు 1600ఎకరాల్లో విస్తరించి ఉన్న రామోజీ ఫిలింసిటీ మరింత విస్తరించే ప్రయత్నం చేస్తోంది. ఇందుకు ప్రభుత్వం కూడా సానుకూల స్పందించడంతో మరో 295ఎకరాలు ఇప్పుడు ఫిలింసిటీకి కట్టబెట్టారు అధికారులు. అంతేకాదు, అదనంగా మరో 81ఎకరాలు అప్పగించేందుకు కూడా సిద్దంగా ఉన్నామన్న సంకేతాలు సర్కార్ పంపించింది.

ఒకప్పుడు హౌజింగ్ కే కేటాయించిన భూమి:

ఒకప్పుడు హౌజింగ్ కే కేటాయించిన భూమి:

కేసీఆర్ సర్కార్ ప్రస్తుతం రామోజీ ఫిలింసిటీకి కేటాయించిన భూమి ఒకప్పుడు పేద కుటుంబాల కోసం వైఎస్ రాజశేఖర్ ప్రభుత్వం కేటాయించింది. కానీ ఏళ్లుగా ఆ భూమి నిరుపయోగంగానే ఉండటంతో ఇప్పుడు దాన్ని ప్రభుత్వం ఫిలింసిటీకి అప్పజెప్పింది. ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని నాగన్‌పల్లి, అబ్దుల్లాపూర్‌మేట్ పరిధిలోని అనాజ్‌పూర్ లో ఈ భూమి ఉన్నట్లు సమాచారం.

మారిన పరిణామాలు:

మారిన పరిణామాలు:

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన సుమారు ఆరు నెలలకు కేసీఆర్-రామోజీ మధ్య భేటీ మొత్తం తెలంగాణను షాక్ కు గురిచేసింది. రామోజీ ఆహ్వానం మేరకు ఫిలింసిటీలో అడుగుపెట్టిన కేసీఆర్.. మొత్తం అంతా కలియదిరిగి ఫిలింసిటీని, దాని సృష్టికర్త రామోజీని ఆకాశానికెత్తేశారు. రామోజీ ఫిలింసిటీకి ఏ అవసరమొచ్చినా ప్రభుత్వం సహాయం అందించడానికి సిద్దంగా ఉందంటూ ప్రకటించేశారు.

విమర్శల మాటేంటి?

విమర్శల మాటేంటి?

కేసీఆర్ రామోజీ ఫిలింసిటీని ఆకాశానికెత్తడంతో ఆయనపై విమర్శలు తీవ్రతరం అయ్యాయి. ఇందుకు ఆయన చెప్పిన సమాధానం కూడా చాలామంది తెలంగాణ వాదులను ఆగ్రహానికి గురిచేసింది. అసలు రామోజీ ఫిలింసిటీలో ఒక్క అంగుళం కూడా ప్రభుత్వ స్థలం లేదంటూ కేసీఆర్ ఇచ్చిన సమాధానం.. ఒకప్పుడు లక్ష నాగళ్లతో దున్నిస్తా అన్నది ఈయనేనా? అన్న సంశయం తలెత్తేలా చేసింది. ఉద్యమ సమయంలో లక్ష నాగళ్లతో ఫిలింసిటీని దున్నిస్తానని పేర్కొంటూ.. ఈనాడు పేపర్‌ను సైతం కేసీఆర్ ఓ ఉద్యమ వేదికపై కాల్చేశారన్న వాదనలున్నాయి.

ప్రాజెక్టులు కూడా సీమాంధ్ర కాంట్రాక్టర్లకే:

ప్రాజెక్టులు కూడా సీమాంధ్ర కాంట్రాక్టర్లకే:

ప్రస్తుత తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం నిర్మిస్తున్న చాలావరకు ఇరిగేషన్ ప్రాజెక్టులు సీమాంధ్ర పెట్టుబడిదారుల చేతుల్లోనే ఉన్నాయన్న బలమైన ఆరోపణ ఉంది. అటు ప్రాజెక్టులు వారి చేతుల్లోనే పెట్టి.. ఇటు రామోజీరావు లాంటి పెట్టుబడిదారులకు ప్రభుత్వమే దగ్గరుండి మరీ మేలు చేకూరుస్తుంటే తెలంగాణవాదులంతా నిశ్చేష్టులై చూస్తున్నారు.

దళితులకు మూడెకరాలు మాటేది?

దళితులకు మూడెకరాలు మాటేది?

రామోజీ ఫిలింసిటీకి మరో 295ఎకరాలు కట్టబెట్టారు అనగానే.. వెంటనే రాష్ట్రంలో అందరికి గుర్తొచ్చేది దళితులకు మూడెకరాల హామి. దళిత నిరుపేదలకు భూ పంపిణీ చేయడానికి తటాపటాయించే ప్రభుత్వం.. రామోజీ వంటి పెట్టుబడిదారులకు మాత్రం ఆగమేఘాల మీద వందల ఎకరాలను కట్టబెడుతుందన్న విషయం దీనితో స్పష్టమైందని పలువురు తెలంగాణవాదులు అభిప్రాయపడుతున్నారు.

English summary
Telangana Government decided to sanction 295 acres of assigned land to Ramoji Film City through the Tourism Department.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X